ఇటీవల భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఒక సంచలనాత్మక తీర్పు న్యాయ కోవిదులతో పాటు సామాన్యుల మస్తిష్కాల్లో కొన్ని ప్రశ్నల్ని రేకెత్తించింది. ఈ తీర్పు మన కోర్టులు అనుసరిస్తున్న న్యాయ విచారణలోని లోపాలను ఎత్తి చూపుతూ వాటిని సవరించుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నది. మౌలిక న్యాయ సూత్రాల ఆచరణను నొక్కి చెబుతున్నది. కోర్టుల విచక్షణాధికారాలపై విస్తృత చర్చ జరగాలని సూచిస్తున్నది.
సాధారణ నేరాల విషయంలో అంతగా ఆసక్తి చూపని, న్యాయ శాస్త్ర మౌలిక సూత్రాలతో అంతగా పరిచయం లేని మన పౌర సమాజం ఆడవారి మీద జరిగే అమానుషాల విషయంలో ముఖ్యంగా లైంగిక దాడి, హత్య విషయాల్లో తీవ్రంగానే స్పందించి నిందితులకు తీవ్రమైన శిక్షలను విధించాలని కోరుకుంటుంది. అలాంటి శిక్షలను విధించని తీర్పుల్ని అన్యాయమైనవిగా భావిస్తుంది. అనామిక కేసు విషయంలో ఇదే జరిగింది.
అత్యంత దారుణమైన, లైంగిక దాడి-హత్య కేసు విచారణలో, ట్రయల్ కోర్ట్ తన విచక్షణాధికారాన్ని వినియోగించకుండా, అచేతన పాత్ర వహిస్తూ అరుదైన వాటిలో అత్యంత అరుదైన నేరాల్లో మాత్రమే విధించాల్సిన ఉరి శిక్షను నిందితులకు విధించిందని అనామిక హత్య కేసు విచారణలో సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాలు నమ్మదగినవిగా లేవని, అందుకే నిందితులకు లభించే సంశయ లాభ న్యాయ సూత్రాన్ని అనుసరిస్తూ ఉరి శిక్షను రద్దు చేసి, నిందితులని విడుదల చేయాలని ఆదేశించింది. మౌలిక న్యాయ సూత్రాలను అనుసరించనందునే ట్రయల్ కోర్టు తీర్పుని కొట్టి వేశామని తెలిపింది. ఆ కోర్టు తీర్పుని ఆమోదించిన హైకోర్టు తీర్పుని కూడా సుప్రీం కోర్టు తప్పు పట్టింది.
09-02-2012న ఢిల్లీలో జరిగిన అనామిక(అసలు పేరు కాదు) అత్యాచార కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం ఎర్ర రంగు ఇండికా కారులో వచ్చిన ఒక యువకుడు అనామికను కారులోనికి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయాడు. యువతి కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో 13-02-2012న న్యూఢిల్లీ ద్వారకా ప్రాంత మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఒక ఎర్ర రంగు ఇండికా కారు కనిపించింది. ఆ కారులో ఉన్న రాహుల్ అనే వ్యక్తిని ప్రశ్నించిన పొలీసులకు గగుర్పాటు కలిగించే విషయాలు తెలిశాయి. అతడి వాంగ్మూలం ప్రకారం అతడు, అతడి సోదరుడు రవి, వినోద్ అలియాస్ చోటూ కలిసి 09-02-2012 రోజు రాత్రి ఒక యువతిని అపహరించి, ఆమెపై సామూహిక లైంగిక దాడి చేసి, చంపి పంట పొలంలో విసిరేశారు.
రాహుల్ చెప్పిన వివరాల ప్రకారం ఒక యువతి మృతదేహం లభించింది. తమకు లభించిన ఆధారాలను పొలీసులు ట్రయల్ కోర్టుకు సమర్పించారు. కేసు విచారించిన అదనపు సెషన్స్ న్యాయమూర్తి నిందితులకు ఉరి శిక్షను విధించగా, హైకోర్టు దాన్ని ధృవీకరించింది. ముగ్గురు నిందితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును నిశితంగా విచారించిన సుప్రీం కోర్టు న్యాయ విచారణ ప్రక్రియలో పరిగణనలోనికి తీసుకోవాల్సిన అంశాలను విపులంగా వివరిస్తూ, అవి పరిగణనలోకి తీసుకోకుండా విచక్షణను ఉపయోగించకుండా, ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వడంవల్లనే ఆ తీర్పుని కొట్టి వేశామని తెలిపింది.
నేరం-శిక్ష విషయంలో విచారణ కోర్టులకు కొన్ని మార్గ దర్శకాలు ఉన్నాయన్న విషయాన్ని పౌర సమాజం గుర్తించాలి. కేసుల విచారణలో కోర్టులు విచక్షణాధికారాలు వినియోగించకపోవడం వల్లనే కింది కోర్టుల తీర్పులు పై కోర్టులకు వెళ్లే సరికి మార్పులకు గురవుతున్నాయి లేదా కొట్టి వేయబడుతున్నాయి.
అయితే ఇదే సందర్భంలో పౌర సమాజం సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెపాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది. మొదటి ప్రశ్న – మన ట్రయల్ కోర్టులు వెలువరించే తీర్పులు న్యాయమైనవైతే పై కోర్టుల్లో వాటిని ఎందుకు కొట్టేస్తున్నారు? 2.అనామిక కేసులో నిందితులు నిజంగా నిర్దోషులు అయ్యుండి, తమ అశక్తత వల్ల సుప్రీం కోర్టును ఆశ్రయించక పోయుంటే, ట్రయల్ కోర్ట్ విచక్షణా రహిత తీర్పు వల్ల వారికి ఉరి శిక్ష పడి ఉంటే, వారి కుటుంబాలకు అన్యాయం జరిగేది కదా? అలాగే నిందితులు నిజంగా దోషులైతే సుప్రీం కోర్టు తీర్పు వల్ల అనామిక కుటుంబానికి అన్యాయం జరిగేది కదా? 3.మరింత మంది జడ్జిలతో కూడిన సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ప్రస్తుత తీర్పుని అంగీకరించకుండా నిందితుల్ని దోషులుగా నిర్ణయిస్తే శిక్షార్హులైన నిందితులు శిక్షకు సిద్ధపడి పారిపోకుండా ఉండగలరా? 4.నేరాల విచారణలో ఎంతో అనుభవజ్ఞులైన ట్రయల్ కోర్టు జడ్జీలు తీవ్రమైన నేరాల విషయాల్లో కూడా నిర్వికారంగా వ్యవహరిస్తూ, అన్యాయ పూరితమైన శిక్షలు విధిస్తున్నప్పుడు వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా ? 5.పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు సందేహాస్పదంగా ఉన్నప్పుడు,
దురుద్దేశంతో సాక్ష్యాలను సమర్పించినప్పుడు వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? 6.తీవ్రమైన నేరాల విషయంలో నిజాలను రాబట్టేందుకు లై డిటెక్టర్ పరీక్ష చేయాల్సిన అవసరం లేదా? 7.తీవ్రమైన నేరాల విషయంలో ఒక న్యాయమూర్తి విజ్ఞతకే విచారణను వదిలేయకుండా, న్యాయ కోవిదులతో కూడిన ఒక జ్యూరీ ఏర్పాటు చేయవచ్చు కదా? 8.ట్రయల్ కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తీవ్రమైన నేరాల విషయంలోనూ ఘోరమైన పొరపాట్లు చేస్తున్నప్పుడు వారి అవగాహన లోపాల్ని సవరించి వారి పరిజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం లేదా? 9.న్యాయ విచారణలో జరుగుతున్న కాల యాపనను కట్టడి చేసే అవకాశమే లేదా?
ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చెబితేనే పౌర సమాజానికి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది. విచారణ ప్రక్రియ లోపాలను సవరించుకోవాల్సిన అవసరం కూడా న్యాయ వ్యవస్థపై ఉంది. మన ప్రశ్నలకు, మన విమర్శలకు భారత న్యాయ వ్యవస్థ తప్పకుండా స్పందిస్తుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త: సీనియర్ న్యాయవాది)
-బసవరాజు నరేందర్ రావు
99085 16549