ఆయన ఎక్కడకు వెళ్లినా అభివృద్ధి ‘సినిమా’ చూపిస్తారు! అందమైన కబుర్లు చెబుతారు. ఊరించే హామీలు ఇస్తారు. కానీ ఆచరణలో మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు. విపక్ష రాష్ర్టాలపై విషం కక్కుతూ ఉంటారు. ఆయనే… ప్రధాని మోదీ. కానీ చైతన్యవంతమైన తెలంగాణ సమాజం తన మాటలను నమ్మదని మోదీ తెలుసుకోవాలి. దేశ ప్రజలందరూ బీఆర్ఎస్ నాయకత్వానే కోరుకుంటున్నారని తెలుసుకోవాలి.
ప్రధాన మంత్రి రాష్ర్టాలకు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన నిధులను, ప్రాజెక్టులను మంజూరు చేయాలి. కానీ తెలంగాణ అభివృద్ధిని చూసి అక్కసు వెళ్లగక్కడం, అభివృద్ధికి సహకరించకుండా నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహించడం నరేంద్ర మోదీకి అలవాటుగా మారిపోయింది.
ఏ నాయకుడైనా అబద్ధాలతో ఎన్నో రోజులు ప్రజలను మభ్య పెట్టలేరు. అందమైన డైలాగులు ప్రజల బతుకుల్లో ఎటువంటి మార్పును తీసుకురావు. కానీ తాను ఎక్కడికి వెళ్తే అక్కడ అభివృద్ధి జరుగుతున్నట్లు ప్రధాని మోదీ భ్రమలు కల్పిస్తారు. ఇటీవల గుజరాత్లోని మోర్బి దుర్ఘటన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిని మోదీ సందర్శించారు. ఆయన రాక సందర్భంగా ఆసుపత్రిని ఆఘమేఘాల మీద పైపై పూతలతో అందంగా ముస్తాబు చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులు రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులకు ‘శంకు స్థాపనలు’ మాత్రమే చేసి వదిలి పెట్టారు. కేంద్రం, గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఈ తాత్కాలిక చర్యలను దేశ ప్రజలు ఈసడించుకున్నారు. అయినా ప్రధానితో సహా బీజేపీ నాయకులందరూ తామేదో గొప్ప అభివృద్ధి చేస్తున్నట్లు అందమైన డైలాగులు చెబుతూనే ఉన్నారు. దేశ ప్రధాని హోదాలో పలుమార్లు తెలంగాణకు వచ్చిన మోదీ ఇలాంటి కబుర్లే చెప్పారు. కానీ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. రామగుండం సభలో కూడా కడుపులో విషాన్ని పెట్టుకొని ప్రేమను ఒలక బోస్తున్నట్లు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ కృషిని కించపరిచారు. ఆయన మాటలను తెలంగాణ సమాజం నమ్మడం లేదు.
కేంద్రం ఇలా మాటలతో సరి పెడుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఆధునిక సాంకేతికత సాయంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలను అభివృద్ధి పరిచింది. కొత్తగా పురుడుపోసుకున్న తెలంగాణ కేవలం ఎనిమిదేండ్లలోనే దేశానికి దిక్సూచిగా మారింది. ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్లో కార్యాలయం పెడతామని వరుస కడుతున్నాయి. హరిత హారం కారణంగా రాష్ట్రం పచ్చదనంతో కళకళ లాడుతూ ఉంది. సాగునీటి సదుపాయాలు మెరుగవడం వల్ల పసిడి పంటలు పండుతున్నాయి. రైతులకు రంది లేకుండా రైతు బంధు, రైతు బీమా పథకాలు అండగా నిలుస్తున్నాయి. రాష్ట్రం భారత దేశానికి సిలికాన్ వ్యాలీగా మారుతున్నది. విద్యుత్తు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది.
తెలంగాణ ఇలా దేశానికి ఆదర్శంగా నిలుస్తుంటే, దేశాన్ని అభివృద్ధి చేస్తామన్న మోదీ ఆచరణలో అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. భారతదేశంలో అవినీతి లేకుండా చేస్తామని పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ మాటలు ఎలాంటి ఫలితాలనూ ఇవ్వలేదు. నోట్ల రద్దు జరిగి ఆరేళ్లు గడచినా అవినీతి సొమ్ము బయటకు రాలేదు. పేదలకు ఇచ్చే రాయితీలు రద్దు చేస్తూ, బడా కార్పొరేట్లకు భారీగా రుణ మాఫీ చేస్తున్న మోదీ సర్కారు ఎవరి పక్షమో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ హామీ అమలుకు నోచుకోలేదు. ఈ ఏనిమిదేండ్లలో కేంద్రం భర్తీ చేసిన కొలువులు కేవలం 20 లక్షల లోపే. మరో పక్క కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేస్తున్నది. నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టాలని చూసింది. ప్రధాన మంత్రి రాష్ర్టాలకు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన నిధులను, ప్రాజెక్టులను మంజూరు చేయాలి. కానీ తెలంగాణ అభివృద్ధిని చూసి అక్కసు వెళ్లగక్కడం, అభివృద్ధికి సహకరించకుండా నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహించడం నరేంద్ర మోదీకి అలవాటుగా మారిపోయింది.
అంబేద్కర్ లాంటి నాయకులు, ఆయన కల్పించిన రాజ్యాంగ హక్కులు, సౌకర్యాలు లేకుంటే తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చేదే కాదని ఒక సందర్భంలో మోదీ అన్నారు. కానీ ఆ మాటలకు పూర్తి భిన్నంగా ఆయన పాలన కొనసాగుతున్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లలో ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే, కేంద్రం దాన్ని కనీసం పరిగణనలోనికి కూడా తీసుకోలేదు. దీన్ని బట్టి బీజేపీ నాయకులు, ప్రధాని మోదీ చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఉండదని స్పష్టంగా అర్థం అవుతుంది.
ఆరు దశాబ్దాల గోసను, అణచివేతను అధిగమించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఉద్యమాన్ని చేపడితే, దానికి సహకరించకపోగా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ఇటీవల కుట్ర పన్నింది. సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి రాష్ర్టాల హక్కులను దెబ్బ తీస్తూ, బీజేపీయేతర ప్రభుత్వాలను కూలుస్తూ దేశమంతటా ఆధిపత్యాన్ని చెలాయించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ప్రజల బతుకులను అంధకారంలోకి నెట్టేలా కుట్రలు చేస్తున్న బీజేపీకి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలి. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్కు మద్దతు తెలిపి దేశ రాజకీయాలను మార్చాలి. మోదీ చెప్పే కట్టు కథలను నమ్మకుండా ఉద్యమ నాయకుని నాయకత్వంలో నవ భారత నిర్మాణం చేయాలి.
(వ్యాసకర్త: దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు)
-సంపత్ గడ్డం
78933 03516