Bangla killings : బంగ్లాదేశ్ (Bangladesh) లో మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం మరో హిందువును కారుతో ఢీకొట్టి చంపారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. మీడియా కథనాల ప్రకారం.. రాజ్బరిలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్లో రిపోన్ సాహా (30) అనే హిందూ వ్యక్తి పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రాజ్బరి జిల్లా యూనిట్ మాజీ కోశాధికారి అబుల్ హషేమ్ పెట్రోల్ కోసం వచ్చాడు. పెట్రోల్ కొట్టించుకున్నాక డబ్బు ఇవ్వకుండా వెళ్లడానికి ప్రయత్నించడంతో రిపోన్ అతడిని అడ్డగించాడు. పెట్రోల్ డబ్బులు ఇవ్వాలని అడగడంతో ఆగ్రహానికి గురైన హషేమ్ కారును రిపోన్ పైకికి ఎక్కించాడు. కారు పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన రిపోన్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అబుల్ హషేమ్ను, అతడి కారు డ్రైవర్ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. కాగా గడిచిన మూడు వారాల వ్యవధిలో బంగ్లాదేశ్లో పది మంది హిందువులు హత్యకు గురికావడంతో అక్కడ హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.