ఆవు పెండదెచ్చీ కోలూ – ఆకిట్లో అలికీ కోలూ
బసవని పెండదెచ్చీ కోలూ – బొడ్డెమ్మా జేసీ కోలూ
గునుగుపూలు అద్దీ కోలూ – గుమ్మడి పువుబెట్టి కోలూ.
మనిషి ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో పెరిగి ప్రకృతి ద్వారా జీవన విధానాలు నేర్చుకుని ప్రకృతిలోనే లయమవుతాడు. మనిషి మనుగడకు ప్రకృతే సర్వస్వం. ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మనిషి జీవితంలో మార్పులు జరుగుతాయి. కరువుకాటకాలు, అతివృష్టి, అనావృష్టి మొదలైన వాటిని ఎదుర్కొని సుఖాలు పంచుకోవడానికి ప్రకృతిని ఆరాధించడం నేర్చుకున్నారు. ప్రకృతిని స్త్రీ పరంగా పూజించే సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ. ప్రకృతిలో లభించే పూలతో బతుకమ్మను పేర్చి ఆడి, పాడి ప్రకృతిలోకి సాగనంపే పూర్తి ప్రక్రియను ప్రకృతి పూజ అనవచ్చు.
బతుకమ్మ పండుగ వాతావరణంలో ప్రకృతిని పూజించే విధానం కనిపిస్తుంది. ప్రకృతితో ఎక్కువ సమయం గడిపే పండుగ ఇది. ప్రకృతిలో గడపడం వాటిని చూడడం ఎంతో ఆనందాన్నిస్తుంది. పారే ఏరు, పర్వతాలు, చెట్లు చేమలు, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇవన్నీ మనిషిని ఆకర్షింపజేస్తాయి. వాటితో గడిపినప్పుడు మనిషి అంతర్ముఖుడవుతాడు. తన గురించి తాను ఆలోచిస్తాడు. తన పుట్టుక, గిట్టుట మధ్య జీవితంలోని త త్వం గురించి ప్రశ్నించుకుంటాడు. ప్రకృతికి తనకు గల సంబం ధం గురించి తర్కించుకుంటాడు.
బతుకమ్మ పండుగ సందర్భంగా పల్లెజనులు పూల కోసం ప్రకృతిలోకి వెళతారు. బతుకమ్మ ఆట, పాట అంతా ప్రకృతిలోనే. బతుకమ్మను సాగనంపడం కూడా ప్రకృతిలోనే సాగుతుంది. బతుకమ్మ పండుగ నెల్లాళ్లు ప్రకృతితో మానవునికి సంబంధం ఏర్పడుతుంది. ప్రకృతిని పరిరక్షించాలనే భావన నెలకొంటుంది. బతుకు పండుగలాగా సంబురంగా సాగిపోవాలని బతుకమ్మ పండుగ నేర్పిస్తుంది. జీవితానికి ప్రకృతికి గల సంబంధాన్ని కృతి రూపంలో తెలియజేస్తున్నది. తరతరాల సంస్కృతి పెట్టెను తెరిచి ఆచారాల సంపదను వారసత్వంలా అందిస్తుంది. అనుబంధాలు బలపడడానికి బతుకమ్మ వారధిలా నిలుస్తుంది. మనిషికి ప్రకృతికి గల సంబంధాలను నిరూపిస్తుంది.
బతుకమ్మ పండుగ వర్షాకాలంలో వస్తుంది. ప్రకృతి తలార స్నానం చేసి కొత్త చిగుళ్ల వలువలు ధరించి పూలగుత్తుల సొమ్ములు పెట్టుకుని శోభాయమానంగా తయారవుతుంది. కనుచూపుమేరా చూపు మరల్చుకోలేని అందం. ఇవన్నీ చూడాలంటే ప్రకృతిలోకి వెళ్లాల్సిందే. బతుకమ్మ పూలన్నీ అడవి పూలే. బతుకమ్మను గునుగు, కట్టాయి, తంగేడులతో పేర్చి పైన బం తు లు గాని గుమ్మడి గాని శిఖరంలా పెడతారు. తిరిగి చెరువులో సాగనంపుతారు. ఈ పూలు ఒడ్డుకు చేరి అక్కడ ఫలదీకరణ చెంది మొలుస్తాయి. ఈ పూలు సేకరించడంలో తిరిగి సాగనంపడంలో రెండింటిలోనూ ప్రజలు ప్రకృతికి దగ్గరవుతారు. ప్రకృతిపట్ల భక్తి భావం ఏర్పడుతుంది. ప్రకృతి నుంచి పుట్టిన బతుకమ్మ ప్రకృతి వ్యాప్తికి మూలం కావడం విశే షం. దీనికి ఉదాహరణగా ఈ పాటను చూద్దాం.
జొన్నల పుట్టిన గౌరమ్మ – జొన్నల పెరిగిన గౌరమ్మ
వడ్లల్లో పుట్టిన గౌరమ్మ – వడ్లల్లో పెరిగిన గౌరమ్మ.
బతుకమ్మ పాటలు జీవ వైవిధ్య పాఠాలు.బతుకమ్మ పాటల్లో తమ జీవన విధానం, కష్ట సుఖాలతోపాటు తమ చుట్టూ ఉన్న ప్రకృతిలోని పశుసంపదను జంతుజాలాన్ని పక్షులను వృక్షజాతిని వర్ణిస్తూ అనేకమైన పాటలను కూర్చుకున్నారు.
పూర్వం అత్తగారింటికి ఆడపిల్లను సాగనంపే సందర్భంలో ఆవు లేగలను కానుకగా ఇచ్చేవారు. బొడ్డెమ్మలను గ్రామాలలో ఆవు పెండతో తయారుచేస్తారు. ఆవుపేడతో అలికి దానిపైన ముగ్గు వేసి బతుకమ్మను పెడతారు.
అన్న ఏమన్నడే ఉయ్యాలో – ఓ రామసిలక ఉయ్యాలో
అన్న ఆవులేగ ఉయ్యాలో – ఇస్తరమ్మన్నడే ఉయ్యాలో
పల్లె ప్రజలు పశువులను ప్రాణం కన్నా మిన్నగా సాదుకుంటారు. వ్యవసాయానికి జీవనాధారం పశువులే. వాటి ఆరోగ్యానికి కావలసిన రక్షణ చర్య లు తీసుకుంటారు. కుటుంబంలో వాటికి స్థా నం ఉంటుంది. ఆవులే సంపదగా గల నాటి కాలం పాటలైనా నేటికినీ పశువుల పెంపకం ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. సృష్టి సమతుల్యతకు అన్ని జీవులు అవసరమే అని ఈ పాటల ద్వారా మనం నేర్చుకోవచ్చు. మనిషి మనుగడకు ప్రకృతిలో ప్రతి జీవి అవసరమే. ఒక జీవి జీవనం మరొక జీవి జీవనానికి పూరకంగా పనిచేస్తుంది. ప్రతి మొక్క, ప్రతి పువ్వు, ప్రతి చెట్టు మనిషి ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి అవసరమే. కాబట్టి ప్రకృతిని పరిరక్షించుకోవడం మనిషి ప్రథమ కర్తవ్యం. ఈ విధంగా బతుకమ్మ పండుగ జీవవైవిధ్యం ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది.
-డా. శారదా హన్మాండ్లు , 99122 75801