Curry Leaves | భారతీయుల వంటగదిలో ఉండే వాటిల్లో కరివేపాకు కూడా ఒకటి. కరివేపాకును మనం ఎంతో కాలంగా వంటలల్లో వాడుతున్నాం. దాదాపు మనం చేసే ప్రతి వంటకాలలో దీనిని వేస్తూ ఉంటాం. మనం చేసే వంటలకు చక్కటి వాసనను, రుచిని తీసుకు రావడంలో కరివేపాకు పాత్ర ఎంతో ఉంది. వంటలకు రుచిని తీసుకురావడంతో పాటు కరివేపాకును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఆకులు చిన్నగా ఉన్నప్పటికీ ఇవి ఎన్నో పోషకాలను, ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, కాలేయ పనితీరును మెరుగుపరచడంలో, జుట్టు పెరుగుదలకు, జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా కరివేపాకు మనకు సహాయపడుతుంది. కరివేపాకును తినడం వల్ల మన మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుందని చెప్పవచ్చు. కరివేపాకును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
కరివేపాకును తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్ లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే కరివేపాకును నూనెలో వేయించడం వల్ల గిరినింబైన్ అనే సమ్మేళనం విడుదల అవుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. కరివేపాకును తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ వ్యాధులు రాకుండా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా కరివేపాకు మనకు సహాయపడుతుంది. కొవ్వును కరిగించడంలో, శరీర జీవక్రియల వేగం పెంచడంలో కరివేపాకులో ఉండే సమ్మేళనాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే కరివేపాకులో మహానింబైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీవక్రియల వేగం పెంచడంలో, ఆకలిని అణచివేయడంలో, క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అయ్యేలా చేయడంలో దోహదపడుతుంది.
కరివేపాకు డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కలిగిన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ నిర్వహణలో సహాయపడతాయి. అలాగే కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కణాల ఒత్తిడి, వాపు అవయవాల పనితీరును దెబ్బతీస్తాయి. దీంతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కరివేపాకును తీసుకోవడం వల్ల కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక జుట్టును, తలచర్మం ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది. కరివేపాకులో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు, విటమిన్లు జుట్టు ఆరోగ్యాన్ని సహజంగా పెంచుతాయి.
కరివేపాకును తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. అలాగే కరివేపాకులో ఉండే ఆమైనో ఆమ్లాలు చర్మానికి రక్తప్రసరణ పెరిగేలా చేస్తాయి. దీంతో ఫోలికల్స్ కు పోషకాలు చక్కగా అందుతాయి. కరివేపాకును ఆహారంగా తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇలా కరివేపాకు మనకు బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని దీనిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.