హైదరాబాద్ : తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ (Phone tapping ) వ్యవహారంలో సిట్ విచారణకు రావాలని నోటీసులు అందజేయడంపై ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డి, అతని మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ఒక్క అధికారి అయినా బయటకు వచ్చి చెప్పగలడా? అంటూ ప్రశ్నించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఒక జర్నలిస్టు కథనం రాస్తే దాని మీద ప్రభుత్వం స్పందించ లేదని ఆరోపించారు. ఇటీవల మంత్రుల వాటాల పంచాయతీలు రాస్తే ముగ్గురు జర్నలిస్టులు బలయ్యారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక, ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులు బలవుతారని వెల్లడించారు.
జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలని జిల్లాల రద్దుకు కుట్ర
జిల్లా పరిషత్ ఎన్నికలు జరుపకుండా తప్పించుకోవాలని, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాలను రద్దు చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా చేశారంటూ రిటైర్డ్ జడ్జిలతో కమిషన్ వేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల , పెద్దపల్లి , జగిత్యాల జిల్లాలను రద్దు చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు.