Mana Shankara Vara Prasad Garu | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. గతంలో ‘అఖండ 2’, ‘రాజా సాబ్’ వంటి సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో ఇలాంటి మెమోలు జారీ చేయవద్దని హైకోర్టు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికారులు మళ్ళీ అదే తప్పు చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. దీంతో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఈ సినిమాకు అదనపు ధరల అనుమతులు ఇచ్చినందుకు గాను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీ ఆనంద్‌తో పాటు సంబంధిత అధికారులపై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం స్వచ్ఛందంగా (Suo-Moto) కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించి నోటీసులు జారీ చేసింది.
అలాగే ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని కోర్టు తప్పుబట్టింది. ఒకవైపు మంత్రులు బహిరంగంగా టికెట్ ధరలు పెంచబోమని చెబుతూనే మరోవైపు కోర్టుకు సెలవులు ఉన్న సమయంలో, అర్థరాత్రి పూట రహస్యంగా స్పెషల్ మెమోలు జారీ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సినిమా టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసి, సినిమాను కేవలం ఒక విలాసవంతమైన వస్తువుగా మారుస్తున్నారని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. జనవరి 12న విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 అదనంగా పెంచుకునేలా ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై దాఖలైన పిటిషన్ ఈ సంచలన తీర్పుకు దారితీసింది.
మరోవైపు భవిష్యత్తులో ఇలాంటి గందరగోళానికి తావులేకుండా హైకోర్టు కఠిన నిబంధనలను విధించింది. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచాలని భావిస్తే ఆ నిర్ణయాన్ని సినిమా విడుదల కావడానికి కనీసం 90 రోజుల ముందే తీసుకోవాలని స్పష్టం చేసింది. సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు లేదా అర్ధరాత్రి పూట హడావుడిగా మెమోలు ఇచ్చే సంస్కృతికి ఇక స్వస్తి పలకాలని అధికారులను ఆదేశించింది.