అస్తిత్వ పోరాటాల కంటే ఆస్తు లు నిలబెట్టుకునే పోరాటా లేం చిన్నవికావు’ అనే ఆర్థికాంశం కేంద్రంగా మారుతున్న ఊర్ల మూలతత్వాన్ని చర్చించిన భిన్నమైన నవల ‘ఊరుగాని ఊరు’. తెలుగు కథావరణం లోకి ‘ఇత్తు’, ‘మైదాకు వసంతం’ కథా సంపుటులతో వైవిధ్య ఇతివృత్త స్వరాన్ని వినిపించిన కోట్ల వనజాత నవలా ప్రక్రియలోకి కలం మోపడం ఆనందదాయకం. రచయిత్రి వనజాత తన గ్రామ మూలాల్లోంచి పయనిస్తూ వేగంగా మా రిపోతున్న ఊరుగానిఊర్ల వర్తమాన దృశ్యాన్ని ఇలా నవలీకరించారు.
‘ఊరుగానిఊరు’ వనజాత తొలినవల అంటే నమ్మలేం. తన కథ ల్లో సాధారణ కౌటుంబిక విషయాలకు తక్కువ ప్రాధాన్యతనిస్తూ సామాజిక, రాజకీయ పరిణామాల ప్రభావాలను కథనంగా మల చడం రచయిత్రి ప్రత్యేకత. ఈ నవల కూడా ఆ బాటలోనే నడిచింది.
‘ఊరుగాని ఊరు’ లోని మూడు స్త్రీ పాత్రల కేంద్రంగా ప్రధానమైన విషయాలను చర్చించారు. రత్నమ్మ, వాసంతి వైవాహిక జీవితాల్లోని అసంతృప్తి, పురుషాధిపత్య భావజాల గాయాలు, అనుమానాలు, అసంతృప్తుల మధ్య ఊగిసలాట, వెంటాడే వేదన, అంతర్లీన బాధామయ దుఃఖ ప్రవాహాలలో మునిగిన జీవితాలు. ఒకటా రెండా అనేక అంశాలను రేఖామాత్రంగా స్పర్శిస్తూనే తెలియని బరువును మోపుతారు రచయిత్రి. ఈ నవల ‘అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ ’ ప్రథమ నవలా పురస్కారానికి ఎంపికవడం సంతోషకరం.
– డాక్టర్ జె.నీరజ