Manoj Tiwari : బీజేపీ ఎంపీ, నటుడు మనోజ్ తివారీకి చెందిన ముంబైలోని ఇంట్లో దొంగతనం జరిగింది. గతంలో ఆ ఇంట్లో పని చేసిన మాజీ పనిమనిషి ఒకరు ఈ చోరీకి పాల్పడ్డట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. రెండు దఫాలుగా జరిగిన చోరీలో మొత్తం రూ.5.4 లక్షలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. మనోజ్ తివారి భోజ్ పురి సినీ పరిశ్రమలో నటుడిగా, సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అతడు ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అతడికి ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్లో కొంతకాలం క్రితం సురేంద్ర కుమార్ దీనానాథ్ శర్మ అనే వ్యక్తి పని చేసేవాడు. అతడిని రెండేళ్లక్రితం పనిలోనుంచి తొలగించారు. కానీ, ఇంట్లో పనిచేసిన సమయంలో ఇంటికి సంబంధించి డూప్లికేట్ కీ రెడీ చేసుకున్నాడు. గత ఏడాది జూన్ నెలలో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో డూప్లికేట్ కీ ద్వారా ఇంట్లోకి అక్రమంగా చొరబడి రూ.4.4 లక్షలు దొంగిలించాడు. అప్పట్లో ఈ చోరీ ఎవరు చేశారో గుర్తించలేకపోయారు. ఈ ఘటనతో ఇంట్లో సీసీ కెమెరాలతోపాటు, థెప్ట్ అలర్ట్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే, తాజాగా దీనానాథ్ శర్మ మరోసారి చోరీ చేశాడు. అదే డూప్లికేట్ కీతో ఇంట్లోకి ప్రవేశించి కప్ బోర్డులోని రూ.1 లక్ష ఎత్తుకెళ్లాడు.
కానీ, ఈసారి తివారి మేనేజర్ పాండే మొబైల్ కు దీనికి సంబంధించి అలర్ట్ వచ్చింది. ఇంట్లోకి ఎవరో అక్రమంగా ప్రవేశించారనే అలర్ట్ తో మొబైల్ ద్వారా సీసీ కెమెరాల్ని పరిశీలించగా.. శర్మ చోరీ చేయడాన్ని గుర్తించారు. దీంతో అక్కడి సెక్యూరిటీకి సమాచారం అందించగా.. పోలీసుల సహకారంతో నిందితుడు దీనానాథ్ శర్మను అదుపులోకి తీసుకెళ్లారు. రూ.1 లక్ష స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.