ప్రపంచవ్యాప్తంగా 3.5 ట్రిలియన్ల మత్స్య సంపద ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పెరుగుతున్న
జనాభాకు అనుగుణంగా ‘బ్లూ రివల్యూషన్’ ద్వారా మత్స్య సంపదను పెంచడానికి ప్రయత్నాలు
ముమ్మరమవుతున్నాయి. జలపుష్పాలు కోట్ల మందికి సహజ ఆహారం. అదే సమయంలో అనేకమంది మత్స్యకారులు తమ జీవితాలను పణంగా పెట్టి, నదీ, సముద్రజలాల్లో పడవులు, బోట్ల
ద్వారా చేపలను వేటాడుతూ మనుష్యులకు ఆహారంగా అందిస్తున్నారు.
తుపాన్లు, సునామీ వంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు మత్స్యకారులకు ప్రభుత్వాలు అండగా నిలబడాలి. వారి పిల్లల చదువులకు సముద్రతీర ప్రాంతాల్లో,వారి ఆవాసాలకు దగ్గరగా పాఠశాలలు ఏర్పాటుచేయాలి. అవసరమైన మేరకు తుపాన్ షెల్టర్లు నిర్మించాలి. క్రమం తప్పకుండా మత్స్యకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సంరక్షణకు చర్య లు చేపట్టాలి.
కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం మహిళలు మత్స్యకారరంగంలో పనిచేస్తున్నారు. మగవారు వేటాడి తెచ్చిన, రకరకాల చేపలు, రొయ్యలు, పీతలు వంటి సుమారు 50 రకాల మత్స్య సంపదను వేరుచేసి, శుభ్రం చేస్తూ సమీప మార్కెట్లలో విక్రయిస్తుంటారు. అంతేకాకుండా కొన్ని చేపలు, రొయ్యలను ఎండు చేపలు (డ్రై ఫిష్)గా, మరి కొన్నింటిని పచ్చళ్లు (పికిల్స్), రెడీ టు ఈట్/ రెడి టు సర్వ్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఒకప్పుడు చేపల తలసరి వినియోగం 9.9 కేజీలుగా ఉంటే నేడు అది 19.2 కేజీలకు చేరుకున్నది. నేటి ఆధునిక కాలంలోనూ చేపల మార్కెట్లు అపరిశుభ్ర వాతావరణంలో, మురుగుకాల్వల పక్కన నిర్వహించడం వల్ల చాలామంది ప్రజలు చేపల వినియోగానికి దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వాలు పరిశుభ్రమైన మార్కెట్లు ఏర్పాటుచేసి, మత్స్యకారులను, వినియోగదారులను ప్రోత్సహించాలి.
76.15 బిలియన్ల చేపలను ఉత్పత్తి చేస్తూ 30 శాతం వాటాతో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆక్వాకల్చర్లోనూ 60 శాతం వాటాతో చైనాదే మొదటిస్థానం. ఇక మన భారతదేశంలో సుమారు 7,517 కిలోమీటర్ల సముద్రతీరం, 195,210 కిలోమీటర్ల నదీ పరీవాహక ప్రాంతం కలిగి 9.60 బిలియన్ల చేపలు ఉత్పత్తి చేస్తూ రెండవ స్థానాన్ని ఆక్రమించింది. భారత్ 90 దేశాలకు మత్స్యసంపదను ఎగుమతి చేస్తున్నది. తర్వాతి స్థానంలో వియెత్నాం, ఇండోనేషియా,అమెరికా తదితర దేశాలున్నాయి.
దేశంలో మత్స్య ఉత్పత్తి ఇన్లాండ్, మెరైన్ అని రెండు పద్ధతుల్లో జరుగుతున్నది. జనాభా పెరుగుదల, ఆధునీకీకరణ, పట్టణీకరణ, నూతన సౌకర్యాలు, నవీన వంటల విధానాలు, రవాణా సౌకర్యాలు, శీతలీకరణ యూనిట్లు తదితర కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చేపల వినియోగం పెరిగింది. దూర ప్రాంతాలకు కూడా తాజాగా తీసుకువెళ్లగలిగే సౌకర్యాలు రావడంతో చేపలు, రొయ్యలు, పీతల వాడకం పెరిగింది. మత్స్యకారులకు గిరాకీ పెరిగి కుటుంబ ఆర్థికవ్యవస్థ బలోపేతం అవడంతోపాటు, దేశ జీడీపీ వృద్ధి చెందేందుకు మత్స్య సంపద తోడ్పడుతున్నది. మత్స్యకార జీవితాల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం కోసం 2005, నవంబర్ 21 నుంచి ఏటా ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని నిర్వహస్తున్నారు. అదే సమయంలో సముద్రాల్లో ఆల్గే, గ్యాస్, పెట్రోల్, ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నీటి వనరులను కాపాడుకోవాలనేది ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
తొలిసారి ఐసీఏఆర్, కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ దినోత్సవం నిర్వహించారు. చేపల్లో 25 శాతం ప్రొటీన్ ఉంటుంది. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో తుపాన్లు, వాయుగుండాలు ఏర్పడినప్పుడు సురక్షిత ప్రాంతాలకు ఎలా చేరాలి, వాతావరణ మార్పులు, హెచ్చరికలు, సూచనలను మత్స్యకారులకు తెలపడానికి సమావేశాలు, సదస్సులు నిర్వహించాలి. మత్స్యకారులకు ఉపాధి కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. వలలు ఇతరత్రా కొనుగోలుకు రాయితీలు ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకం కింద తొలిసారి రూ.20,050 కోట్లు కేటాయించింది. 2024 నాటికి 22 మిలియన్ టన్నుల మత్స్య సంపదను ఉత్పత్తి చేయడంతో పాటు సుమారు 55 మిలియన్ల మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి.
తుపాన్లు, సునామీ వంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు మత్స్యకారులకు ప్రభుత్వాలు అండగా నిలబడాలి. వారి పిల్లల చదువులకు సముద్రతీర ప్రాంతాల్లో, వారి ఆవాసాలకు దగ్గరగా పాఠశాలలు ఏర్పాటుచేయాలి. అవసరమైన మేరకు తుపాన్ షెల్టర్లు నిర్మించాలి. క్రమం తప్పకుండా మత్స్యకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సంరక్షణకు చర్య లు చేపట్టాలి. ఆధునిక పద్ధతిలో వేటాడ టం, భద్రపరచడం, ఎగుమతి చేయడం తదితర పద్ధతులను మత్స్యకారులకు తెలి పి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించినపుడే ఈ మత్సకార దినోత్సవానికి పరమార్థం.
(నేడు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం)
-ఐ.ప్రసాదరావు
99482 72919