‘ఏ నయవంచక రాజకీయ కాలమానమూ చూపించదు.. ఉద్వేగమైన నిరుద్యోగ భారతాన్ని’ అంటాడు
తెలంగాణ ప్రజా కళాకారుడు, కవి అలిశెట్టి ప్రభాకర్. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో నిరుద్యోగుల ఉద్వేగాన్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి తప్పితే, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు.
రాష్ర్టానికి వస్తున్న పరిశ్రమల్లో అగ్రో ఇండస్ట్రీలే ఎక్కువ ఉంటున్నాయి. అంతర్జాతీయస్థాయిలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక చిన్నపిల్లల వస్త్ర తయారీ పరిశ్రమ కిటెక్స్ సంస్థ తన పరిశ్రమను రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకు వచ్చింది. రూ.2400 కోట్లతో పెట్టుబడులు పెట్టనున్నది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే 40 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. కాగా వారిలో 90 శాతం మహిళా ఉద్యోగులే ఉండటం విశేషం.
పెట్టుబడులకు ఆహ్వానం, పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. గతంలోని ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. సింగిల్ విండో పారిశ్రామిక విధానం, స్నేహపూర్వక దృక్పథం వల్ల రాష్ర్టానికి పెద్ద ఎత్తున కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. నిన్న హాట్సన్, మొన్న అమూల్ సహా కొత్త పరిశ్రమల స్థాపనకు తెలంగాణ నేడు గమ్యస్థానం కావడం హర్షణీయం.
పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. పరిశ్రమలకు రాయితీలతో పాటు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. ‘తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్’ చట్టం చేసి, సులభ విధానం ప్రవేశపెట్టింది. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌కు, తెలంగాణకు పరుగులు పెట్టడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడుతున్నది. పరిశ్రమలకు అనుమతులిచ్చేందుకు పారదర్శక, సరళమైన, అవినీతిరహితమైన విధానాలను ప్రభుత్వం అనుసరిస్తున్నది. దీనివల్లే పలు కంపెనీలు కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడ పెడుతున్నాయి.
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, పవర్, ప్లాస్టిక్, ఇంజినీరింగ్, ఆగ్రోబేస్డ్ గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్టైల్స్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాలకు చెందినవి ఎక్కువగా ఉంటున్నాయి. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం అంతర్జాతీయవేత్తలను ఆకర్షిస్తున్నది. దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడితో ఐకియా సంస్థ ఫర్నిచర్, టెక్స్టైల్ యూనిట్లను ప్రారంభించింది. కోకాకోలా కంపెనీ రూ.1000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెట్టడానికి ముందుకువచ్చింది. ప్రాక్టర్ అండ్ గాంబుల్ రూ.900 కోట్లతో, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రూ.400 కోట్లతో పరిశ్రమలు ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో కేవలం వారం రోజుల్లోనే ఏకంగా రూ.2,950 కోట్ల పెట్టుబడులను సాధించగలిగింది. పశువుల వ్యాక్సిన్ తయారీ కోసం ఇండియన్ ఇమ్యునలాజికల్స్ సంస్థ రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ యూనిట్ ద్వారా 750 మందికి ఉపాధి లభిస్తుంది. ఆభరణాల తయారీ యూనిట్ స్థాపన కోసం మలబార్ గ్రూప్ రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీనిద్వారా 2,750 మందికి ఉపాధి కల్పించి, దేశంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ యూనిట్‌గా ప్రసిద్ధి గాంచనున్నది. రూ.1,100 కోట్ల పెట్టుబడులతో, ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్, జీవీఆర్‌పీ ప్రీ క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఆర్వో) తో పాటు మరో మూడు కంపెనీలకు చెందిన ఐదు ప్రాజెక్టుల ద్వారా దాదాపు 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
కిటెక్స్ పరిశ్రమ ఏర్పాటుతో పన్నుల రూపంలో రాష్ర్టానికి ఆదాయంతో పాటు, 3 లక్షల ఎకరాల్లో పండే మేలిమిరకం పత్తిని ఈ సంస్థ కొనుగోలు చేయనున్నది. తద్వారా రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ, రాష్ట్రంలో వంట నూనెల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకువచ్చింది. ఈ కంపెనీ రూ.400 కోట్ల పెట్టుబడితో రోజుకు 1,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మొదలుకానున్నది. ఇందులో1,000 మందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుంది. ఇతర నూనెగింజల సాగు ఎక్కువగానే ఉంది. ఈ వంటనూనెల తయారీ కంపెనీ రాకతో ఆయిల్‌పామ్ రైతులతోపాటు ఇతర నూనె గింజలు పండించే లక్షల మంది రైతులకు లాభం జరుగుతుంది. రూ.400 కోట్ల పెట్టుబడితో హాట్సన్ జహీరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ యూనిట్ కోసం హాట్సన్ కంపెనీ రాష్ట్రంలోని 5 వేల మంది పాడిరైతుల నుంచి రోజుకు 10 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నదని అంచనా.
ఇదీగాక డెయిరీ రంగంలో ప్రపంచంలోనే ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గతంలోనే ప్రకటించింది. దక్షిణ భారతదేశంలోనే అమూల్ తన తొలి ప్లాంట్‌ను రోజుకు ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటుచేస్తున్నట్లు, భవిష్యత్తులో దీన్ని పది లక్షల లీటర్లకు పెంచుకునే అవకాశం ఉన్నదని తెలిపింది. అమూల్ రాకతోనూ పాడి రైతులకు మరింత మేలు జరగనున్నది. 2014-15 నుంచి 2022-23 వరకు టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 21,756 పరిశ్రమలు కొత్తగా ఏర్పాటయ్యాయి. రాష్ర్టానికి 2 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏకంగా 17 లక్షల 10 వేల మందికి ఉపాధి దొరికిందంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తూ సబ్బండవర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
-బచ్చు శ్రీనివాస్
93483 11117