స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి అయినా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంది. ఇందుకు కారణం కేంద్రంలో చాలా ఏండ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీలే కారణం. కాంగ్రెస్ విఫలం అయిందని బీజేపీకి అధికారం ఇస్తే ఆ పార్టీ కూడా దేశాన్ని తిరోగమనం దిశగా తీసుకొని వెళ్తున్నది. ప్రజల కోసం పని చేయాల్సిన కేంద్రం కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా పని చేస్తున్నది. దేశంలో ఎన్నో వనరులున్నా వాటిని వినియోగించుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలం అయ్యింది అందుకే.
తీవ్ర విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణను కేసీఆర్ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలిపారు. మోదీ ముఖ్యమంత్రిగా పని చేసిన గుజరాత్ రాష్ట్రంలో నేటికీ విద్యుత్తు కోతలు, పవర్ హాలిడేస్ కొనసాగుతున్నాయి.
ఏటా వేల టీఎంసీల నదీజలాలు వృథాగా సముద్రం పాలవుతున్నా పట్టించుకునే పాలకుడు లేడు. అందువల్లే అనేక రాష్ర్టాల్లో తాగు నీటి సమస్యతో ప్రజలు బాధలు పడుతున్నారు. అవకాశమే లేని చోట అవకాశం సృష్టించే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి నాయకుడే కేసీఆర్. గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తి పోసి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. ఎత్తుకు నీళ్లు పారించి ఔరా అనిపించుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఎన్నో అద్భుతాలు సృష్టించిన కేసీఆర్ దేశ ప్రధాని అయితే దేశంలో నీటి సమస్యకు తావే ఉండదనేది సత్యం.
ప్రపంచ దేశాలకు అన్నం పెట్టేంత వనరులు ఉన్నా మన దేశం ప్రపంచ ఆకలి సూచీలో 107వ స్థానంలో నిలిచింది. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఫల్యాన్ని సూచిస్తుంది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చింది. రైతులు వీరోచితంగా పోరాడి, 750 మంది అన్నదాతలు ప్రాణత్యాగాలు చేసి ఈ చట్టాలను రద్దు చేయించారు. ప్రధాని మోదీ దేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పుకొన్నారు. ఇదిలా ఉండగా రైతులపై విద్యుత్ సంస్కరణల రూపంలో మరొక కత్తి వేలాడుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే, దేశ రైతాంగాన్ని ఏకం చేసి నరేంద్రమోదీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చి సమర శంఖం పూరించారు కేసీఆర్.
ఉమ్మడి రాష్ట్ర పాలకుల చేతిలో ఛిద్రమై, ఛిన్నాభిన్నమై విలవిలలాడుతున్న తెలంగాణకు 2014లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత.. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందింది. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రంగాలలో రాష్ర్టాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా, రాష్ట్ర జీఎస్డీపీని పలు రెట్లు పెంచి, ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరిచారు. అదే ఎనిమిదేండ్ల క్రితం గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ చేతుల నుంచి పరిపాలన పగ్గాలు తీసుకున్న మోదీ దేశ ఆర్థికపతనానికి కారణం అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విభజన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, తీవ్ర విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణను మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలిపారు. మోదీ ముఖ్యమంత్రిగా పని చేసిన గుజరాత్ రాష్ట్రంలో నేటికీ విద్యుత్ కోతలు, పవర్ హాలిడేస్ కొనసాగుతున్నాయి.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించిన విజయాలు ఎంతో గొప్పవి. మిషన్ కాకతీయతో వేల చెరువులను పునరుద్ధరించారు. గోదావరి నదిపై ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించి సాగునీటి సమస్యను అధిగమించారు. అనేక సాగునీటి ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. కృష్ణా నదిపై డిండి, కల్వకుర్తి మొదలగు ప్రాజెక్టులను పూర్తి చేస్తూ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. గతంలో 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐకి ఇచ్చిన తెలంగాణ నేడు కోటి 40 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐకి అందిస్తున్నది. దేశంలో ఆహార కొరతను తీర్చడంలో పంజాబ్ వంటి రాష్ట్రంతో పోటీ పడుతున్నది. దీన్ని కేసీఆర్ గొప్పతనంగా అభివర్ణించడంలో తప్పేముంది?
రాష్ట్ర ప్రజల దప్పిక తీర్చడానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన తాగు నీటిని అందించటం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితం కాదా? ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లాలనే సదుద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణను విజయవంతంగా చేపట్టారు. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విస్తరించి, నూతన రెవెన్యూ డివిజన్లను, మండలాలను ఏర్పాటు చేశారు. గిరిజనుల తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల దశాబ్దాల కోరికను సాకారం చేశారు కేసీఆర్. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనేలా గ్రామీణ సమాజాన్ని పరిపుష్ఠం చేయడానికి నూతన గ్రామ పంచాయితీ చట్టాన్ని తీసుకొచ్చారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ప్రతి గ్రామంలో రోడ్లు, మురుగు నీటి కాలువలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను నిర్మించి హరితహారం ద్వారా మొక్కల పెంపకాన్ని చేపట్టి తెలంగాణ గ్రామాలను దేశానికి ఆదర్శంగా నిలిపారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలను పెంచడమే కాకుండా కొత్త మున్సిపాలిటీ చట్టం ద్వారా పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు చేసి పట్టణాభివృద్ధికి బాటలు వేశారు.
ఏక కాలంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తూ వెయ్యికి పైగా గురుకుల విద్యాలయాలు, జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలను, సాంకేతిక విద్యా కళాశాలలను ఏర్పాటు చేశారు. జిల్లాకొక మెడికల్ కాలేజీని నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా తెలంగాణ విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు పెరిగాయి. ఇక ఇప్పటికే వివిధ శాఖల్లో లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా కొత్తగా 90 వేల ఖాళీల భర్తీ పక్రియను చేపట్టారు. మరోవైపు ఐటీ రంగంలో ఈ 8 ఏండ్లలో దాదాపు 20 లక్షలు ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.
ఇలాంటి సుపరిపాలనను దేశవ్యాప్తం చేయడానికి, అదే సమయంలో కొన్ని కార్పొరేట్ శక్తుల కోసమే పని చేస్తున్న బీజేపీ పాలనను అంతమొందించడానికి దేశవ్యాప్త రాజకీయ ఉద్యమానికి కేసీఆర్ కార్యోన్ముఖులు అయ్యారు. దేశంలోని మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగ, కార్మిక, కర్షక లోకం కేసీఆర్ నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. మోదీ మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా, దేశరక్షణ కోసం కేసీఆర్కు అందరమూ తోడుగా నిలుద్దాం.
-రఘువీర్ రాథోడ్
99484 80556