బాలబాలికలు ఊహ వచ్చిన దగ్గరి నుంచి పరిసరాలను పరిశీలించి అనుకరించడానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి నిరంతరం దృష్టి పెడతారు. పెరుగుతున్న పిల్లలు తల్లిదండ్రుల, పరిసర వ్యక్తుల ప్రభావానికి మానసికంగా గురవుతారు. చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా బాల్యాన్ని ప్రభావితం చేస్తాయి. చెట్లను క్రమబద్ధంగా పెంచినట్లే, పిల్లలను కూడా ఒక పద్ధతి ప్రకారం పెంచి పెద్ద చేసే అవకాశం ఉంటుంది.
నేటి బిజీ లైఫ్లో పిల్లల మీద తల్లిదండ్రుల శ్రద్ధ అంతంత మాత్రమే. ఆర్థిక అవసరాల వల్ల, ఉద్యోగ బాధ్యతల వల్ల తల్లిదండ్రులు పిల్లలపై తగిన శ్రద్ధ చూపించలేకపోతున్నారు. చంటిపాపల సంరక్షణ కేంద్రాల్లో గాని, ఆయాల వద్ద గాని, వృద్ధులైన పెద్దల వద్ద గాని పిల్లల్ని వదిలివేస్తున్నారు. అతి పిన్న వయసులోనే పిల్లల్ని పాఠశాలలకు పంపిస్తున్నారు. ఒకవిధంగా ఇప్పటి కాలంలో చిన్నపిల్లల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రుల నుంచి శిశు సంరక్షణ కేంద్రాలకు, నర్సరీ పాఠశాలలకు మారింది. బాల్యంలోని హెచ్చు సమయం పాఠశాలల వద్ద, అధ్యాపకుల వద్దనే గడిచిపోతున్నది. ఆ విధంగా నేటి బాలబాలికలను తీర్చిదిద్దుతున్నది ఉపాధ్యాయ వర్గమే అని చెప్పాలి. పిల్లలకు బాల్యంలో ఉండే కుతూహలాన్ని, జిజ్ఞాసను ఆధారంగా చేసుకొని, వారిని సక్రమ మార్గంలో నడిపే బాధ్యత అధ్యాపకులది. బాల బాలికల్లో అధ్యయనం, అన్వేషణ, ఆసక్తి, శ్రమతో కూడిన కృషి, విచక్షణా జ్ఞానం, నైతిక ప్రవర్తన సమకూరేటట్లు అధ్యాపకులు కృషిచేయాలి. ఆటపాటల ద్వా రా, కథలు చెప్పడం ద్వారా, పుస్తకాలు చదివి వినిపించడం, చదివించడం ద్వారా బాలబాలికలను ప్రయోజకులుగా తీర్చిదిద్దవచ్చు. అప్పుడే వాళ్లు సరైన పౌరులుగా, పరిపాలనాదక్షులుగా, శాస్త్రజ్ఞులుగా, సాంకేతిక నిపుణులుగా, వ్యాపారదక్షులుగా ఎదిగే అవకాశం ఉంటుంది.
విజ్ఞానం నిత్యచైతన్యమైనది. మార్పు చెందుతున్న విజ్ఞాన అవకాశాలను, విజ్ఞాన సంపదను అందిపుచ్చుకునే విధంగా విద్యావిధానం ఉండాలి. అధ్యాపకులు, విద్యార్థులు పాఠ్యాంశాలే కాక విస్తరిస్తున్న విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు గ్రంథాలయాల ఆవశ్యకత గురించి చెప్పవలసిన అవసరం ఉంది. విద్యార్థుల్లో పఠనాసక్తిని అభివృద్ధి చేసేందుకు, వారికి అభిరుచి ఉన్న విజ్ఞానశాలలో పరిపూర్ణత పొందేందుకు గ్రంథాలయాల అవసరం ఉన్నది. గ్రంథాలయాల ద్వారా చదువుకునే అలవాటును చిన్న వయసులోనే విద్యార్థులకు అలవర్చాలి. స్వయం విద్య కోసం పుస్తకాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే పద్ధతులను తెలియజేయాలి. సాహిత్యాభివృద్ధిని పెంపొందించాలి. విరామ సమయంలో గ్రంథాలు, గ్రంథాలయాల ఉపయోగాన్ని తెలియజేయాలి. ఇవి విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణులై లబ్ధి పొందేందుకు ఉపయోగపడాలి. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను గ్రంథాలు, పటాలు, ఆడియో, వీడియో సామగ్రి ద్వారా విద్యార్థులకు సులువుగా విజ్ఞాన విషయాలను తెలియపరిచేందుకు ఉపయోగించాలి. విద్యార్థులు తమ తరగతి అసైన్మెంట్లు రాయడానికి అవి ఉపయోగపడాలి. అధునాతన విజ్ఞానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చి, వారి అభివృద్ధికి దోహదపడాలి. వారిని బాధ్యతాయుతులైన భావిపౌరులుగా తీర్చిదిద్దడానికి కృషిచేయాలి.
మొత్తానికి పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో ప్రయోజనకరమైన ఆలోచనాసరళిని పెంపొందించడానికి ప్రయత్నించాలి. ఉపయోగపడే పని అలవాట్లను, విద్యా నిపుణతను అలవడేటట్లు చేయాలి. సరైన సామాజిక దృక్పథాలను బోధించాలి. బహుళ వ్యాపకంగా ఆసక్తులు పొందేట్టుగా చేయాలి. సామాజిక అభివృద్ధికి సామాజిక స్పృహను కలగజేసేవిధంగా పనిచేయాలి. సంగీతం, లలితకళలు, సాహిత్యం రసానుభూతి ఇతోధికంగా గ్రహించగలిగేటట్టు చూడాలి. వ్యక్తిపరంగా సమాజంలో సర్దుకుపోగల మెలకువను అభివృద్ధి పరచాలి. ముఖ్యమైన సమాచారాన్ని ఎలా సేకరించాలో తెలుపగలగాలి. శారీరక, మానసిక ఆరోగ్యం అభివృద్ధి చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని గమనించాలి.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ)
-జూలూరు గౌరీశంకర్