No Entry 2 రెండు దశాబ్దాల క్రితం బాలీవుడ్లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న రొమాంటిక్ కామెడీ ‘నో ఎంట్రీ’ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయిన ఎంటర్టైనర్. అనీస్ బజ్మీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, అప్పట్లో థియేటర్లలో నవ్వుల పండుగ సృష్టించింది. అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్‌తో పాటు బిపాసా బసు, ఈషా డియోల్, లారా దత్, సెలీనా జెట్లీ వంటి స్టార్ నటీనటులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాకు సీక్వెల్ రావాలన్న డిమాండ్ ఎన్నాళ్లుగానో కొనసాగుతూనే ఉంది. గత ఏడాది అనీస్ బజ్మీ అధికారికంగా ‘నో ఎంట్రీ 2’ ని ప్రకటించడంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే ప్రకటన తర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్లకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? అనే సందేహాలు మొదలయ్యాయి. తాజాగా ఈ అంశంపై స్పందించిన అనీస్ బజ్మీ, ‘నో ఎంట్రీ 2’ ప్రాజెక్ట్ ఎక్కడా ఆగిపోలేదని స్పష్టం చేశారు. సినిమా ప్రారంభం కావడానికి చివరి దశలో నటీనటుల ఎంపిక విషయంలో తలెత్తిన సమస్యలే ఆలస్యానికి కారణమని తెలిపారు. క్రియేటివ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తైందని, విన్న ప్రతి ఒక్కరూ కథను మెచ్చుకున్నారని చెప్పారు.
నటీనటుల మధ్య పరస్పర భేదాభిప్రాయాలు, డేట్స్ సమస్యల వల్లే షూటింగ్ మొదలవలేకపోయిందని ఆయన వెల్లడించారు. ఈ కారణాల వల్లే ప్రాజెక్ట్ కొంతకాలం వెనక్కి వెళ్లిందని, కానీ తప్పకుండా సినిమా పట్టాలెక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘నో ఎంట్రీ 2’లో సల్మాన్ ఖాన్ నటిస్తారా? అనే ప్రశ్నకు అనీస్ బజ్మీ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ సీక్వెల్లో సల్మాన్ ఖాన్ నటించే అవకాశం లేదని, పూర్తిగా కొత్త నటీనటులతోనే సినిమా చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే సల్మాన్‌తో మాత్రం మరో ప్రాజెక్ట్‌ను భవిష్యత్తులో తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ కెరీర్ గురించి మాట్లాడిన బజ్మీ, ఆయన ప్లాప్ దశలో ఉన్న సమయంలోనే ‘నో ఎంట్రీ’ చేశానని, అదే సమయంలో ‘వాంటెడ్’ కూడా హిట్ అయి సల్మాన్‌కు బౌన్స్బ్యాక్గా నిలిచిందన్నారు. ప్రస్తుతం సల్మాన్‌కు కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా, ఆయన స్టార్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని, ఒక బలమైన సినిమా పడితే ఆయన రేంజ్ మళ్లీ మారుతుందని అభిప్రాయపడ్డారు.