ఆత్మ గౌరవం కలిగిన రాష్ట్రంపై కుట్రలు పన్నితే నాలుగు కోట్ల గొంతుకలు ఒక్కటవుతాయి. ఢిల్లీ పెద్దలు పన్నిన కుట్రలను కూల్చేందుకు ప్రారంభమైన ఈ పోరాటం వెనక తెలంగాణ అస్తిత్వం ఉంది. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణపై పన్నిన పన్నాగాన్ని టీఆర్ఎస్ చీల్చి చెండాడటంతో కాషాయ దండు గొంతులో కషాయం పడినట్లయ్యింది.
‘అవినీతిపరులు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ధన బలంతో తప్పించుకుంటున్నారు. మేం ఒక వీడియో చూశాం. అందులో ఎన్నికైన ప్రజాప్రతినిధులను కోట్లు పోసి కొనడం గురించి కొందరు మాట్లాడారు’. ఈ వ్యాఖ్యలు చేసింది సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. అత్యున్నత న్యాయస్థానమే ఈ వ్యాఖ్యలు చేసిందంటే తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎంతవరకు నిజమన్నది తేలిపోయింది.
కుట్రలకు ‘కేంద్ర’ బిందువు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నది ఆ పార్టీ నేతల వాదన. కానీ తాము బీజేపీ కీలక నేతల ప్రోత్సాహంతోనే ఇదంతా చేశామని నిందితులు విచారణలో వెల్లడించింది నిజం కాదా? తమది పెద్ద నెట్వర్క్ అని.. అందులో ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారని.. బీజేపీ పెద్దలే ఆ నెట్వర్క్ నిర్వహిస్తారని చెప్పలేదా ? ఇంతకీ ఆ నెట్వర్క్ ఇన్చార్జి దేశ ప్రధాని మోదీనా? లేక పార్టీలో నంబర్ 2గా ఉన్న అమిత్ షానా?
బ్రేకుల్లేని బండికి న్యాయవాది ఆక్సిడెంట్
ఆరోపణలు చేయడంలో బ్రేకులే లేని బీజేపీ తెలంగాణ చీఫ్‌కు బంధువే యాక్సిడెంట్ చేశారు. నిందితుల్లో ఒకరైన నందకుమార్‌తో సంజయ్ బంధువైన న్యాయవాది అరగంట పాటు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు విమాన టికెట్ ఎందుకు బుక్ చేశారు? ఈ రెండు ఆధారాలు చాలవా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ నేతల పాత్ర కూడా ఉందని చెప్పడానికి.
మోదీ, ఈడీ… తెలంగాణపై దాడి
మునుగోడు ముంచేసింది. కాషాయ దండు పట్టుబడింది. నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటకి రావడం మొదలైంది. ఇంకేముంది .. మోదీ చేతిలోని ఈడీ రంగంలోకి దిగింది. టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీల సంస్థలపై దాడులు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రం ఈ పని చేసింది. సీబీఐకి అప్పగించడం ద్వారా ఈ కేసును నీరుగార్చాలన్న బీజేపీ ప్రయత్నాలకు న్యాయస్థానం చెక్ పెట్టింది. కేంద్రం ఆధీనంలో ఉన్న సీబీఐతో దర్యాప్తు చేయించడం ద్వారా ఉన్న ఆధారాలన్నీ మార్చేసి కేసు మొత్తాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీ ఏకంగా కోర్టునే ఆశ్రయించింది. కానీ వారి పన్నాగం ఫలించలేదు. సీబీఐతో దర్యాప్తు కుదరదని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలోనే విచారణ మొత్తం సాగాలని న్యాయస్థానం ఆదేశించడం కేంద్రంపై తెలంగాణ తొలి విజయం.
(వ్యాసకర్త: టీఎస్టీఎస్ చైర్మన్)
-పాటిమీది జగన్ మోహన్ రావు