వలస పాలన అవశేషంగా సంక్రమించిన గవర్నర్ వ్యవస్థ ఆది నుంచి వివాదాస్పదంగానే ఉన్నది. రాజ్యాంగ నిర్మాణ సభలోనే గవర్నర్ పదవి గురించి తీవ్ర వాదోపవాదాలు నడిచాయి. బ్రిటిష్ కాలంలో ఒడిషా ప్రధానిగా పనిచేసిన దాస్, దీన్ని వలస పాలన అవశేషంగా వర్ణించాడు. గవర్నర్ పదవి వల్ల సమాఖ్యస్ఫూర్తికి దెబ్బ తగులుతుందని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు.
గవర్నర్ వ్యవస్థ ఆది నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ ఆధిపత్యానికి గండిపడిన కాలం నుంచి
వివాదాస్పదంగా మారింది. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ రాంలాల్ రద్దుచేసినపుడు ఏకంగా గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయాలని ఉద్యమం నడిచింది. రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలదోసే కుట్రలను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కొనసాగిస్తూనే ఉన్నాయి.
గవర్నర్లు నిష్పాక్షికంగా పనిచేసే వ్యవస్థ ఉండాలని రాజ్యాం గ నిర్మాతలు ఆశించారు. కానీ ఇప్పటివరకు కేంద్రంలో అధికారం చేపట్టిన అన్ని రాజకీయపార్టీలు దీన్ని స్వలాభం కోసమే వాడుకున్నాయి. అంతేకాకుండా, అధికారంలోకి వచ్చిన పార్టీలు గత గవర్నర్‌ను తొలగించడంపై బీపీ సింఘాల్ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పులో ‘కేంద్రంలో ప్రభుత్వం మారడం గవర్నర్ల తొలగింపునకు కారణం కాకూడదని స్పష్టం చేసింది. అయినా ఏదోరకంగా పని జరిపిస్తున్నారు. బీజేపీ ఈ విషయంలో చాలా ముందున్నది. తాను అధికారంలోకి వచ్చి న కొత్తలో ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, త్రిపుర, నాగాలాండ్ గవర్నర్లను తప్పించి, తమ విధేయులను అక్కడ ప్రతిష్టించారు. ఇటువంటి చర్యల ద్వారా రాజ్యాంగానికి ప్రతినిధిగా పనిచేయాల్సింది పోయి, పార్టీ ప్రతినిధిగా గవర్నర్ మారిన సందర్భం వర్తమానంలో మనకు కనబడుతున్నది.
ఈ అంశంపై నియామకమైన సంఘాలు కూడా రాజకీయాలతో సంబంధం లేని, నిష్పాక్షికంగా వ్యవహరించే వ్యక్తులనే గవర్నర్లుగా నియమించాలని కోరాయి. రాజమన్నార్ కమిటీ (1971) గవర్నర్ పదవి చేపట్టిన వ్యక్తి రాజ్యాంగ ప్రతినిధిగా పనిచేయాలని స్పష్టంచేసింది. అంతేకాకుండా రాజ్యాంగంలోని 356, 357 అధికరణలు రద్దుచేయాలని సూచించింది. సర్కారియా కమిషన్ (1983-1987) గవర్నర్ వ్యవస్థపై స్పష్టమైన సూచనలు చేసింది. గవర్నర్‌గా నియామకమయ్యే వ్యక్తి ఏదో ఒక రంగంలో నైపుణ్యుడై ఉండాలని, నియామకానికి ముందు కనీసంగా రెండేండ్ల పాటు ఏ రాజకీయపార్టీతోనూ సంబంధం ఉండకూడదని, సొంత రాష్ట్రంలో గవర్నర్‌గా నియమించకూడదని చెప్పింది. అన్నిటికంటే ముఖ్యంగా గవర్నర్‌ను నియమించేటప్పుడు, తొలగించే సమయంలోనూ సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సర్కారియా కమిషన్ సూచనలను అమలుచేయాలని భారత సర్వోన్నత న్యాయస్థానం అనేకసార్లు తన తీర్పుల సందర్భంగా పేర్కొన్నది.
కేంద్రంలో రాష్ట్రపతి నిర్వర్తించే విధులు, అధికారాలతో గవర్నర్ పదవికి పోలికలున్నా, కొన్ని అత్యవసర సమయాల్లో రాష్ట్రపతికి ఉండే విశేషాధికారాలు గవర్నర్‌కు ఏ మాత్రం లేవు. గవర్నర్ కేవలం రాష్ట్ర మంత్రివర్గం సలహాపై మాత్రమే తన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అన్ని విషయాల్లోనూ ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉం టుంది. కానీ రాజ్యాంగపర అంశాలపై ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తులు తామే సర్వాధికారులుగా పెత్తనం చెలాయించాలనే ధోరణి పెరిగిపోతున్నది. బీజేపీ కేంద్రంలో పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ స్థితి మరింత తీవ్రమైనది. పశ్చిమబెంగాల్లో గవర్నర్, ముఖ్యమంత్రి వ్యవహారం రచ్చకెక్కింది. తమిళనాడులో అదే పరిస్థితి నెలకొన్న ది. మొన్న మహారాష్ట్రలో స్పీకర్ ఎన్నికకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సింగపూర్ అధికార పర్యటనకు గవర్నర్ మోకాలడ్డటం ఇవన్ని ఒకే కోవకు చెందుతాయి. ఇటువంటి సంఘటనలు గవర్నర్లు రాజకీయ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి.
తెలంగాణకు సంబంధించి, హుజూరాబాద్ ఎన్నికలకు ముందు మంత్రివర్గం సిఫారసు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థ్ధిత్వాన్ని ఆమోదించకుండా గవర్నర్ తమిళిసై వివాదానికి తెరలేపారు. ఒకపక్క అప్పటికే రాజ్‌భవన్‌లో ప్రజా ఫిర్యాదుల విభాగం ఉండగా, తను స్వయంగా ‘ప్రజా దర్బార్ నిర్వహించడం వంటి చర్యలతో రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చారు. తాను ఏ వివరణ పొందాలన్నా ప్రభుత్వాన్ని కోరి తెప్పించుకోవడం గవర్నర్ విధి. కానీ ప్రత్యక్షంగా పాలనా పగ్గాలు చేతబట్టి, అధికారులను నేరుగా వివరణలు, నివేదికలు కోరడం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. తనను విమర్శిస్తున్నా మౌనంగా ఉంటున్న ముఖ్యమంత్రిని సైతం పదే పదే విమర్శించడంతో గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం చూస్తుంటే, వారికి పార్టీ ప్రయోజనాలు తప్ప ప్రజాస్వామ్యవిలువలకు వారేమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయం స్పష్టమవుతున్నది. ఇవన్నీ చూస్తుంటే, పాలనాదక్షతతో, భవిష్యత్తుతరాలకు సైతం ప్రయోజనాలందించే ప్రజాసంక్షేమ పథకాలతో, దేశం మొత్తాన్ని ఆకర్షించేవిధంగా సుభిక్ష పాలన అందిస్తున్న కేసీఆర్ ప్రాభవం దేశవ్యాపితంగా విస్తరిస్తుండటాన్ని సహించలేని కేంద్ర ప్రభు త్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చేపట్టే చర్యల లో గవర్నర్‌ను ఒక పావుగా వాడుకుంటున్నట్లు స్పష్టం అవుతున్నది.
బొమ్మై కేసులో సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్లు ఇచ్చే నివేదికలపై, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కల్పించాలి. ఉన్నత న్యాయస్థానం అనేకసార్లు చెప్పినట్లు, గవర్నర్ల నియామకాలపై సర్కారియా కమిషన్ సిఫారసులను వెంటనే అమలుచేయాలి.
-అనిశెట్టి సాయికుమార్ 94407 70531