‘జబ్ అంధేరా బహుత్ బఢ్జాతాహై.. చారో తరఫ్ అంధకార్ హో జాతాహై.. ఉసీ పరిస్థితిమే.. కమల్ కా ఖిల్నా షురూ హోతాహై! అబ్ తెలంగాణమే అంధేరా ఛట్నే కీ షురువాద్ హోగయీ హై’- మొన్న బేగంపేటలో ప్రధాని పలికిన పలుకులు ఇవి. ‘చీకటి చిక్కపడ్డప్పుడు.. నాలుగు దిక్కులా చీకట్లు ముసురుకున్న సందర్భంలోనే కమలం వికసిస్తుంది’ అని దీని అర్థం! అదే సమయంలో ‘ఇప్పుడు తెలంగాణలో అలుముకున్న చీకట్లను పారదోలే సమయం వచ్చేసింది’ అనడం ఆయన అపరిపక్వతకు నిదర్శనం.
చీకటి అనే పదం తెలంగాణ మర్చిపోయి ఏడున్నరేండ్లు దాటిపోయిం ది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి తెలంగాణలో ఇంటింటా వెలుగు పూలు విరబూస్తూనే ఉన్నాయి. యావత్ భారతంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు నిరంతర విద్యుత్తును ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయానికి 24 గంటలఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. పంట కోతలు తప్ప.. కరెంట్ కోతలు మర్చిపోయిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో చీకటి చిరునామా గల్లంతైన సంగతి కండ్లకు గంతలు కట్టుకున్న వారికి కనబడదు. తెలంగాణలో పరిశ్రమలు మూడు షిఫ్ట్‌లు పనిచేస్తున్న తీరును చూసి.. కండ్లల్లో నిప్పులు పోసుకున్న వారికి ఇక్కడి వెలుగులు కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదు! 25 ఏండ్లుగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్లో నేటికీ పవర్ హాలిడే సంస్కృతి ఉందన్నది వాస్తవం.
వ్యవసాయానికి పట్టుమని ఆరు గంటలు కరెంట్ ఇవ్వలేని వాళ్లు.. మన తెలంగాణలో ‘చీకట్లు ముసురుకున్నా యి’ అనడం హాస్యాస్పదం. మోటర్ల దగ్గర మీటర్లు పెట్టాలనే వ్యక్తులకు వెలుగులు చూసి తట్టుకునే శక్తి ఉందని ఎలా అనుకోగలం?
ఇక వారు ఏ అంధకారం గురించి మాట్లాడుతున్నారు! మునుగోడు ఉపఎన్నిక ఒక చీకటి ఒప్పందం. ఆ తిమిరాన్ని తరిమికొట్టిన ఘనత మునుగోడు ఓటర్లకు దక్కుతుంది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో బీజేపీ చీక టి కోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నా యి. దేశంలో వ్యాపారవేత్తలతో ప్రభుత్వ పెద్దలు మిలాఖత్ మరో చీకటి వ్యవహారం. నిరంతరం అంధకారంలో మసులుతున్నందువల్లనేమో అంధకారమంటూ అలవాటు లో పొరపాటుగా నోరుపారేసుకున్నారు. కండ్లకు అహం పొరలు కమ్మినప్పుడు చీకట్లు తప్ప ఏం కనిపిస్తాయి? కుళ్లుబోతుతనంతో కుతకుతలాడే వ్యక్తులు వాస్తవాలను జీర్ణించుకోలేరు. అన్నిటికి మించి ఉపఎన్నిక ఫలి తం తమకు అనుకూలంగా వస్తుందని కలలు కన్న కండ్లకు వాస్తవం కంటపడేసరికి కండ్లు బైర్లు కమ్మినట్టుంది. అదే అంధకారం!
బురదలోనే కమలం వికసిస్తుందన్నది వాస్తవమే. కానీ, మతవిద్వేషాల బురదలో వికసించేది కమలం కాదు! నినాదాలే విధానాలుగా చెలామణి అయ్యే నాసిరకం రాజకీ య క్షేత్రాల్లో కమలం వికసిస్తుందేమో! కానీ, తెలంగాణలో తరిపొలం పచ్చటి పైర్లతో కళకళలాడుతున్నది. చెరువులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. పిల్లకాల్వలు సైతం జీవనదుల్లా నిరంతరం ప్రవహిస్తున్నాయి. డేగ కండ్లతో వెతికి చూసినా ఇక్కడ కాషాయ పార్టీ మొగ్గ తొడగడానికి బురద కనిపించదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, పచ్చి బట్టలతో ప్రమాణాలు గావించినా తెలంగాణలో కమ ల వికాసం పగటి కలే! చివరగా ఒక్కమాట, 1958 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జన్‌సంఘ్ ఓటమి పాలైంది. ఫలితాలు వచ్చిన రోజు బీజేపీ వ్యవస్థాపకులు వాజపేయి, అద్వానీ ఇద్దరూ ఇష్టమైన పానీపూరీ తిన్నారు. తర్వాత రాజ్‌కపూర్ నటించిన ‘ఫిర్ సుబహ్ హోగీ’- ‘మళ్లీ ఉదయం అవుతుంది’ సినిమాకు వెళ్లారు. విలువలున్న నేతలు కాబట్టి వాళ్లు వెలుగును ఆకాంక్షించారు. ఆ విలువలకు తిలోదకాలు ఇచ్చిన వీళ్లు.. చీకటిని మాత్రమే చూడటంలో ఆశ్చర్యమేం లేదు.
– కణ్వస