శుభకార్యాల్లో బంధువులకు కొత్త బట్టలు పెట్టడం మన సంప్రదాయం. శాలువా కప్పడం కూడా గౌరవానికి సంకేతం. అంటే మన దేశంలో సంస్కృతీ, సంప్రదాయాలకు వస్ర్తాలతో ఉన్న అనుబంధం విడదీయరానిది. ప్రతీ పండుగకు ముందు బట్టల దుకాణాలు కిటకిటలాడుతాయి. అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వారి శాఖలను పట్టణాలు/ నగరాలకు విస్తరింపజేస్తాయి. అయినా నేతన్నల ఆదాయం మాత్రం ఎన్నడూ పెరిగింది లేదు. వారి కుటుంబాల్లో ఆనందం లేదు. మనిషికి బట్టకట్టించి,నాగరికత నేర్పిన నేతన్నలు దేశంలో అక్కడక్కడా బలవన్మరణాలకు పాల్పడుతుండటం బాధాకరమైన విషయం.
ఇతిహాసాలు, పురాణాల్లోని ముఖ్య ఘట్టాలు, దేశం/రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నమూనాలు, వివిధ దేవుళ్ల రూపాలు, దేవాలయాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలు, రాజులు, కోటలు, దశావతారాలు, స్వాతంత్య్ర సమరయోధులు మొదలైన వారి రూపాలనూ నేయవచ్చు.
అగ్గిపెట్టెలో పట్టే చీర.. ఉంగరం, దబ్బనంల నుంచి కూడా దూరగల అత్యంత పల్చటి పట్టుచీర.. సుగంధాలు వెదజల్లే ‘సిరిచందన పట్టుచీర’.. కుట్టులేని లాల్చీ-పైజామా.. ఇలా సృజనాత్మక వస్ర్తాలను ఉత్పత్తి చేయగల నైపుణ్యానికి తెలంగాణలో ఏ మాత్రం కొదవలేదు. ఈ మధ్యనే కమలాపూర్, సిద్దిపేట ప్రాంతాల నేత కార్మికులు వారి సొంత ఆలోచనలతో ‘రామప్ప చీరలు’ నేస్తున్నారు. సిరిసిల్ల నేత కార్మికులు తయారుచేసిన పట్టుచీరలను ‘రాజన్న సిరిపట్టు’ అనే బ్రాండ్‌తో న్యూజీలాండ్ మంత్రి ఆవిష్కరించారు. ఆ చీరలను అంతర్జాతీయంగా విక్రయించేలా తగు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంచి నైపు ణ్యం/ పనితనం కనబరిచేవారిని గుర్తించి, వారికి కొత్తకొత్త డిజైన్లతో ఎలా ఆకర్షణీయ వస్ర్తాలను నేయవచ్చో శిక్షణ ఇవ్వాలి. దీనికో సం రాష్ట్రంలోని ప్రముఖ పెయింటర్లు, ఆర్టిస్టులు, శిల్పకారులు, తదితర కళాకారులతో నేత కార్మికులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి.
చీరలపై ఒక్క రామప్ప దేవాలయంపై ఉన్న ఏనుగు డిజైన్లే కాదు, ఎన్నో కొంగొత్త డిజైన్లు వేసి, చేనేత రంగానికి పునర్వైభవం తీసుకరావాలి. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలైన చార్మినార్, కాకతీయ కళా తోరణం, బతుకమ్మ, దానికి వాడే పువ్వులు, రాష్ట్ర చిహ్నాలు, పక్షులు, జంతువులు వంటివన్ని కలిపి లేదా రకరకాల కాంబినేషన్లతో చీరలు నేయాలి. ఏదైనా ఒక్కటి చీర అంచుగా గానీ, కొంగుగా గానీ, చీర మొత్తం గానీ, జాకెట్ పీస్‌పై గానీ డిజైన్ వచ్చేలా చూడాలి. వీటిని వివిధ రంగుల్లో నేయాలి. బతుకమ్మ పండుగకు ఇచ్చే చీరలపై ఆ పేరుకు, పండుగకు తగ్గట్టుగా చిన్నచిన్న సైజుల్లో బతుకమ్మ డిజైన్లు కూడా నేయవచ్చు. పింజరపై ఈ డిజైన్లను వేయించి, మగ్గంపై చేతులతో చీరలను నేయించాలి. అప్పుడే చీరల నాణ్యతా ప్రమాణాలు బాగుంటాయి.
మార్కెట్లో కేవలం మామిడిపిందె లేదా బుట్ట డిజైన్లతో ఉన్న చీరలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి కొత్త డిజైన్లతో నేసిన చీరలు మహిళాలోకాన్ని ఆకర్షించే అవకాశాలున్నాయి. ప్రజల ఆర్థిక అంతరాలను దృష్టిలో ఉంచుకొని చీరలు నేయాలి. అంటే ప్రస్తుతానికి పట్టుచీరలు సంపన్నులు, మధ్యతరగతుల వారికే అందుబాటులో ఉన్నాయి. అధిక ధరల కారణంగా పేద ప్రజలు ఆ చీరలు కొనడానికి ఆసక్తి చూపడం లేదు. కానీ, వారిని దృష్టిలో పెట్టుకొని చీరలు తయారుచేస్తే మార్కెట్లో చేనేత వస్ర్తాలకు డిమాండ్ పెరుగుతుంది. దానికోసం డిజైన్లు మార్చకుండా, చీర నేసేటప్పుడు ఆయా వర్గాలకు అందుబాటులో ఉండేవిధంగా జరీ/పట్టును ఉపయోగించాలి. ఎందుకంటే, చీర తయారీలో ఎక్కువ ఖర్చయ్యేది జరీకే. కాబట్టి చీర నేసేటప్పుడు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని జరీ వినియోగించాలి. నేతన్నలు ఎప్పుడూ మూస పద్ధతిలో చీరలు నేయకుండా, పలు సామాజికవర్గాల సం స్కృతీ, సంప్రదాయాలు, పండుగలు-పర్వదినాలకు తగ్గట్టుగా చీరలు నేసే సృజనాత్మక ఆలోచనలు కూడా చేయాలి. ఒక్క చీరలే కాకుండా మహిళలు ధరించే అన్నిరకాల వస్ర్తాలు, మగవారి కోసం సూటింగ్, షర్ట్టింగ్లను కూడా నేసేటట్టుగా శిక్షణ ఇవ్వాలి. వీటిని మంచి నాణ్యత, మన్నికతో అందరికీ అందుబాటు ధరలో ఉత్పత్తి చేస్తే చేనేతరం గం కలకాలం వర్ధిల్లుతుంది.
రకరకాల పండ్లు, ప్రకృతి డిజైన్లతో డైనిం గ్ క్లాత్, టేబుల్ క్లాత్‌లను నేయవచ్చు. అలా గే రంగురంగుల్లో నెమలి, నెమలి పింఛం, పిల్లనగ్రోవి వంటి డిజైన్లతో తువ్వాళ్లు, దస్తీలనూ నేయవచ్చు. ఇంకా చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా తువ్వాళ్లు, దస్తీలపై బార్బి బొమ్మ, సూపర్ మ్యాన్, డోరోమ్యాన్ వంటి డిజైన్లను నేసినట్లయితే వాటికి డిమాండ్ ఉంటుంది. ఈ డిజైన్లకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) వచ్చేలా కృషిచేయాలి. పోచంపల్లి ఇక్కత్ చీరలు 2013లోనే జీఐ గుర్తింపు పొంది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌లో కూడా నమోదు చేయబడ్డాయి. ‘యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం’ సంస్థ 2021లో ‘బెస్ట్ టూరి జం విలేజ్’గా పోచంపల్లిని ప్రకటించింది.
ఇటీవల బుద్ధుడి బొమ్మను అందరి వస్ర్తాలపై చూస్తున్నాం. కానీ నేతన్నలు నేయబో యే చీరలు, అందరి సెంటిమెంట్లను గౌరవిం చి, ఏ వర్గం వారి మనోభావాలు దెబ్బతినకుండా ఏ డిజైన్, ఏ రకమైన వస్ర్తానికి వాడా లనే విషయంపై లోతుగా అధ్యయనం చేయాలి. మన చరిత్ర నుంచి ఏ రకమైన డిజైన్లు ఎంచుకుంటే ఈ తరానికి ఉపయోగపడుతాయో తెలుసుకోవాలి. నేతన్నలకు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలున్నప్పుడే ఆ రంగం బతికి బట్టకడుతుంది.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సీ మోంజీ డీమ్డ్ వర్సిటీ, హైదరాబాద్)
-డాక్టర్ శ్రీరాములు గోసికొండ