Pushpa 3 | భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన స్టార్లలో అల్లు అర్జున్ ముందు వరుసలో నిలిచారు. ‘పుష్ప’ సిరీస్‌తో ఆయన సంపాదించిన గుర్తింపు కేవలం ఒక సినిమా విజయంగా కాకుండా, ఒక ఫెనామెనాన్గా మారింది. ముఖ్యంగా ‘పుష్ప 2: ది రూల్’ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తుడిచిపెట్టేసి, రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో తెలుగు సినీ చరిత్రలోనే టాప్ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయంతో బన్నీ క్రేజ్ నార్త్ నుంచి సౌత్ వరకూ మరింత విస్తరించింది.ఇంతటి సక్సెస్ తర్వాత పుష్ప కథ ఇక్కడితో ముగుస్తుందనే అభిప్రాయం మొదట వినిపించినా, దర్శకుడు సుకుమార్ మాత్రం అభిమానులను మరోసారి షాక్ ఇచ్చారు.
‘పుష్ప 2’ క్లైమాక్స్‌లోనే మూడో భాగానికి స్పష్టమైన సంకేతం ఇస్తూ ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ అనే టైటిల్‌ను రివీల్ చేయడం సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. థియేటర్లలో ఆ సీన్ పడిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, మూడో భాగంలో పుష్ప రాజ్ పాత్ర మరింత క్రూరంగా, వ్యూహాత్మకంగా మారనుందట. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ తర్వాత తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని సంపూర్ణంగా నియంత్రించుకోవడమే కాకుండా, తనను మోసం చేసిన వారిపై కూడా పుష్ప ప్రతీకారం తీర్చుకుంటాడనే టాక్ వినిపిస్తోంది. ఈ భాగంలో పుష్పకు ఎదురయ్యే శత్రువులు కేవలం బయటవాళ్లే కాకుండా, లోపలే ఉన్న ద్రోహులేననే అంశం కథకు ప్రధాన బలం కావచ్చని సమాచారం.
ఇప్పటికే ఈ స్క్రిప్ట్ పనులు గోప్యంగా జరుగుతున్నాయని, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో సుకుమార్ టీమ్ కథను మరింత బలంగా మలుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క లీక్‌తోనే పుష్ప 3పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదిలా ఉండగా ‘పుష్ప 2’ జపాన్‌లో ‘పుష్ప కున్రిన్’ పేరుతో విడుదలై అక్కడ కూడా మంచి స్పందన తెచ్చుకుంటోంది. విదేశీ మార్కెట్ల నుంచి వస్తున్న ఆదరణ ఈ ఫ్రాంచైజ్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేస్తోంది. ఇదే ఊపులో పుష్ప 3 షూటింగ్ 2027 వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పుష్ప 3 సెట్స్‌పైకి వెళ్లేలోపు అల్లు అర్జున్ మరికొన్ని భారీ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీతో తన 22వ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పనిచేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాదు, లోకేష్ కనగరాజ్‌తో కూడా ఓ భారీ ప్రాజెక్ట్ లైనప్‌లో ఉంది.