Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో ఒక భారీ సినిమా రాబోతుందంటూ గత కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకూ తెరపడింది. నేడు భోగి పండుగ సందర్భంగా ఈ క్రేజీ కాంబినేషన్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అల్లు అర్జున్ కెరీర్లో 23వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను, ‘పుష్ప’ వంటి అంతర్జాతీయ స్థాయి విజయాన్ని అందించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేసింది.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించబోతుండగా, టెక్నికల్ పరంగా ఈ సినిమా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో కలిసి తన 22వ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే 2026 రెండో అర్ధభాగంలో లోకేష్ కనగరాజ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా లోకేష్ కనగరాజ్ సృష్టించిన పాపులర్ ‘LCU’ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) లో భాగమవుతుందా లేదా అనే విషయంపై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.