రాజ్యాంగబద్ధంగా వ్యవరించాల్సిన గవర్నర్లు రాజ్భవన్లను రాజకీయాలకు కేరాఫ్‌గా మారుస్తున్నారు. కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలకు వారధిలా ఉండాల్సిన గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాము గతంలో పనిచేసిన పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయకుండా కేంద్రం ఆదేశాల మేరకు పనిచేస్తుండటం శోచనీయం.
ఎన్డీయే మిత్రపక్షాలు కాని రాష్ట్ర ప్రభుత్వాలున్న దగ్గర గవర్నర్లు కేంద్రానికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ర్టాలకున్న అధికారాలను కొల్లగొడుతూ సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలిగించేలా కొందరు గవర్నర్ల ప్రవర్తన ఉంటున్నదనే ఆరోపణలు వస్తుండటం గమనార్హం.
రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారకుండా కాలయాపన చేస్తున్నారు. ఆ పదవికే కళంకం వచ్చేలా గవర్నర్లు పనిచేస్తుండటం విడ్డూరం. ఢిల్లీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ గవర్నర్లు ఈ కోవలో ముందున్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను గవర్నర్లు అమలు చేస్తున్నారని సీపీఐ కీలక నేత డి.రాజా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్డీయే మిత్రపక్షాలు కాని రాష్ట్ర ప్రభుత్వాలున్న దగ్గర గవర్నర్లు కేంద్రానికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ర్టాలకున్న అధికారాలను కొల్లగొడుతూ సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలిగించేలా కొందరు గవర్నర్ల ప్రవర్తన ఉంటున్నదనే ఆరోపణలు వస్తుండటం గమనార్హం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు దేశంలోని 23 రాష్ర్టాలకు గవర్నర్లుగా ఉన్నారు.
మిగతా రాష్ర్టాల్లో ఆర్మీ రిటైర్డ్ బ్రిగేడియర్లు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌లు గవర్నర్లుగా నియమితులయ్యారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాల నుంచి పలురంగాలకు చెందిన అనుభవజ్ఞులున్నప్పటికీ వారిని కాదని, బీజేపీ నేతలనే గవర్నర్లుగా నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌గా రాజ్యాంగబద్ధమైన పదవిలో నియమితులయ్యాక పార్టీతో తమ సంబంధాలను చాలామంది వదులుకున్నారు. కానీ, తమిళిసై పనితీరు అలా లేదు. తాను అనుకుంటే ప్రభుత్వమే కూలిపోయేదని, తెలంగాణలో ఏం జరుగుతున్నదో ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసునని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అత్యంత ఖండనీయం.
గవర్నర్‌గా నియామకమైన తర్వాత రెండేండ్లు తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన తమిళిసై, ఆ తర్వాత తన తీరు మార్చుకున్నారు. స్వతహాగా క్రీడాకారుడైన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసినప్పటికీ, ఆ విషయమై ఏ నిర్ణయం తీసుకోకుండా కావాలనే కాలయాపన చేశారు. ఆఖరికి ఆమోదించక తప్పలేదు. అసెంబ్లీ ఉభయసభలు, గణతంత్ర దినోత్సవం నాడు గవర్నర్లు చేసే ప్రసంగం ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించినదై ఉండాలి. 2022 గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. కరోనా నేపథ్యంలో సభ నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, గవర్నర్ తన సొంత ప్రసంగాన్ని చదివారు. 2021-2022 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కూడా తెలంగాణ మంత్రిమండలి ఆమోదించిన ప్రసంగంలో లేని కొన్ని పేరాలను తమిళిసై చదివారు. అయినా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీకాలం ముగిసిన తర్వాత శాసనమండలికి ప్రొటెం చైర్మన్‌గా ఎంఐఎం ఎమ్మెల్సీ అమీనుల్ జాఫ్రీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు చేసింది. దాన్ని గవర్నర్ ఆమోదించలేదు. పైగా ‘ప్రొటెం చైర్మన్ దేనికండీ, నేరుగా చైర్మన్ ఎన్నిక నిర్వహించవచ్చు కదా?’ అన్నారు. ఇలా.. అనేక అంశాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి గవర్నర్‌కు స్వాగతం పలకాలనే నిబంధనలేం లేవు. రాష్ర్టానికి ప్రధాని వచ్చినప్పుడు సీఎస్ వెళ్లి స్వాగతం పలికినట్టుగానే, గవర్నర్ ఆయా జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు కలెక్టర్, ఎస్పీలు వెళ్లి స్వాగతించాలి. సర్కారియా, వెంకటచల్లయ్య కమిషన్లు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. గవర్నర్‌కు హెలికాప్టర్ అందుబాటులో ఉండాలని, ఏర్పాటుచేయాలనే నిబంధన కూడా లేదు. కానీ తెలంగాణ గవర్నర్ నిబంధనలకు విరుద్ధంగా తనకు పలు సౌకర్యాలు కోరుతూ, ప్రొటోకాల్ పాటించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం మీద నింద వేయడం అత్యంత ఖండనీయం.
రాష్ట్ర ప్రభుత్వం 15 యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును తీసుకువచ్చింది. ఆ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు సభ్యులుంటారని తెలిపింది. పదవిరీత్యా ఉన్నత విద్యామండలి చైర్మన్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకూ చైర్మన్‌గా వ్యవహరిస్తారని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 15 వర్సిటీలను ఈ బోర్డు పరిధిలో చేర్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లు కూడా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. గవర్నర్ తమిళిసై తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేశారని తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని, లేనిపక్షంలో రాజ్‌భవన్‌ను ముట్టడి చేస్తామని జేఏసీ హెచ్చరించాకే గవర్నర్ మేలుకున్నారు. ఆ తర్వాతే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు విషయం గురించి ప్రభుత్వాన్ని ఆమె వివరణ కోరారు. నవంబర్ 9న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి మరీ వివరణ ఇచ్చారు. ఇది జరిగి పదిరోజులు కావస్తున్నా గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైనా గవర్నర్ తమిళిసై తన వైఖరిని మార్చుకోవాలి. గవర్నర్లు రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేయాలనే విషయాన్ని ఆమె తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
-సతీశ్‌కుమార్ నూటెంకి
93928 28111