సహకార సంస్థలు లేదా సంఘాల ద్వారానే సమాజంలోని సామాన్యులు, రైతుల ఆర్థిక అవసరాలు తీరతాయి. ఈ విధానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. కానీ కేంద్రం రైతులకు చెందిన సహకార బ్యాంకులను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నది. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలి. సహకార వ్యవస్థ పట్ల అవగాహన పెంచుకోవాలి.
రైతులకు చెందిన సహకార బ్యాంకులను వారికి తెలియకుండా కేంద్రం ప్రైవేటుపరం చేస్తున్నది. ఇందుకోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) – 2020 చట్టం తెచ్చింది. దీన్ని ‘సహకార ధర్మ పీఠం’ వ్యతిరేకించింది. ధర్మదీక్షలు, సమావేశాలు నిర్వహించి తాత్కాలికంగా ఈ చట్టంలోని సెక్షన్ 12(1)ను ఆపగలిగింది. మరోపక్క కేంద్రం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్‌కు సవరణలు చేసింది. దీనివల్ల భారత గ్రామీణ ఆర్థికవ్యవస్థ కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీల గుప్పిట్లోకి పోతుంది. నవంబర్ 14-21 వరకు 69వ అఖిల భారత సహకార వారోత్సవాలు జరుగుతున్నా యి. ఈ నేపథ్యంలో ప్రజలు సహకార వ్యవస్థ ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
సహకార విధానం అనేది ప్రత్యేక ఆర్థిక విధానం. సహకార సూత్రాలు, విధానాలు వక్రీకరించకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు 1923లో అంతర్జాతీయ సహకార సమితిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో భారతదేశం కూడా భాగస్వామి. సరళీకృత ఆర్థికవిధానాల నేపథ్యంలో 1995లో సహకార సూత్రాలను ప్రపంచ దేశాలు పునఃసమీక్షించుకొని కొత్త సూత్రాలను అమలు చేయాలని నిర్ణయించుకు న్నాయి. ఈ సూత్రాలనే భారతదేశంలో కేంద్ర సహ కార చట్టం, రాష్ట్ర సహకార చట్టాలలో పొందుపరుచు కున్నాం. ఐక్యరాజ్యసమితి 1995 నుంచి ప్రతి సంవ త్సరం జూలై మొదటి శనివారాన్ని అంతర్జాతీయ సహ కార దినంగా ప్రకటించింది. సహకార విధానాన్ని అమ లుచేయడం ప్రభుత్వాల రాజ్యాంగ విధి. అందుకే ఈ విధానాన్ని అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వాలు సహకార ప్రాతిపదికన కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. సహకార సంస్థ లేదా సంఘం అంటే ఆర్థిక దోపిడీని తొలగించడానికి, ఇతరుల దోపిడీ నుంచి తప్పించుకోవడానికి సమానత్వంగా కలిసి పనిచేసే వ్యక్తుల వ్యవస్థ. సహకార సం ఘాలు స్వయం సహాయం, స్వయం బాధ్యత, ప్రజాస్వామ్యం, సమానత్వం, సంఘీభావం అనే విలువలపై ఆధారపడి చేస్తాయి.
ఈ సంఘాల సభ్యులు నిజాయితీ, పారదర్శకత, సామాజిక బాధ్యత, ఇతరుల పట్ల శ్రద్ధ వహించడం లాంటి నైతిక విలువలను విశ్వసిస్తారు. లింగ భేదం లేకుండా,సామాజిక, జాతి, రాజకీయ, మత వివక్షతలు లేకుండా సభ్యత్వ బాధ్యతలు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులందరూ సహకార సంఘాల్లో సభ్యులు కావచ్చు. సహకార సంఘాలు సభ్యులతో నియంత్రించబడే ప్రజాస్వామ్య సంస్థలు. సహకార సంఘ సభ్యులు సంస్థ నిర్ణయాలు రూపొందించడంలో చురుగ్గా పాల్గొంటారు. సహకార సంఘాల్లో సభ్యులకు సమాన ఓటు హక్కు ఉంటుంది.
సహకార సంఘం లేదా సంస్థ సభ్యులు తమ సం ఘం మూలధనానికి సమానంగా సహకరిస్తారు. మూలధనంపై పరిమిత పరిహారాన్ని స్వీకరిస్తారు. సభ్యుల ఆర్థిక అవసరాలకు సహకరిస్తారు. సహకార సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఇవి తమ సభ్యులకు, ఎన్నికైన ప్రతినిధులకు, నిర్వాహకులకు తగిన శిక్షణ అందిస్తాయి. సహకారసంఘం సభ్యులు సాధారణ ప్రజలకు ముఖ్యంగా యువకులకు సహకా రం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. ఈ సంస్థ లు తమ సభ్యులకు అత్యంత ప్రభావవంతంగా సేవలు అందిస్తాయి. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేస్తా యి. జాతీయ, అంతర్జాతీయ నిర్మాణాల ద్వారా కలిసి పనిచేస్తాయి. సహకార సంస్థలు సభ్యులచే ఆమోదించబడిన విధానాల ద్వారా సుస్థిరమైన అభివృద్ధికి, సమాజ శ్రేయస్సు కోసం కృషిచేస్తాయి.
(వ్యాసకర్త: ధర్మకర్త, సహకార ధర్మపీఠం)
-సంభారపు భూమయ్య 82478 16648