దేశంలోని 130 కోట్ల జనాభాలో 65 కోట్ల మంది బీసీలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ‘సబ్కా వికాస్’ అంటే ఇదేనా? అంతరాలు అంతరించిపోతేనే సమాజ ప్రగతి సాధ్యమని నమ్మే మహాత్మా జ్యోతిభా పూలే ఆశయం నెరవేరేది ఇంకెప్పుడు? దేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీల్లో నేటికీ మెజారిటీ ప్రజలు కడు పేదరికంలో బతుకుతున్నారు. అయినా వీరి అభివృద్ధి కోసం పత్యేక ప్రణాళికలు రూపొందించి చర్యలు తీసుకోకపోవడం విషాదం.
ఒక మంత్రిత్వ శాఖనైనా ఏర్పాటుచేయలేని కేంద్రం, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొనే మాటల్లో ఉన్న నిబద్ధత ఏమిటో ప్రజలకు అర్థమవుతున్నది. దేశంలోని మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు, బీసీ ఉద్యమకారులు, రాజకీయపక్షాలు ఎక్కడికక్కడ ఆలోచించి ఒక శక్తిగా ఎదిగి కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది.
కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ కావాలని దశాబ్దాల తరబడి బీసీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారి చిరకాల కోరికను కేంద్రంలోని ప్రభుత్వాలు నిరాదరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని మచ్చ. బీసీ సామాజికవర్గం నుంచి ఎదిగివచ్చిన మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినపుడు బీసీ వర్గాల్లో ఆశలు చిగురించాయి. కానీ ఆయన పాలనలోనూ బీసీలకు ఒరిగిందేమీ లేదు.
2004 డిసెంబర్ 18న అప్పటి కేంద్రమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆర్.కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్‌రావులు ప్రధాని మన్మోహన్సింగ్ను కలిశారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని నాడు కేసీఆర్ తన వాదనను బలంగా వినిపించారు. నేడు ముఖ్యమంత్రి హోదాలో కూడా కేసీఆర్ అదే డిమాండ్ చేస్తున్నారు. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఉండాల్సిన సమాఖ్యస్ఫూర్తికి కలుగుతున్న విఘాతాన్ని ఎత్తిచూపుతూనే, ఎక్కువ జనాభా కలిగిన బీసీలకు సమన్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ‘సబ్కా వికాస్’ అంటున్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎనిమిదేండ్ల కిందట ఏర్పడిన తెలంగాణ నేడు అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ‘రోల్‌మోడల్’గా నిలుస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం. పాలకుడు దార్శనికుడైతే అభివృద్ధి ఎలా పరుగులు తీస్తుందో అందుకు తెలంగాణ రాష్ట్రమే సజీవ సాక్ష్యం. ఈ దేశంలోని ఒక్క తెలంగాణలో తప్పా.. ఏ రాష్ట్రంలోనైనా వేలాది రెసిడెన్షియల్ పాఠశాలలు, 20 లక్షల విదేశీ విద్యా నిధి పారితోషికం, కల్యాణలక్ష్మి, వంద శాతం గ్రాంటుతో ఆర్థిక చేయూత, మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్ల వంటి సామాజిక స్పృహ కలిగిన పథకాలు ఉన్నా యా? ఇలా ఎన్నైనా చెప్పుకోగలిగే అవకాశం తెలంగాణ సొంతం కావడం, ఇక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి, చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం. ఈ చర్యలు సామాజిక విప్లవానికి, సమాజ వికాసానికి బాటలు వేస్తాయనడంలో సందేహం లేదు.
కేంద్రం అవలంబించే విధానాలతో ప్రైవేటీకరణ పెరిగిపోతున్నది. సామాన్యుల జీవితం దుర్భరమవుతున్నది. కులవృత్తులు గిట్టుబా టు కాకుండా పోతున్నాయి. శతాబ్దాలుగా తలెత్తుకొని బతికిన బీసీలు పారిశ్రామికరంగ ప్రవేశంతో క్రమంగా పేదలుగా మారుతున్నారు. ఆధునిక వృత్తుల్లో పారిశ్రామికవేత్తలుగా కాకుండా, కార్మికులుగా, కూలీలుగా దిగజారిపోతున్నారు. జాతీయోద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన బీసీ సామాజికవర్గాలకు, స్వాతంత్య్రానంతరం అందిన అభివృద్ధి ఫలా లు తక్కువ. అందువల్లనే మన దేశం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లో అత్యంత పేదలున్న దేశంగా చర్చించబడుతున్నది. పేదల్లో అత్యధిక జనాభా బీసీల్లోనే ఉన్నారు. ఈ మెజారిటీ జనాభా అభివృద్ధి చెందినపుడే దేశం అభివృద్ధి చెందుతుంది. అంతేకానీ కొందరు పారిశ్రామికవేత్తలు, వారి సంపద, వారు సాధించిన నైపుణ్యంతో దేశం అభివృద్ధి చెందదు. నలభై లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వెయ్యి కోట్ల లోపు నిధులను బీసీలకు కేటాయిస్తున్నారు. అలాగే సామాజిక పురోగతి సాధనకు విద్యకు మూడు లక్షల కోట్లు కేటాయించడం కూడా అవసరం. విద్య కోసం ఇతోధికంగా ఏటా రెండు రెట్లు బడ్జెట్ పెంచి అమలు జరిపినప్పుడే ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది.
2011 జనాభా లెక్కలను కులాలవారీగా, బీసీల వారీగా తీశారు. పార్లమెంట్ సాక్షిగా ఆ కులగణనను బహిర్గతం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ బయటపెట్టకుండా వదిలేశారు. ఆ లెక్కలను బహిర్గతం చేసి ఉంటే ఎవరెలా బతుకుతున్నారో, వారి జీవనస్థితిగతులేంటో స్పష్టమయ్యేవి. అందుకనువైన ప్రణాళికలను తయారుచేసుకునే అవకాశం ఉండేది. కానీ, కేంద్రం అవలంబిస్తున్న తీరు బీసీల సమగ్రాభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. సమీప భవిష్యత్తులో కూడా కులగణన చేపట్టరని తేటతెల్లమైంది. అనేక ప్రామాణికమైన సమస్యల నివారణకు ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసినపుడే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇది నిర్వివాదం. అయినప్పటికీ కేంద్రం బీసీల డిమాండ్‌ను పెడచెవిన పెట్టడం విడ్డూరం. కాకా సాహెబ్ కాలేల్కర్, మండల్ కమిషన్ అన్ని రాష్ర్టాల బీసీ కమిషన్లు ‘కేంద్రంలో మం త్రిత్వ శాఖ’లను ఏర్పాటుచేయాలని ఏనాడో సిఫారసు చేశాయి. మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల మంత్రి, విధులు, నిధులతో పాటుగా ప్రణాళికలు సిద్ధం చేసి, అమలుచేసి ఉంటే అం తరాలు తగ్గేవి. ప్రస్తుత ప్రధానికి చరిత్ర ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. కానీ ఆ అవకాశాన్ని ఆయన వినియోగించుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది.
కనీసం ఒక మంత్రిత్వ శాఖనైనా ఏర్పాటుచేయలేని కేంద్రం, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొనే మాటల్లో ఉన్న నిబద్ధత ఏమిటో ప్రజలకు అర్థమవుతున్నది. దేశంలోని మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు, బీసీ ఉద్యమకారులు, రాజకీయపక్షాలు అందరూ ఎక్కడికక్కడ ఆలోచించి ఒక శక్తిగా ఎదిగి కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. బీసీ వర్గాలపై కొనసాగుతున్న వైఖరికి నిరసనగా చైతన్యవంతమై దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)
-డాక్టర్ వకుళాభరణం
కృష్ణమోహన్ రావు 9849912948