మొన్నటి మునుగోడు ఎన్నికల్లో మోదీ ఓడిపోయారు, కేసీఆర్ గెలిచారు. ఈ సూత్రీకరణకు మూలం స్వయానా మోదీ చేసిన వ్యాఖ్యానమే. అకాల ఉపఎన్నికపై అమిత్ షానే కాదు, తానూ నజర్ పెట్టినట్టు మొన్న హైదరాబాద్ నడిబొడ్డున ప్రధాని పరోక్షంగా చెప్పుకొచ్చారు.
ఇంతటి జాగృతానికి చిరునామా అయిన తెలంగాణ పౌరుల చైతన్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారా మోదీజీ? మీ బీజేపీ పుణ్యమాని ముంచుకొచ్చిన మునుగోడు ఉపఎన్నిక వ్యవహారం అమిత్ షా డైరెక్షన్లోనే నడిచిందని మీ మొన్నటి తెలంగాణ పర్యటన వరకూ భావించాం. కానీ, హైదరాబాద్‌లో, రామగుండంలో మీ ప్రసంగాలు విన్నాక.. అంతకుమించి అని రూఢీ అయింది. అంటే ఏకంగా మునుగోడు బై పోల్ మీద మీరూ స్వయంగా ఫోకస్ పెట్టారని తేలింది. మోదీ కనుసన్నల్లో,అమిత్ షా దర్శకత్వంలోనే ఎన్నికలు సాగినట్లు నిర్ధారణయింది.
రాష్ట్ర సర్కారును మునుగోడుకు రప్పించామనే బండి సంజయ్ గప్పాలు నరేంద్ర మోదీ నోట కాపీ పేస్టులా జాలువారాయి. మోదీనే మానసికంగా మునుగోడు స్థాయికి దించగలిగామనే సత్యాన్ని, అమిత్ షా వచ్చి సభ పెట్టినా మా కడక్ పబ్లిక్ లైట్ తీసుకొన్నారనే వాస్తవాన్ని టీఆర్ఎస్, కేసీఆర్ మాత్రం ప్రచారం చేసుకోలేదు. వారిలా అసలు బడాయిలకు పోకుండా హుందాగా వ్యవహరించారు. తెలంగాణ పాలకులుగా తమ రాష్ర్టాన్ని సుభిక్షంగా కాపాడుకుంటూనే, మోదీ నల్ల చట్టాలకు అసువులు బాసిన పంజాబ్ రైతుల కుటుంబాలకు, దేశ రక్షణలో వీర మరణం పొందిన బీహార్, జార్ఖండ్ రాష్ర్టాల సైనికుల కుటుంబాలకు సహాయం చేసి ఆదుకున్న పెద్ద మనసు కేసీఆర్‌ది.
కానీ, దేశ ప్రధానిగా మోదీ మాత్రం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షనే కొనసాగిస్తున్నారు. మునుగోడులో పోటీ పరోక్షంగా తనకు కేసీఆర్‌కు మధ్యనే జరిగిందని, ఈ పోరులో ప్రజలు కేసీఆర్ వైపునే నిలిచారని మోదీ తీర్మానించుకున్నారేమో. అట్లే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశం బాగుకోసం తపిస్తున్న కేసీఆర్ మున్ముందు తనకు నేరుగా పోటీ అవుతారని భయపడుతున్నట్టున్నారు. బీఆర్ఎస్గా టీఆర్ఎస్ అవతరించనుండటంతో జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేసి, తెలంగాణకే కేసీఆర్‌ను పరిమితం చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక సృష్టి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరగాళ్ళ ఉనికి ఈ కోవలోకే వస్తాయి. కేంద్రంలో తన గుప్పిట ఉన్న దర్యాప్తు సంస్థల బూచి చూపుతూ భయపెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. భయపెడితే భయపడే తత్వం తెలంగాణ డీఎన్ఏలోనే లేదని మోదీ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. సుత్తెతో తలపై నిత్యం మోదినట్టు.. అడ్డగోలు పన్నులు, తాళలేని నిత్యావసర ధరాభారాలతో మోదుతూనే ఉన్నారు. రొటీన్ పనులు, నిధులు మినహా మీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్కటీ రాకున్నా, దేశానికే తలమానికంగా సుసంపన్నమైన మా రాష్ర్టాన్ని చూసి, ఇక్కడ తమ పార్టీ పువ్వు వికసించదని భయపడుతున్నారా? లేదంటే మమ్మల్ని భయపెడుతున్నారా మోదీ జీ..!
ఐటీఐఆర్, ఐఐటీ, ఐఐఎం, నవోదయ, సైనిక్ స్కూళ్లు, మెడికల్ కాలేజీలు, గిరిజన వర్శిటీ, బయా ్యరం ఉక్కు కర్మాగారం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, విభజన బాపతు సంస్థలు, ఆస్తులు, ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్, పారిశ్రామిక విస్తరణ ఇన్సెంటివ్, కృష్ణా జలాల్లో మా రాష్ట్ర వాటా వంటివి పూర్తిగా విస్మరించారు. ఇవన్నీ మా ప్రజల గమనంలో ఉన్నాయి. బుకాయింపులు ఎవరివో, బాధ్యత గల పాలకులు ఎవరో ఖుల్లంఖుల్లా డిసైడ్ చేయడంలో భాగంగానే తెలంగాణ జనం మునుగోడు శాంపిల్ సంకేతం ఇచ్చారు. రాబోయే సాధారణ ఎన్నికలకు, బీఆర్ఎస్కు శుభసూచకమైన తీర్పుతో తేల్చి చెప్పారు.
దేశంలోని ఒక రాష్ట్రంలో, కేవలం ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం సాక్షాత్తూ దేశ పాలక దిగ్గజాలుగా మీరే తెగ ఆరాట పడినట్టు మా తెలంగాణ సమాజానికి స్వయంగా చెప్పకనే చెప్పేశారు. దేశ పాలనలోని నెంబర్ ఏక్, నెంబర్ దో పొజిషన్లో మీ ద్వయం ఎంత ఆపసోపాలు పడినా, ఫలితంలోని తత్వమేమిటో ఈపాటికే మీకు బోధపడి ఉండాలి. మా రాష్ట్ర ప్రభుత్వాన్నే మునుగోడులో దింపగలిగామని పైకి గొప్పలకు పోయారు. దేశ ప్రధానమంత్రి, హోంమంత్రి తెలంగాణలో ఒక శాసనసభ నియోజకవర్గంలో మోహరించినంత పనిచేయడం నిజం కదా. మునుగోడులో నిలువునా మునిగి, ఓడిపోయిన మీ పార్టీయే గెలిచినంత బిల్డప్ ఇవ్వడం ఇందులో మరో విచిత్రం! స్పష్టమైన ఆధిక్యంతో అలవోకగా విజయం సాధించిన టీఆర్ఎస్ ఎంతో ఒదిగి హుందాగా వ్యవహరిస్తున్నది.
టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట మాత్రంగానైనా మునుగోడు జయకేతనంపై డాంబికాలకు పోకుండా పాలనాపరమైన అంశాలు, ప్రజా సంక్షేమం, దేశ భవిష్యత్తు గురించి తలమునకలవుతుంటే.. మీరొచ్చి బెదిరింపులకు దిగడం తగునా మోదీ? సరిగ్గా ఆ ఉప ఎన్నిక టైంలోనే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు విఫలయత్నం చేసిన అంశాన్ని సాధారణ పౌరులు మొదలు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాకా అందరూ కన్నారు, విన్నారు. ఇది ఎవరికి తలవంపులు తెచ్చినట్టు? ఏ పార్టీ పరువు పోయినట్టు? ఏ పాలక అధినాయకత్వం పలుచనైనట్టు? ప్రజాస్వామ్యం, ప్రజా తీర్పుపై ఏ ద్వయానికి గౌరవం, విశ్వాసం లేనట్టు? ప్రజల చేత ఎన్నుకోబడిన సుస్థిర ప్రభుత్వానికి హాని చేయజూసిన సూత్రధారులు ఎవరో తేల్చే ప్రక్రియ ఓ పక్క పుంజుకొన్న తరుణంలో, మరో దిక్కు ఆ దూతలు ఉరఫ్ దళారులు జైలు ఊచలు లెక్కిస్తుండగా తెలంగాణ గడ్డపై మీ అధికారిక అండ్ పార్టీ పరమైన పర్యటనలు, సభలు, స్పీచ్‌లలో స్వచ్ఛత పాళ్లు ఎంతో మా రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ గ్రహించారు. పాలలో నీళ్లను వేరు చేసే హంసలా నియ్యత్, బే నియ్యత్లను ఇట్టే పట్టేసే చైతన్య సమాజం మా తెలంగాణ సొంతం.
ఈ గడ్డ చైతన్య తరంగాలు దేశవ్యాప్తంగా వీచే రోజులు వచ్చేశాయి. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా మసలుకొంటే మంచిది మోదీజీ. లేదంటే కమల వికాసం అటుంచి, కమల్ ఫైల్స్ పాపాలు, పాలనా వైఫల్యాలు నిలువునా పుట్టి ముంచుతాయి!
(వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
-ఇల్లెందుల దుర్గాప్రసాద్ 94408 50384