కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు చిరుదివ్వె కూడా దేదీప్యమానమై విరాజిల్లుతుంది. చీకటి నిండిన బతుకులకు దారి చూపుతుంది. అసమర్థ పాలకుల చేతిలో కునారిల్లుతున్న దేశానికి దారిచూపే చిరు దివ్వెలా ఆవిర్భవించింది భారత రాష్ట్ర సమితి. దేశంలోనిఅసమానతల కారు చీకట్లను తరిమి వేసేందుకు కోటి సూర్య ప్రకాశకుడిలా మారారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
తెలంగాణ సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ గమ్యాన్ని ముద్దాడింది. సమైక్య కుట్రలకు ఎదురొడ్డి, సబ్బండ వర్గాలను ఏకం చేసి స్వరాష్ర్టాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ చరిత్రకెక్కింది. ఆనాటి నుంచి నేటి వరకూ గులాబీ పార్టీకి ఉద్యమాల తెలంగాణ గడ్డ కంచుకోటగా నిలబడింది. సమైక్య పాలన, స్వరాష్ట్రంలోనూ ‘కారు’ జోరుకు అడ్డే లేకుండా పోయింది. అయితే, దేశ రాజకీయ యవనికపై శూన్యత ఏర్పడిన తరుణంలో కేసీఆర్ ఎంతో సాహసంతో ముందడుగు వేశారు. సంక్షోభంలో చిక్కుకున్న భారతావనిని మేల్కొలిపి, సంక్షేమ బాటలో నడిపేందుకు జాతీయ రాజకీయాల వైపు ప్రయాణం ప్రారంభించారు. అందులో భాగంగానే టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. భారతావని బాగు కోసం బయల్దేరిన బీఆర్ఎస్కు యావత్ తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు.
ఒకనాడు కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో సిరులు పండేలా చేసిన ఉద్యమ వీరుడు మరో అడుగు ముందుకు వేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో భారత రాష్ట్ర సమితి ప్రస్థానాన్ని ప్రారంభించారు. రత్నగర్భ అయిన మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలిపేందుకు ఆర్థిక, మహిళా సాధికారత, జల, రైతు విధానాలను రూపొందిస్తామని ప్రకటించి సరికొత్త మార్పునకు నాంది పలికారు కేసీఆర్.
జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని కేసీఆర్ సంకల్పించారు. ఇదేమీ జాతీయరహదారి కాదు. అడుగడుగునా ముళ్లబాట. సరిగ్గా తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ళే. ఆ చిక్కు ముళ్ళన్నీ ఒక్కొక్కటిగా తొలగించుకొని ముందుకు సాగి విజయం సాధించిన కేసీఆర్ తన ‘ఉద్యమ అనుభవాల’ను రంగరించి జాతీయ రాజకీయాలలోనూ అమలు చేసే అవకాశాలున్నా యి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో దేశంలో ఆయనకంటూ ప్రత్యేకమైన ‘బ్రాండ్ ఇమేజ్’ సంపాదించుకున్నారు. ఆ పథకాలనే ఆయ న అస్ర్తాలుగా మలచుకుంటున్నారు.
మోదీకి వ్యతిరేకంగా ఎవరెన్ని విధాలుగా మాట్లాడినా ‘బీజేపీ ముక్త్ భారత్’ అనే నినాదాన్ని సంధించిన మొదటి నాయకుడు కేసీఆర్. భాషా పటిమ, వ్యూహరచన శక్తి, ప్రజల్లో, కార్యకర్తల్లో సూటిగా నాటుకుపోగలిగేలా కమ్యూనికేట్ చేయగలగడం కేసీఆర్ కవచ కుండలాలు. మోదీ గద్దె దిగాలని కాంక్షించడం వేరు. ఆయనను గద్దె దింపాలని సంకల్పించడం వేరు. సంకల్పం ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ సంకల్పాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కావలసింది భావవ్యాప్తి నైపుణ్యం. ఆ నైపుణ్యం సీఎం కేసీఆర్‌లో పుష్కలంగా ఉన్నది.
టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్గా గుర్తింపు లభించడంతో భారత దేశ చరిత్రలో కొత్త శకం మొదలైంది.
బీఆర్ఎస్ గుర్తింపు నేపథ్యంలో తెలంగాణ తరహాలో దేశ ప్రజలకు సంక్షే మ పథకాలను అమలు చేసే బృహత్తర బాధ్యత సీఎం కేసీఆర్ తన భుజాలపైకి ఎత్తుకున్నారు. దేశ ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో అడుగులు వేయడం శుభసూచకం.
దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చారిత్రక అవసరం. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం లో కాంగ్రెస్ పారీ,్ట ఇతర పార్టీలు విఫలమయ్యాయి. ఈ దశలో దేశ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులపై పూర్తి అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరం. దేశ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి స్వేచ్ఛ, సమానత్వాన్ని సాధించేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వం చారిత్రక ఘట్టానికి తెరలేపింది. తెలంగాణ ప్రయోజనాల పట్ల కేంద్రం వివక్ష పూరిత విధానాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ద్వారా అవకాశం కలుగుతున్నదని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రజల మనోభావాలను ప్రతిబింబించే పాలన సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది.
చూస్తే బక్కపల్చనివారే కానీ అద్భుతమైన మేధా సంపత్తి కలవారు కేసీఆర్. ఎంతటి ప్రత్యర్థినైనా మట్టి కరిపించే వ్యూహ చతురుత కలవారు. అద్భుత వాక్పటిమతో ప్రతిపక్షాల నోరు మూయించడంలో దిట్ట. ఎంతటివారినైనా నొప్పించక ఒప్పించే తత్వం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో అందెవేసిన చేయి. తెలంగాణ తల్లి దాస్య విముక్తికై జన్మించిన కారణజన్ముడు. మాతృదేశ రక్షణకై భారత రాష్ట్రసమితి అవతరించిన వేళ దేశమంతా జయహో నినాదాలతో నీరాజనాలు పలుకుతున్నది. ఇక యావత్ భారత దేశానికి భాగ్యోదయం.
– దామా లలిత్ చౌదరి, 94403 05165