గ్రంథాలయాలు జ్ఞాన సముపార్జనకు కేంద్రాలు. మన ముందుతరాల వారు జీవించిన విధానం, నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు తర్వాతి తరాల వారికి చేరేది గ్రంథాల వల్లే! ప్రపంచంలోని మేధావులంతా పుస్తక పఠనం ద్వారా గొప్ప ఆలోచనలు పెంపొందించుకొని తమ తమ రంగాల్లో అద్భుతాలు సాధించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యాన్ని, పఠనం వల్ల కలిగే లాభాలను తెలియజేయడానికి 1968 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా నవంబర్ 14-20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి.
గత శతాబ్దం ప్రథమార్థంలో భారత దేశ చరిత్రలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సామాజికంగా, రాజకీయంగా యువతలో చైతన్యం పరవళ్లు తొక్కింది. పాఠశాలల స్థాపన, ఆంగ్ల విద్యా వ్యాప్తి వల్ల చదువుకొనే వారి సంఖ్య పెరిగింది. పుస్తకాల ప్రాముఖ్యం పెరిగింది. ప్రజలు నాడు స్వాతంత్య్ర ఉద్యమ వార్తలు, ప్రపంచ పరిణామాలను పత్రికలు, గ్రంథాల ద్వారానే తెలుసుకునేవారు. ఒకప్పుడు ప్రజలెవరైనా ఏదైనా సమాచారం కావాలంటే గ్రంథాలయాలకే వెళ్లేవారు. తెలుగునాట గ్రంథాలయాల ద్వారా సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకురావచ్చని గ్రహించిన నాటి సంఘ సంస్కర్తలు, నాయకులు దాన్ని ఒక ఉద్యమంగా నడిపారు. 1914లో ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం ఏర్పడింది. గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య సారథ్యంలో గ్రంథాలయోద్యమం జాతీయోద్యమ స్ఫూర్తితో నడిచింది.
తెలంగాణ ప్రాంతంలో 1901లో హైదరాబాద్ నగరంలో కొమర్రాజు వెంకటలక్ష్మణరావు ప్రోత్సాహంతో మునగాల రాజా, రావిచెట్టు రంగారావుల సహకారంతో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. ఇది తెలుగు రాష్ర్టాల్లో మొట్టమొదటి ప్రభు త్వేతర గ్రంథాలయంగా చెప్పవచ్చు. ఆ తర్వాత వట్టికోట ఆళ్వారుస్వామి లాంటి సాహితీవేత్తల ప్రోత్సాహంతో హైదరాబాద్, వరంగల్ మొదలైన చోట్ల పౌర గ్రంథాలయాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో గ్రంథాలయాలు తమ వంతు పాత్రను పోషించాయి. స్వాతంత్య్రానంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చిన్న పట్టణాల్లో కూడా గ్రంథాలయాలు ప్రారంభించా యి. ముల్కనూరు ప్రజా గ్రంథాలయం తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకొంది. కొత్త పుస్తకాల కొనుగోలుకు బడ్జెట్ పెంచింది. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం గ్రంథాలయాల్లో పుస్తకాలతోపాటు అనేక సౌకర్యాలు కల్పించింది. గ్రంథాలయాల్లోని పుస్తకాలను డిజిటలైజ్ చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నది.
ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో పఠనం పట్ల ఆసక్తి పెంచడానికి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తారు. అరుదైన, ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలను ప్రదర్శనకు ఉంచుతారు. భారత ప్రభు త్వం గ్రంథాలయాల అభివృద్ధి కోసం నియమించిన కమిటీ అధ్యక్షురాలు కల్పనా దాస్ గ్రంథాల గురించి ఇలా చెప్పారు.. ‘గ్రంథాలయాలు కేవ లం పుస్తకాల నిక్షేపాలు కాదు, అవి సమాచార వనరులు. జ్ఞాన సముపార్జన కేంద్రాలు. నూతన భావాల ఉత్పాదనకు, నూతన విజ్ఞాన సృష్టికి నిలయాలు. ముఖ్యంగా పౌర గ్రం థాలయాలు సమాచార లేమిని నిర్మూలించాలి. అవి సమాజంలోని అన్ని తరగతులకు సేవలందిస్తూ జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలి.’
(వ్యాసకర్త: తెలుగు విశ్రాంత అధ్యాపకురాలు)
-డాక్టర్ కనుపర్తి విజయ బక్ష్ 94413 82303