సనాతన ధార్మికులు ప్రకృతి ఆరాధకులు. వారి జీవన విధానం జీవితాన్ని శాంతి యుతంగా గడిపేలా ఉంటుంది. సంస్కృతంలో కాషాయాన్ని భగ్వా అంటారు. భగ్వా నుంచే ‘భగవాన్’ పదం ఉద్భవించిందని సనాతన ధార్మికులు భావిస్తారు. కాషాయ వస్త్రం, దాని ధరించడం తపస్సు, భక్తి, త్యాగాలలో పాలు పంచుకోవాలనే కోరికకు చిహ్నం. కాషాయ వస్త్ర ధారణ నిస్వార్థ కర్మ ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది.
కాషాయ వస్త్ర ధారణ చరిత్ర:
1) సత్య యుగంలో శివుడు పార్వతికి అత్మ తత్వం, త్యాగం, యోగం గూర్చి అమర కథలో తెలిపారు. ఆ కథ విన్న పార్వతీ దేవి త్యాగ ధనురాలై నిర్లిప్తతతో తన చేయిని కోసుకొని అంగ వస్ర్తాన్ని రక్తంతో తడిపిందని పురాణ కథనం. మహా తపస్వి గోరక్ష నాథుడు ఒకసారి పార్వతీ దేవి దర్శనానికి వెళ్లినప్పుడు, తన రక్తంతో తడిసిన కాషాయ రంగులో ఉన్న తన అంగ వస్ర్తాన్ని పార్వతీ దేవి ఆయనకు బహూకరించారని పురాణాల్లో ఉంది. అప్పటి నుండి సాధువులు, రుషులు ధార్మిక కార్యక్రమాలు ఆచరించేటప్పుడు పార్వతీ మాత త్యాగ నిరతికి, ప్రేమకు చిహ్నంగా కాషాయ వస్త్ర ధారణ మొదలు పెట్టారని ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి.
2) మరో కథనం ప్రకారం ప్రాచీన కాలంలో అగ్నిని పుట్టించడం కష్ట సాధ్యమైన పని. ఆ కాలంలో రుషులు, సాధువులు ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి ప్రయాణం చేసేటప్పుడు అగ్నిని తమతో పాటు తీసుకెళ్ళే వారు. అగ్ని ఆగమనం సాధు ఆగమనానికి చిహ్నంగా ఉండేది. అగ్ని విరివిగా లభ్యమైన తర్వాత కాషాయం అగ్నికి చిహ్నంగా భావించి కాషాయ జెండాను తమ ఆగమనానికి చిహ్నంగా తమతో పాటు తీసుకెళ్లే వారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాలక్రమేణా కాషాయ వస్త్ర ధారణ సాధువులకు, రుషులకు, సర్వ సంగ పరిత్యాగులకు చిహ్నంగా మారిందని వైతాళికులు భావిస్తున్నారు.
కాషాయం ఉభయ సంధ్యలకు ప్రతీకగా, శక్తికి చిహ్నం. కాషాయం కోరికలని దహించే అగ్నికి సమానంగా, ఇహ సుఖాలను పరిత్యజించిన వ్యక్తి కాషాయ ధారణకు అర్హుడిగా వేద వేదాంగాలు తెలియచేశాయి. వేల సంవత్సరాల పాటు పవిత్రతకు, భక్తికి చిహ్నంగా కాషాయాన్ని చూశారు. కాషాయ వస్ర్తాలను మహర్షి వాల్మీకి, వేద వ్యాసుడు, శంకరాచార్యుడు, రామానుజులు, మధ్వాచార్యులు, స్వామి వివేకానంద మొదలైన మహోన్నతులు ధరించారు. కాషాయ వస్ర్త ధారణ, కాషాయ జెండా అనాదిగా సనాతన ధార్మికులలో ఉన్నది. ఏ విధంగానైతే జాతీయ జెండాతో పోలిన పార్టీ జెండాతో కాంగ్రెస్ ప్రజల భావోద్వేగాలను తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నదో, అదే విధంగా బీజేపీ, ఆ పార్టీ మాతృ సంస్థలు కాషాయ రంగు, కాషాయ జెండాతో ప్రజల్లో భావోద్వేగాన్ని రగిలించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాయని మేధావులు భావిస్తున్నారు.
కొంత మంది విశ్లేషకులు, మేధావులు, రచయితలు, మీడియా సంస్థలు తెలిసీ-తెలియక బీజేపీని కాషాయ పార్టీగా సంబోధించడం వల్ల, తమకు తెలియ కుండానే బీజేపీకి లబ్ధి చేకూర్చాయని గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ‘కాషాయీకరణ’ పదం వాడకం వల్ల బీజేపీకే లాభం జరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు. వేల సంవత్సరాలుగా సనాతన ధర్మానికి చిహ్నాలుగా ఉన్న మహోన్నత కాషాయ వస్త్ర ధారణ, కాషాయ జెండాను తుచ్ఛ రాజకీయానికి వాడుకోవడం సనాతన ధర్మం, కాషాయం గొప్పతనం తెలిసిన వారిని బాధకు గురి చేస్తున్నది. కాషాయ వస్త్ర ధారణ కానీ, కాషాయ జెండా కానీ ఫ్యాషన్ కాదు. అది ఒక సంఘానిదో లేక ఒక పార్టీదో కాదు. అటువంటి చిహ్నాలతో రాజకీయం చేయటం భగవంతుడినే కాకుండా సనాతన ధర్మాన్ని కుడా అవహేళన చేసినట్లే. కాషాయం పేరిట కసాయి రాజకీయం చేసే విధానం నిరాడంబరతకు, భక్తికి, తపస్సుకు, త్యాగానికి, స్వచ్ఛతకు, పవిత్రతకు, నిస్వార్థ కర్మకు చిహ్నమైన కాషాయాన్ని అవమానించడమే.
– పెండ్యాల మంగళా దేవి