మునుగోడులో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాధించిన విజయం ‘నభూతో న భవిష్యతి!’. అదొక అనిర్వచనీయమైన అద్భుత విజయం. మునుగోడు విషయంలో ముఖ్యమంత్రి విసిరింది మాములు సవాలు కాదు, ఎందుకంటే.. మునుగోడు నియోజకవర్గమైనా, నల్గొండ జిల్లాలో అయినా దశాబ్దాలుగా కోమటిరెడ్డి బ్రదర్స్ అత్యంత బలమైన క్యాడర్ కలిగి ఉన్నారన్న విషయం జగమెరిగిన సత్యం.
ఈటెల రూపంలోనో, రాజగోపాల్‌రెడ్డి రూపంలోనో, మొన్నటికి మొన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే రూపంలోనో బీజేపీ పెద్ద ఎత్తున కుట్రలు చేసిన సందర్భాలను మనం చూశాం. అన్ని కుట్రలను ఛేదించుకొని అత్యంత చాకచక్యంగా కేసీఆర్ పదునైన ఆలోచనలతో, చక్కటి ప్రణాళికతో రాష్ర్టాన్ని పరాయి వ్యక్తుల చేతుల్లోకి పోకుండా కాపాడుతూనే ఉన్నారు. తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా ఆయన ముందుకు తీసుకువెళ్లడం యావత్ తెలంగాణ బిడ్డలు గర్వించే సందర్భం.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులుగా పనిచేయడమే కాకుండా వైఎస్సార్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారు. ఏండ్లతరబడి వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కాంట్రాక్టులు, వ్యాపారాలు కలిగి ఉండి, ప్రజా క్షేత్రంలో అంగబలం, ఆర్థికబలం పరిపుష్టిగా ఉన్న నాయకులు వారు. ప్రజలు, కార్యకర్తలు ఆపద వచ్చి ఏ రాత్రి వెళ్లినా వారికి ఆ కుటుంబం నుంచి సహాయ సహకారాలందుతాయనే భరోసా ఒకప్పుడు ఉండేదని వారి అనుచరులు అంటుంటారు. అయితే అది గతం. ఇప్పుడు వారు వేల కోట్ల డబ్బుల మాయలో పడి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలనే పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
మనం ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమంటే కేసీఆర్ విసిరిన అస్త్రం, మొన్నటి గెలుపు ఆషామాషీ కానే కాదు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఒక సామాన్య కార్యకర్త. కోమటిరెడ్డి కుటుంబం పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో పోలిస్తే చాలా తక్కువ. అదేవిధంగా కోమటిరెడ్డి కుటుంబం గ్రాఫ్ ముందు ప్రభాకర్‌రెడ్డి గ్రాఫ్ చాలా తక్కువనే చెప్పవచ్చు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నమ్మకస్తుడే కావచ్చు, మొదటినుంచి కేసీఆర్‌ను నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తనే కావచ్చు, కానీ కోమటిరెడ్డి కుటుంబంతో పోటీపడేంత పెద్ద నాయకుడు మాత్రం కాదు.
కోమటిరెడ్డి కుటుంబం ఆడిన గేమ్ కూడా మామూలుది కాదు. కాంగ్రెస్, బీజేపీ వేర్వేరు కాదు, రెండూ కలిసి ఆడిన నాటకమే మునుగోడు. కొందరు కుహనా మేధావులు కూడా వేర్వేరు రూపాల్లో వివిధ ముసుగులు వేసుకొని ఆడిన ఎన్నికల పోటీ నాటకం మనం లైవ్‌లో చూశాం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనే వ్యక్తి ఒక్కడు చేసిన పోటీ కాదిది. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్‌లతో కలిసి అత్యంత శక్తిమంతమైన మూకలు సీఎం కేసీఆర్ మీద, తెలంగాణ మీద యుద్ధం ప్రకటించాయి. అనైతిక చీకటి పొత్తులతో పోరాటం మొదలుపెట్టాయి. పట్టు సాధించాలని బలమైన ప్రయత్నమూ చేశాయి. కానీ కేసీఆర్ మాత్రం అలవోకగా, అత్యంత చాకచక్యంగా శత్రువును దెబ్బకొట్టిన విధానం అద్భుతం. బీజేపీ ఈ దేశంలో చేస్తున్న దిగజారుడు రాజకీయాలను సవాలు చేస్తూ కొట్టిన దెబ్బ యావత్ దేశ రాజకీయాలను ఆలోచింపజేసింది. ‘మీరు ఎంతమందైనా కలిసిరండి, నా బలం, బలగం, శక్తి నా ప్రజలే అంటూ ఒక సామాన్య కార్యకర్తను ఎన్నికల బరిలో నిలిపి మంచి
మెజారిటీతో గెలిపించుకున్నారు. దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఇది కేసీఆర్ చాణక్యనీతి. అందరినీ ఆలోచింపజేసిన అనన్య సామాన్యమైన ఎన్నికల గెలుపు కావ్యమిది. అంతేకాదు అంగబలం, ఆర్థికబలం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని కాంట్రాక్టులతో లొంగదీసుకొని అనైతిక పొత్తులతో గెలువాలని ప్రయత్నం చేసిన బీజేపీకి, రాబోయే సాధారణ ఎన్నికల్లో వారికున్న బలం, బలగం ఏమిటో గుర్తుచేసింది ప్రభాకర్‌రెడ్డి విజయం. ఇంత బలమై న నాయకున్ని నిలబెట్టినా గెలువలేదంటే రేపు రాబోయే ఎన్నికల్లో మన పరిస్థితి ఏమిటి? అని బీజేపీ మీమాంసలో పడేవిధంగా చేసింది.
తెలంగాణ మీద కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నమూ చేసినా కేసీఆర్ ఏ రోజూ అదరలేదు, బెదరలేదు. నిజానికి కేసీఆర్ ముందు ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా వారు సున్నితంగా తీసుకుంటారు. ఎన్ని కుట్రలు చేసినా లైట్‌గా తీసుకుంటారు. నాటి ఉద్యమకాలంలో కేసీఆర్‌ను ఇబ్బందిపెట్టని అంశమంటూ లేదు. అదికూడా ఇంటి దొంగలతోనే. ఆయన సబ్బండవర్గాలను ఏకంజేసి, అలుపెరుగని పోరాటంతో రాష్ట్ర, దేశ ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన విధానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సవాళ్లను అధిగమించారు. కుంటుపడిన అభివృద్ధిని పరుగులు పెట్టించారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ చేయాలన్న సంకల్పంతో, చిత్తశుద్ధితో కేసీఆర్ ముందుకుపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని శక్తులు ఇంటి దొంగలను వాడుకొని మన రాష్ర్టాన్ని మనం స్వేచ్ఛగా పాలించుకునే పరిస్థితి లేకుండా చేయాలని చూస్తున్నాయి.
ఈ కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి? వీటివెనుక మర్మం ఏమిటని తెలంగాణ బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కుట్రలను తిప్పికొట్టే క్రమంలో కేసీఆర్ మాత్రమే ఇబ్బందులు పడాలా? మనకూ ఆ బాధ్యత లేదా? అని అలోచించాలి. మన రాష్ట్రంలోని కొంతమంది నాయకుల సహకారంతోనే ఈ కుట్ర లు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం నిలవాల్సింది కేసీఆర్ వెంటే కదా, అలా కాకుండా కుట్రదారులకు సపోర్ట్ చేస్తే మన గోతి మనం తవ్వుకున్నట్లే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ‘ఎక్కడి దొంగలను అక్కడే చావుదెబ్బ కొడుతూ నా తెలంగాణను కాపాడుకున్నాను. రాబోయే రోజుల్లో నా దేశాన్ని కూడా కాపాడే బాధ్యత నాపైన ఉంది’ అని కేసీఆర్ ముందుకువెళ్తున్న సందర్భంలో ప్రతి భారతీయుడు ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు సంపూర్ణమైన అవగాహన కలిగి ఆయన ఆలోచనలను స్వాగతించాల్సిన, సహకరించాల్సిన చారిత్రాత్మక సమయం ఇది.
-గోగుల రవీందర్‌రెడ్డి
95022 52229