భారత ఐటీ రంగం కరోనా కాలంలోనూ వెలుగులు విరజిమ్మింది. ‘ఇంటి నుంచే పని’ చేపట్టి కొవిడ్ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నది. ఉద్యోగులకు అదనపు సౌకర్యాలందిస్తూ అద్భుత ప్రగతి సాధించింది. కానీ ఆ ఐటీరంగమే నేడు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నది. ఒక్క మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య. దీనికి గల కారణాలను పరిశీలిస్తే.. అనేక దేశాలు అధిక ద్రవ్యోల్బణంతో అతలాకుతలమవుతుండటమే ప్రధాన కారణం. దీన్ని అదుపు చేసేందుకు మొదట అమెరికా కేంద్ర బ్యాంక్ఫెడ్ వడ్డీ రేట్లను పెంచింది. ఇదే పద్ధతిని మిగతా దేశాలు అనుసరించాయి. కరోనాకు తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆరంభం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ముంచుకువస్తుందనే భయాందోళనలు మరింత పెరిగాయి.
ద్రవ్యోల్బణం వల్ల ఐటీ రంగం ఆటొమేషన్, రోబోటైజేషన్ వైపు మళ్లే అవకాశాలూ లేకపోలేదు. ఇదే జరిగితే నైపుణ్య లేమితో కాలేజీల నుంచి బయటికొచ్చే లక్షలాది మంది యువత ఐటీ కొలువులు సాధించడం కష్టమవుతుంది.
ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న మాంద్యం గాలులు ఐటీరంగాన్ని నేరుగా తాకాయి. రానున్న 6 నెలల నుంచి ఏడాది లోపు ఐటీరంగానికి ఎక్కువగా మాంద్యం తీవ్రత ఉంటుందని ప్రపంచ దేశాల సీఈఓలు హెచ్చరిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని టెక్ కంపెనీలు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి. దీంట్లోభాగంగానే చిన్న ఐటీ కంపెనీలే కాదు, బడా కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించడంలో తమ వ్యూహాలను అమలుపరుస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా, యూరప్‌లలో నెలకొన్న తాజా ఆర్థికమాంద్యం మన దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపబోదని నిపుణులు చెప్తున్నారు. వీరి ధీమాకు కారణమేమంటే ప్రపంచ సాఫ్ట్వేర్రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నది. విదేశీ ఐటీ దిగ్గజాలకు దీటుగా సమాధానం చెప్పగల కంపెనీలు మన దేశంలోనే ఉన్నాయి. మన ఐటీరంగం దేశీయంగా నిర్వహిస్తున్న కార్యకలాపాల కంటే అంతర్జాతీయంగా వివిధ దేశాల కోసం నిర్వహిస్తున్న కార్యకలాపాలే ఎక్కువ. అంటే మన ఐటీరంగం దాదాపు విదేశీ మార్కెట్లపైనే ఆధారపడి ఉన్నదని అర్థం. భారత ఐటీరంగం ఇంత బలంగా తయారయ్యేందుకు ప్రధాన కారణం అమెరికా, ఐరోపా దేశాలే. దీనికి గల కారణమేమంటే భారత ఐటీ దిగ్గజ కంపెనీలకు పెద్ద ఎత్తున క్లయింట్ల ఆర్డర్లు ఈ దేశాల నుంచే వస్తాయి కాబట్టి. అక్కడ ఆర్థికవ్యవస్థ సరిగా లేకుంటే అది భారత ఐటీ కంపెనీలను కకావికలం చేసే అవకాశం ఉంటుంది.
భారత దిగ్గజ ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ రెవెన్యూల్లో దాదాపు 80 శాతానికి పైగా ఉత్తర అమెరికా, యూరోపియన్ మార్కెట్ల నుంచే వస్తున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ దేశాల్లో ఐటీ కంపెనీలు దెబ్బతింటే.. అది భారత ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై ఎంతగా ప్రభావం చూపిస్తాయో అంచనా వేయడం కష్టం కాదు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకునే దేశీయంగా కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం 18 శాతం నియామకాలు తగ్గాయని వివిధ నివేదికలు చెప్తున్నాయి. దీన్నిబట్టి ఇప్పటికే మన ఐటీరంగంలో సంక్షోభం ఆరంభమైందని తెలుస్తున్నది. సరిగ్గా ఇటువంటి పరిణామాలతోనే 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ (జీఎఫ్‌సీ) వచ్చినపుడు వేలాదిమంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఈసారి కూడా అవే పరిణామాలు జరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, యూరప్‌లలో గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత ద్రవ్యోల్బణం ఉండటమే ఇందుకు కారణం.
భారత వృద్ధి రేటు అంచనాల్లో కోత కూడా ఐటీ రంగంలో సంక్షోభానికి దారి తీసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణాల వల్ల టెక్రంగం నేల చూపులు చూడటం స్పష్టంగా కనిపిస్తున్నది. ఏదేమైనా ఈ మాంద్యం దీర్ఘకాలంగా కొనసాగే ప్రక్రియ మాత్రం కాదు. కానీ, ఈ స్వల్ప కాలంలోనే ఐటీ వ్యవస్థపై మాత్రం దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశమే ఉంది. భారత ఐటీ కంపెనీలకు ఒక ఉపశమనం ఏమంటే రూపాయి విలువ పడిపోయి డాలర్ విలువ పెరగడం. అయితే అమెరికా ఐరోపా దేశాల మార్కెట్లు సజావుగా లేకపోవడం వల్ల ఎంత డాలర్ విలువ పెరిగినా భారత్ టెక్ కంపెనీలకు ప్రయోజనం ఉండదనేది స్పష్టం. ఐటీ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నైపుణ్యం గల సిబ్బందికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే నిపుణుల కొరతను పరిశ్రమ ఎదుర్కొంటున్నది.
ఈ సమయంలో ఉద్యోగం కోల్పోయినవారు లేదా వేతనాల్లో కోత ఎదుర్కొన్న ఉద్యోగులకు అనేక ఇబ్బందులు తథ్యం. ఎందుకంటే ఐటీ ఉద్యోగులు తమకు వచ్చే అత్యధిక వేతనాలను దృష్టిలో ఉంచుకొని వేసుకున్న ప్రణాళికలు బ్యాంకులకు చెల్లించే ఈఎంఐలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ తరుణంలో కంపెనీలు శాశ్వత ఉద్యోగుల స్థానంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించడం మొదలుపెడుతాయి. ఏదేమైనా భారత్‌లో ప్రస్తుతం ఐటీ రంగంలో భయానక పరిస్థితులు మాత్రం లేవనే చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా కాలంలో భారత్ డిజిటల్ ఎకో సిస్టం కొంతవరకూ పెరుగుతూ వచ్చింది. అది ప్రస్తుత సంక్షోభాన్ని కొంత అదిమిపెట్టడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ సంక్షోభం అంతానికి అమెరికా ఐరోపా దేశాలు చేపట్టే చర్యల వల్ల భారత ఐటీ రంగానికి ఉపశమనం కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. నేల చూపులు చూస్తున్న ఐటీరంగం త్వరలోనే కోలుకొని ఉజ్వల భవిష్యత్ దిశగా ముందుకు పోవాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: లెక్చరర్, ఐ.పోలవరం)
-రుద్రరాజు శ్రీనివాసరాజు
94412 39578