హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ‘ఏకరీతి ఫీజు విధానం’ పేరిట వైద్య విద్యలో కన్వీనర్ కోటా ఎత్తేసే కుట్ర చేస్తున్నాయని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్ల అసోసియేషన్(హెచ్ఆర్డీఏ) ఆరోపించింది. సోమవారం హెచ్ఆర్డీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్ నాగుల, కార్యదర్శి డాక్టర్ మహ్మద్ అజిత్, ఉపాధ్యక్షుడు డాక్టర్ సురేశ్‌బాబు, ప్రతినిధులు ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టీనా జడ్ చొంగ్తూకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కన్వీనర్ కోటా సీట్లను తొలగించడం ద్వారా వైద్యవిద్యను సంపన్నులకే పరిమితం చేయాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
కన్వీనర్ కోటా సీట్లు గ్రామీణ ప్రాంత, మధ్య తరగతి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు రక్షణ కవచంగా ఉన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కన్వీనర్ కోటా వ్యవస్థను రక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లాభాపేక్ష లక్ష్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల అసోసియేషన్లు వేస్తున్న ఎత్తుగడులను తిప్పికొట్టి విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.