సమాజంలోని పలు వర్గాలకు చెందినవారికి ప్రత్యేక సౌలభ్యాలు, రాయితీలు కల్పించడం సంక్షేమరాజ్య లక్షణం. దివ్యాంగ విద్యార్థులు మానసిక, శారీరక అవరోధాల కారణంగా మిగతా పిల్లలతో సమానస్థాయి అవకాశాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్లే వీరికి వీలుగా పాఠ్య ప్రణాళికలో, పరీక్షా విధానంలో కొన్ని సౌలభ్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని దివ్యాంగుల హక్కుల కోసం రూపొందించిన ఆర్పీడబ్ల్యూడీ చట్టం చెప్తున్నది. నూతన విద్యా విధానం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది.
దివ్యాంగ విద్యార్థులు ఈ సౌలభ్యాలు లేకపోవడం కారణంగా చదువుల్లో రాణించలేకపోతున్నారు. కొన్ని సందర్భాలలో వారికి చదువు కొనసాగించడమూ ఇబ్బందిగా మారుతున్నది. అందరికీ విద్య అందించే సామాజిక బాధ్యతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ మినహాయింపులు, సౌలభ్యాలు దివ్యాంగ విద్యార్థులకు మరింత మేలు చేకూరుస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కు ప్రత్యేక సౌలభ్యాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గత సోమవారం జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్న దివ్యాంగ బాలలకు వర్తిస్తుంది. వీటిలో పరీక్ష రాసేందుకు అదనపు సమయం ఇవ్వడం, స్ర్కైబ్ సౌకర్యం కల్పించడం, కొన్ని భాషా పేపర్లు రాయడం నుంచి మినహాయింపు, కనీస మార్కు ల్లో మినహాయింపు మొదలైనవి ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ సౌలభ్యాలు అమలుకానున్నాయి.
సెరిబ్రల్ పాల్సీ, మరుగుజ్జుతనం, కుష్టువ్యాధి, మస్క్యులర్ డిస్ట్రొఫీలతో బాధపడుతున్నవారితో పాటు యాసిడ్ దాడి బాధితులు ఆరు నుంచి పదో తరగతి వరకు అన్ని పరీక్షల్లో కనీస మార్కులు 35 బదులుగా 20 సాధిస్తే ఉత్తీర్ణత పొందుతారు. వీరు గణన యంత్రాలను ఉపయోగించవచ్చు. మూడు భాషా పేపర్లలో ఏదైనా ఒక భాషా పేపర్ రాయడం నుంచి మినహాయింపు పొందవచ్చు. అవసరమైతే ప్రత్యేక అనుమతితో వీరు దవాఖానలోనూ పరీక్ష రాయవచ్చు. పరీక్ష రాసే సమయంలో ఆరోగ్య సహాయకుడి సేవలనూ పొందవచ్చు. కాళ్లు, చేతు లు, వెన్నెముక మొదలైన అంగాల్లో ఇబ్బందులున్న దివ్యాంగులకు తప్పనిసరిగా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పరీక్ష రాసే ఏర్పాట్లు చేస్తారు.
శ్రవణ దోషాలుండే విద్యార్థులు కూడా 35కి బదులుగా 20 మార్కులు పొందితే ఉత్తీర్ణులైనట్టే. వ్యాకరణ దోషాల నుంచి మినహాయింపు ఉంటుం ది. వీరికి రెండు భాషా పేపర్ల నుంచి మినహాయింపు ఉంటుంది. సంజ్ఞాత్మక భాష తెలిసిన వ్యక్తి సహాయాన్ని పరీక్ష హాలులో పొందవచ్చు. వినికిడి పరికరాలను ఉపయోగించవచ్చు. వివరణాత్మక ప్రశ్నలకు సమాధానాన్ని వీరు కుదించి రాయవచ్చు. మౌఖిక పరీక్షల్లో కూడా జవాబులు రాసేందుకు వీరిని అనుమతిస్తారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయు లే వీరి జవాబు పత్రాలను దిద్దవలసి ఉంటుంది.
మూగ విద్యార్థులు కూడా 20 మార్కులు పొందితే చాలు. ఒక భాష పరీక్ష నుంచి, ఇతర పరీక్షల్లో వ్యాకరణ దోషాల నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు సహాయక పరికరాలు ఉపయోగించవచ్చు. ప్రత్యేక అభ్యసన లోపాలుండే పిల్లలకు ఒక భాష పరీక్ష నుంచి, వ్యాకరణ దోషాల నుంచి మినహాయింపు ఉంటుం ది. కనీస మార్కులు 20 పొందితే చాలు. వీరి అవసరం మేరకు సహాయక పరికరాలను ఉపయోగించవచ్చు. మానసిక అస్వస్థత తో ఉన్న పిల్లలు, ఆటిజం పిల్లలు, ఇంటలెక్చువల్ డిజెబిలిటీ ఉన్న పిల్లలు కనీస మార్కులు 10 సాధి స్తే చాలు. ఒక భాష పరీక్ష నుంచి, వ్యాకరణ దోషాల నుంచి, రేఖాచిత్రాల నుంచి, మ్యాప్‌ల నుంచి మినహాయింపు ఉంటుంది. అవసరం మేరకు సహాయక పరికరాలను ఉపయోగించవచ్చు. అదనంగా ఆటిజం పిల్లలకు దళసరి జవాబు పత్రాలను ఇస్తారు. ఇంటలెక్చువల్ డిజెబిలిటీ ఉన్న పిల్లలకు వివరణాత్మక ప్రశ్నలకు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రశ్నలు ఇస్తారు.
రక్త సంబంధిత వ్యాధులైన హీమోఫీలియా, తలసీమియా, సికిల్ సెల్లతో బాధపడుతున్న విద్యార్థులకూ ప్రత్యేక సౌలభ్యాలు కల్పిస్తారు. వీరికి ఒక భాష పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వ్యాకరణ దోషాలను లెక్కించరు. సహాయక పరికరాలను ఉపయోగించవచ్చు. పరీక్ష జరిగే సమయంలో కూడా అవసరమైతే వైద్యసహాయం పొందవచ్చు. ఈ సౌలభ్యాలన్నీ న్యూరోలాజికల్ సమస్యలున్న పిల్లలకూ వర్తిస్తాయి. అయితే ఈ విద్యార్థులు కనీస మార్కులు 20 పొందితే చాలు. ఒకటి కంటే ఎక్కువ ఇబ్బందులున్న విద్యార్థులు వాటికి అనుగుణంగా సౌలభ్యాలు పొందవచ్చు.
దివ్యాంగ విద్యార్థులు వారి ఇబ్బందులకనుగుణంగా పొందే సౌలభ్యాలకు తోడు అదనపు సమయాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ అదనపు సమ యం ప్రతి గంట పరీక్షకు 20 నిముషాలు ఉం టుంది. స్ర్కైబ్ లేదా రీడర్ సేవలనూ పొందవచ్చు. స్ర్కైబ్ సేవలకు పారితోషికాన్ని అభ్యర్థి ఇవ్వవలసిన అవసరం లేదు. పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ పారితోషికాన్ని చెల్లిస్తారు. దివ్యాంగ విద్యార్థులకు వారు చదివిన పాఠశాలలోగానీ సమీప పాఠశాలలో గానీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. జంబ్లింగ్ పద్ధతి వీరికి వర్తించదు పరీక్ష హాలులో జవాబులు టైప్ చేసేందుకు గానీ ప్రశ్నలను చదివేందుకు గానీ కంప్యూటర్ కూడా వినియోగించుకోవచ్చు. ఆరు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల వరకు ఏ పరీక్షకూ రుసుమును దివ్యాంగ విద్యార్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ప్రత్యేక అవసరాలుండే దివ్యాంగ విద్యార్థులు ఈ సౌలభ్యాలు లేకపోవడం కారణంగా చదువుల్లో రాణించలేకపోతున్నారు. ఈ కారణంగా కొన్ని సందర్భాలలో చదువు కొనసాగించడమూ ఇబ్బందిగా మారుతున్న ది. అందరికీ విద్య అందించే సామాజిక బాధ్యతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ మినహాయింపులు, సౌలభ్యాలు దివ్యాంగ విద్యార్థులకు మరింత మేలు చేకూరుస్తాయనడంలో ఏ మా త్రం సందేహం లేదు.
-డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్‌రావు 94410 46839