స్టేట్ యూనివర్సిటీల్లో ఉప కులపతుల (వీసీ) నియామకాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సర్దార్ పటేల్ వర్సిటీ వీసీ నియామకానికి సంబంధించి అన్వేషణ (సెర్చ్) కమిటీ క్షేత్రస్థాయిలో ప్యానెల్ ఏర్పాటుచేయకపోవడం అందులో ఒకటి. రెండోది.. అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ నియామకానికి సంబంధించి యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా సెర్చ్ కమిటీ ఒకరి పేరు మాత్రమే సిఫారసు చేయడం.
ఈ రెండు తీర్పులు కేరళ గవర్నర్- కేరళ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వీసీల నియామకానికి సంబంధించిన వివాదానికి ఆజ్యం పోశాయి. ఈ తీర్పులను ఆసరా చేసుకొని వర్సిటీల ఛాన్సలర్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్ అన్ని వర్సిటీల వీసీల రాజీనామాకు ఆదేశించారు. వీసీలు రాజీనామాకు నిరాకరించడంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. కేరళ మత్స్య, సముద్ర అధ్యయన వర్సిటీ వీసీ నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడంతో కేరళ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వీసీల నియామక విషయమై యుద్ధం మొదలైంది.
పైన పేర్కొన్న రెండు కేసుల్లో వీసీల నియామకం యూజీసీ నిబంధనల మేరకు జరగాలా లేక రాష్ట్ర యూనివర్సిటీ చట్టం మేరకు జరగాలా అనే చర్చను సుప్రీంకోర్టు లేవనెత్తింది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చట్టాలు చేయవచ్చు. విద్య ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం వెతకాల్సిన అవసరం ఉన్నది. సంబంధిత యూనివర్సిటీ చట్టం ప్రకారం ఛాన్సలర్ వీసీని నియమిస్తారు. కానీ 254 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఉంటే రాష్ట ప్రభుత్వ నిబంధనలు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. యూజీసీ నిబంధనల ప్రకారం వీసీల సెర్చ్ కమిటీలో ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులుండాలి. కాబట్టి ఆ కమిటీలో ఒక్కరినే నియమించిన కేరళ ప్రభుత్వ చట్టం చెల్లుబాటు కాదు. దీన్నిబట్టి యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు చెల్లుబాటు కావని సుప్రీం కోర్టు చెప్తున్నది.
రాజ్యాంగంలోని 254 అధికరణ ప్రకారం.. రాష్ట్ర యూనివర్సిటీ చట్టంలోని నిబంధనలు యూజీసీకి వ్యతిరేకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు నిర్ధారించడం తప్పు! దీనికి చాలా కారణాలున్నాయి. మొదటిది.. ఈ అధికరణ రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంటు చేసిన చట్టాలకు సంబంధించినది. అధికరణ 254(2) ప్రకారం అత్యున్నత చట్టసభలు చేసిందే చట్టం తప్ప దానికి కిందిస్థాయిలో ఉన్న సబార్డినేట్ వ్యవస్థ చేసింది చట్టం కాదు. దీని ప్రకారం యూనివర్సిటీ చట్టాలకు యూజీసీ చట్టంతో సంఘర్షణ వస్తుంది తప్ప యూజీసీ నిబంధనలతో కాదు. రెండోది.. సబార్డినేట్ అథారిటీ రూపొందించిన నిబంధనలను చట్టం వలె పరిగణించలేము. మూడోది.. అధికరణ 13(2)లో చట్టానికి ఇచ్చిన వివరణ ఆ అధికరణకు సంబంధించింది మాత్రమే. నాలుగోది.. కేంద్రానికి చెందిన సబార్డినేట్ అథారిటీ రూపొందించిన నిబంధనలు రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టంపై ఆధిపత్యం చెలాయించేలా, అధిగమించేలా ఉండటం సమాఖ్య నియమాలకు, రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రసాదించిన అధికారాలకు విరుద్ధం. ఐదవది.. వీసీల నియామకాలకు సంబంధించి యూజీసీ నిబంధనలను దాని ప్రొవిజన్లలో ఎక్కడా పేర్కొనలేదు. నిబంధనలు మూల చట్టానికి లోబడి ఉండాలి. కాబట్టి స్టేట్ యూనివర్సిటీల వీసీల నియామకాలకు సంబంధించి యూజీసీ నిబంధనలను వెంటనే పునః సమీక్షించాలి.
సుప్రీంకోర్టు అధికరణ 254ను లోతుగా అధ్యయనం చేయాలి. రాష్ర్టాల హక్కుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు రెండింటి మధ్య సయోధ్య కుదర్చడానికి కోర్టులు ప్రయత్నించాలి. వాటిమధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు ప్రయత్నించాలి. ఇలా చేస్తే ప్రతికూలత పేరిట రాష్ట్ర చట్టాలను కొట్టి వేయాల్సిన అవసరం ఉండదు.
– పీడీటీ ఆచారి
(వ్యాసకర్త: మాజీ సెక్రటరీ జనరల్, లోక్ సభ)
‘ది హిందు’ సౌజన్యంతో..