Mystery death : థాయ్‌లాండ్ (Thailand) లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ డైసీ కార్నివాల్
సంగీత ఉత్సవం (Music fest) లో పాల్గొన్న ఒక భారతీయుడు (Indian) బయటికి వచ్చిన అనంతరం
అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈనెల 18న ఈ ఘటన జరిగింది. ఘటనపై అక్కడి పోలీసులు
దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగిందంటే.. థాయ్‌లాండ్‌లోని పుకెట్‌లో మూడు రోజులపాటు ఎలక్ట్రిక్ డైసీ కార్నివాల్ సంగీత
ఉత్సవం జరిగింది. ఈ సంగీత కార్యక్రమానికి వేలమంది పర్యాటకులు హాజరయ్యారు. జైసాక్షమ్ (28) అనే
భారతీయుడు కూడా అందులో పాల్గొన్నాడు. కార్యక్రమం అనంతరం బయటకు వచ్చిన అతడు విచిత్రంగా
ప్రవర్తించాడు. నియంత్రణ కోల్పోయి రోడ్డుపై ఉన్న ప్రభుత్వ ఆస్తులను, పార్కింగ్లోని వాహనాలను ధ్వంసం
చేశాడు.
రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్పృహ కోల్పోయిన జైసాక్షమ్ కాసేపటికే మరణించాడు. అయితే జైసాక్షమ్ మృతికి గల కారణాలను వైద్యులు వెల్లడించలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, భౌతిక దాడికి సంబంధించిన గుర్తులు కూడా లేవని ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిపారు.
పోస్టుమార్టం తర్వాతే జైసాక్షమ్ మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. బాధితుడి కుటుంబానికి ఈ విషయం తెలియజేసేందుకు.. భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధితుడి మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.