Sunita Williams | భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్(60) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి వీడ్కోలు పలికారు. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 25వ తేదీ నుంచే ఇది అమలులోకి వచ్చిందని నాసా పేర్కొంది. ‘‘ మానవ అంతరిక్ష ప్రయాణంలో సునీతా విలియమ్స్ మార్గదర్శకురాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆమె చూపిన నాయకత్వం, టెక్నాలజీ అభివృద్ధికి చేసిన సేవలు చంద్రుడు, మార్స్‌పై భవిష్యత్తులో చేయబోయే మిషన్లకు బలమైన పునాది వేశాయి.’’ అని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మన్ ఈ సందర్భంగా ప్రశంసించారు.
సునీతా విలియమ్స్ 1998లో నాసాకు ఎంపికయ్యారు. 27 ఏళ్ల పాటు అమెరికా అంతరిక్ష కేంద్రంలో ఆమె పనిచేశారు. మొత్తం మూడు మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపి, అత్యధిక రోజులు స్పేస్‌లో గడిపిన అమెరికన్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. బుచ్ విల్మోర్తో కలిసి 286 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. మొత్తం తొమ్మిదిసార్లు స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ కోసం 62 గంటల 6 నిమిషాలు గడిపారు. మహిళా వ్యోమగాముల్లో ఇదే అత్యధికం. అంతరిక్షంలోనే మారథాన్ చేసిన తొలి వ్యక్తిగానూ సునీతా విలియమ్స్ చరిత్ర సృష్టించారు.
2006 డిసెంబర్ 9
స్పేస్ షటిల్ డిస్కవరీ (STS-116) ద్వారా అంతరిక్షంలోకి తొలి ప్రయాణం చేశారు. ఎక్స్పిడిషన్ 14/15లో ఫ్లైట్ ఇంజినీర్‌గా పనిచేసి నాలుగు స్పేస్ వాక్‌లు చేశారు.
2012 జూలై 14
కజకిస్తాన్‌లోని బయ్కోనూర్ నుంచి రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. 127 రోజుల పాటు ఎక్స్పిడిషన్ 32/33లో సేవలందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అమ్మోనియా లీక్ మరమ్మతులు సహా కీలక పనులు చేశారు.
2024 జూన్
బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా 2024 జూన్‌లో సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. ఎక్స్పిడిషన్ 71/72లో భాగంగా 286 రోజులు అంతరిక్షంలో గడిపి 2025 మార్చిలో భూమిపైకి తిరిగొచ్చారు.