ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ను గెలిపించి బీఆర్ఎస్కు పునాదులు వేసిన మునుగోడు ప్రజలు అభినందనీయులు. నియంతృత్వానికి, నియ్యతిగల్ల పాలనకు మధ్య జరిగిన పోరులో ప్రజలు నియ్యతికే పట్టం గట్టడం హర్షించదగిన విషయం. దీంతో రాష్ర్టాన్ని అవిచ్ఛిన్నం చేయజూసిన బీజేపీకి అపజయం ఎదురైంది. ఆ పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కుడితిలో పడ్డ ఎలుకల్లా విలవిల్లాడుతున్నారు.
మునుగోడు ఫలితం ద్వారా ‘సొంత లాభం కొంత మానుకో’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ప్రజలు హితవు పలికారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి, కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డికి ఓటమి రుచి ఎట్లుంటుందో చూపించి గుణపాఠం నేర్పించారు. యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృ ద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని నల్లగొండ జిల్లాకు ‘మిషన్ భగీరథ’ ద్వారా నల్లా నీళ్లిచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. దీనికి ప్రతిఫలంగా ప్రతిష్ఠాత్మక సమయంలో మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాసటగా నిలువడం ముదావహం.
బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం, ఆ ప్రభుత్వాలలోని ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర జూపడం, అయినా లొంగకుంటే సీబీఐ, ఈడీ దాడుల పేర బెదిరించడం కేంద్రంలోని బీజేపీ అవలంబించే విధానం. ఈ తరహాలోనే ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసి అధికారాన్ని చేజిక్కించుకున్నది బీజేపీ. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం. తాజాగా బీజేపీ కన్ను తెలంగాణపై పడింది. అందులో భాగంగానే రాజగోపాల్‌రెడ్డిని పావుగా వాడుకున్నది. మునుగోడు ఉప ఎన్నికను సృష్టించింది. ఈ ఎన్నిక సందర్భంగా కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకోవాలని యత్నించింది. ఒకవేళ బీజేపీ గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా రాజీనామాల పర్వం కొనగించాలని బీజేపీ కుటిల పన్నాగం. కానీ ఈ పాచికలు తెలంగాణలో పారవని తెలుసుకోలేకపోయింది బీజేపీ అధినాయకత్వం. ఫాంహౌజ్ సాక్షిగా ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించి విఫలమవ్వడమే దానికి తాజా ఉదాహరణ. తెలంగాణ అమ్ముడుపోయే గడ్డ కాదని బీజేపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.
గత ఎనిమిదేండ్లుగా దేశంలో బీజేపీ పాలన ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతున్నది. దీనంతటికి కారణం బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోవడమే. దేశాన్ని అంబానీ, అదానీలకు అమ్మజూస్తూ, ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేయబోతున్న బీజేపీ పట్ల ప్రజలు ఏవగింపుతో ఉన్నారు. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో తెలంగాణ తరహా అభివృద్ధిని కోరుకుంటున్నారు. దేశ ఆకాంక్షను గ్రహించిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. ఇది రుచించుకోలేని కేంద్రంలోని బీజేపీ నాయకులు కేసీఆర్‌పై కుట్రలు సాగించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అవిచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మునుగోడు ద్వారా ఆ అస్ర్తాన్ని ప్రదర్శింపజూసింది బీజేపీ. కానీ అంతిమ నిర్ణేతలు ప్రజలే కదా? పెద్ద నోట్ల రద్దు ద్వారా పడ్డ ఇబ్బందులు, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, జీఎస్టీ పెంపు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను గుర్తుతెచ్చుకున్నారు. తన ఓటు ద్వారా బీజేపీని తిరస్కరించారు. అంతిమంగా మునుగోడులో బీజేపీ ఓటమిపాలైంది. రాజగోపాల్‌రెడ్డి ఉన్న పదవిని కాస్తా ఊడబీక్కున్నాడు. మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెట్టింపు ధైర్యాన్నిచ్చింది. ఈ ధైర్యమే బీఆర్ఎస్కు పునాదిరాయి. ఇక దేశ రాజకీయాల్లో కేసీఆర్ మరో కలికితురాయి అనడంలో ఏ మాత్రం సందే హం లేదు. జై కేసీఆర్, జయ హో భారత్.
(వ్యాసకర్త: రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
-ఉప్పల శ్రీనివాస్ గుప్త