విద్యావ్యవస్థలో రోజురోజుకు కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్య ‘ఉద్యోగ సముపార్జనే’ లక్ష్యంగా మారిపోయింది. స్థూలంగా విద్య రెండు దశల్లో ఉంటుంది. మొదటిది పాఠశాల విద్య కాగా, రెండవది కళాశాల విద్య. పాఠశాల విద్యలో సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇలా అన్ని సబ్జెక్టులపై విద్యార్థికి బోధన జరుగుతుంది. కళాశాల విద్యకు వచ్చేసరికి విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీకాం కోర్సు ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య 77,017. ఇంజినీర్ కోర్సుల్లో చేరినవారి సంఖ్య (61,702)ను మించిపోయింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి లెక్కల ప్రకారం.. 2022-23 సంవత్సరంలో కోర్సులవారీగా డిగ్రీ అడ్మిషన్లను పరిశీలిస్తే.. సుమారు రెండు లక్షల మంది డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరగా, వారిలో 77,017 (40.46 శాతం) మంది బీకాం, 42,056 (22.07 శాతం) మంది బీఎస్సీ లైఫ్, సైన్స్, 30,223 (15.86 శాతం) మంది బీఏ, 29,939 మంది బీఎస్సీ ఫిజికల్ సైన్స్, 7,933 (4.16 శాతం) మంది బీబీఏ, బీబీఎం, 2,557 (1.34 శాతం) మంది బీసీఏ, 624 (0.33 శాతం) మంది డీ ఫార్మసీ, 91 (0.05 శాతం) మంది బీఎస్‌డబ్ల్యూ కోర్సులను ఎంచుకున్నారు.
కళాశాల విద్యలో తిరిగి రెండురకాల కోర్సులుంటాయి. మొదటిది వృత్తివిద్యా కోర్సులైన ఇంజినీరింగ్, డాక్టర్ మొదలైనవి. రెండవది సంప్రదాయ కోర్సులు. వీటిలో బీఏ, బీఎస్సీ, బీకాం వంటివి గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) స్థాయిలో, ఎంఏ ఎంఎస్సీ, ఎం.కాం., ఎంబీఏ తదితర కోర్సులు పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉన్నాయి. అయితే గత కొన్నేండ్లుగా డిగ్రీస్థాయిలో బీఏ, బీఎస్సీ కోర్సులకు ఆదరణ లభించడం లేదు. మెజారిటీ విద్యార్థులు బీకాం కోర్సు వైపే మొగ్గు చూపుతున్నారు. కొన్ని కళాశాలల్లోనైతే బీఏ, బీఎస్సీ వంటి కోర్సులను తీసివేసి బీకాం కోర్సుతో మాత్రమే నడిపిస్తున్నారు. ఇలాంటి కళాశాలలు ‘నూతన విద్యా విధానం-2020’ను అమలు చేయలేవు. ఎందుకంటే ఈ విధానంలో విద్యార్థికి కోర్ సబ్జెక్టులతో పాటు ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కచ్చితంగా ఇతర కోర్సుల నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సంప్రదాయ కోర్సుల్లో భాగమైన బీఏ, బీఎస్సీలు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. వేలమంది ఉపాధ్యాయులపై కాకుండా పాఠశాల విద్యావ్యవస్థపై కూడా ఈ ప్రభావం పడుతుంది. ఇప్పటికే ప్రైవేట్ కళాశాలలు బీఏ కోర్సును బోధించడం లేదు. విద్యార్థుల సంఖ్య లేకపోతే ఆయా కోర్సులు కలిగిన ప్రభుత్వ కళాశాలలు సైతం మూతపడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా బీఏ, బీఎస్సీలలో తగిన నమోదు లేకపోతే ఆ ప్రభావం పాఠశాల విద్య నాణ్యతపై పడుతుంది. ఎందుకంటే, పాఠశాల విద్యలో విద్యార్థికి సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇతర అంశాలపై బోధన చేయాలంటే ఆయా కోర్సులలో నమోదు తగ్గడం వల్ల కాంపిటీషన్ తగ్గి, నాణ్యమైన అధ్యాపకుల ఎంపికపై ప్రభావం పడుతుంది. కాబట్టి, బీఏ, బీఎస్సీలపై ఆదరణ పెరిగేవిధంగా ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకోవాలి. బీఏ, బీఎస్సీలోనూ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా నూతన కోర్సులను ప్రవేశపెట్టడంతో పాటు, ఇంటర్మీడియట్ నుంచి బీఎస్సీలో ప్రవేశానికి సంబంధించి నిబంధనలను సులభతరం చేయాలి.
వ్యాపార, మార్కెటింగ్‌రంగంలో వచ్చిన మార్పుల వల్ల బీకాం చదివే విద్యార్థికి అవకాశాలు పెరిగాయని కొందరి భావన. టాక్స్ కన్సల్టెంట్, అకౌంటెంట్, ఆడిటర్‌గా సహాయకునిగా మాత్రమే కాక బీకాం చదివిన విద్యార్థికి ప్రత్యక్షంగా లభించే ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. మరి బీకాంలో నమోదు పెరిగేందుకు ముఖ్యకారణం పైన చెప్పినట్లు ఇంటర్మీడియెట్ నుంచి బీఎస్సీలో ప్రవేశానికి సంబంధించి ఉన్న నిబంధన. ఇంటర్మీడియెట్‌లో సైన్స్ గ్రూపు చదివితినే డిగ్రీలో బీఎస్సీ చదువడానికి అర్హులు. అందువల్ల ఎంపీసీ లేదా బైపీసీ విద్యార్థులు వివిధ కారణాల వల్ల కోరుకున్న కోర్సులో, కళాశాలల్లో ప్రవేశం లభించకపోవడంతో బీఏకి బదులు బీకాంను ఎంచుకుంటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో బీకాం చేసినవారి కంటే బీఏ, బీఎస్సీ చేసినవారే అధిక శాతం ఎంపిక కాబడుతున్నారు. ఇది కాదనలేని సత్యం. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు కొన్ని విషయాలు గమనించాలి. బీకాం, బీఏ లేదా బీఎస్సీల్లో ఏ కోర్సు ఎంచుకున్నప్పటికీ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఈ-కామర్స్, మల్టీ నేషనల్ వంటి కంపెనీల్లో ఆయా స్థాయికి తగిన ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి. బీకాం చేసిన విద్యార్థికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగమో, టీం లీడర్ ఉద్యోగమో, మేనేజర్ ఉద్యోగమో లభించదు. నియామక కంపెనీలు విద్యార్థి బీకాం చేశాడా, బీఏ చేశాడా, బీఎస్సీ చేశాడా అనేది చూడటం లేదు. వారికి కావలసినవి కనీస అర్హత డిగ్రీ. ఈ పట్టా ఉంటే ఆయా కంపెనీ ఆపరేషన్లపై కనీసం నాలుగు నుంచి ఆరు నెలల వరకు శిక్షణ ఇచ్చి, అప్పుడు ప్రొడక్షన్లోకి పంపుతారు. అలాగే బీకాం చదివిన విద్యార్థి సీఏ, ఐసీడబ్ల్యూ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను సులువుగా పూర్తిచేయవచ్చు.
కానీ, బీకాం మాత్రమే అర్హత కాదు. కానీ, బీకాం చదివిన విద్యార్థులపై కంపెనీలు వెచ్చించే ట్రైనింగ్ కాస్ట్ ఇతర విద్యార్థుల కంటే తక్కువ అని కంపెనీలు అంటున్నాయి. కారణం, బీకాం విద్యార్థి తన కోర్ సబ్జెక్టులైన అకౌంటింగ్, ఫైనాన్స్, బిజినెస్ లా వంటి ఇతర సబ్జెక్టులతో పాటు కంప్యూటర్ కోర్సులు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను డిగ్రీ స్థాయిలో నేర్చుకోవడమే. కాబట్టి బీఎస్సీ, బీఏ వంటి సంప్రదాయ కోర్సులలో కోర్ సబ్జెక్టులకు అదనంగా అకౌంటింగ్, ఫైనాన్స్ డిజిటల్ మార్కెటింగ్, ఐటీ, కమ్యూనికేషన్ వంటి సబ్జెక్టులను ‘ఎలెక్టివ్స్’గా చేర్చాలి. ముఖ్యంగా బీఏలో అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఎకనోమెట్రిక్స్ వంటి స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టాలి. ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి తదనుగుణంగా నూతన కోర్సుల రూపకల్పన ద్వారా బీఏ, బీఎస్సీ కోర్సులకు పూర్వ వైభవం తీసుకురావచ్చు. వ్యాపార సైకిల్లో వివిధ దశలున్నట్లు, ప్రతీ కోర్సులకు వివిధ దశలుంటాయి. ప్రస్తుత బీకాంకు తిరిగి డిమాండ్ పడిపోకుండా ఇతర కోర్సులకు పూర్తిగా ఆదరణ కరవవకుండా ఉండాలంటే తప్పకుండా వీటిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్-కామర్స్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ)
-డాక్టర్ రామకృష్ణ బండారు
80191 69658