హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18(నమస్తే తెలంగాణ): స్వామివారికి సీట్ బెల్ట్ వేస్తారా? అసలు ఆలయ అర్చక సిబ్బంది ఎలా ఒప్పుకున్నారు. స్వామివారి చరమూర్తులను బయటి వ్యక్తులు ఎలా తీసుకెళ్తారు. విదేశీ కల్యాణాల్లో అసలేం జరుగుతున్నది? అంటూ అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ తతంగంపై దేవస్థాన సిబ్బందిపై దేవాదాయ శాఖ ముఖ్య అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా అక్కడే ఉన్న ఆ శాఖ ముఖ్య అధికారులు ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ప్రత్యేక కథనాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏం జరిగిందంటూ ఆరా తీశారు. యాదాద్రిలో విదేశీ కల్యాణాల పేరుతో చేస్తున్న వ్యవహారంపై ‘యాదగిరి నరసింహస్వామికి అపచారం’ అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ప్రత్యేక కథనం పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది.
ఆలయాధికారులతోపాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ కథనంపై చర్చించారు. మరోవైపు విదేశాల్లో స్వామివారి చరమూర్తుల విషయంలో కల్యాణాలు చేసిన ఆలయ అర్చక సిబ్బంది చేసిన అపచారంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కల్యాణాల నిర్వహణ, పర్యవేక్షణ అధికారులు తమ జేబులు నింపుకోవడానికి విదేశాల్లో జల్సాలు చేయడానికి ఈ కార్యక్రమాలు చేశారనే చర్చ జరుగుతున్నది. విదేశీ కల్యాణాలు, స్వామివారికి జరిగిన అపచారంపై దేవాదాయ శాఖ ప్రధానాధికారులు కూడా ఆరా తీశారు. గతంలో ఆలయంలో జరిగిన అనేక అక్రమాలపై తాము కోరిన నివేదికలపై ఎలాంటి స్పందన లేకపోవడానికి కారణమేమిటనే దిశగా ఆలయ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. సోమ, మంగళవారాల్లో యాదగిరిగుట్ట వ్యవహారంపై పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని దేవాదాయ ప్రధాన అధికారి ఆదేశించినట్టు తెలిసింది. ముఖ్యంగా విదేశీ కల్యాణాల వ్యవహారంపై కూడా భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
స్వామివారి దర్శనాల పేరుతో!
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనాల పేరుతో ఆలయంలో ప్రైవేటు వ్యక్తుల దందా కొనసాగుతున్నదని, వీరికి ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే అధికారి అండదండలు ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శని, ఆదివారాలు, పండుగ రోజులు, సెలవు దినాల్లో దర్శనాల పేరుతో వేల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆలయ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యాన్ని ప్రోత్సహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గుట్టపై అధికార పార్టీ నేతల జోక్యం పెరిగిందని విమర్శలొస్తున్నాయి.
కుంభకోణాల మయం
యాదాద్రి ఆలయంలో స్వామివారి సేవలు, టెండర్లు , ప్రసాదాల విషయంలో అధికారుల పర్యవేక్షణలోపం, నిర్వహణ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. నిరుడు ప్రసాదాల తయారీ కేంద్రంలో జరిగిన చింతపండు కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. చింతపండు చోరీ చేసిన వ్యక్తుల వెనుక ఓ అధికారి ప్రమేయం ఉన్నదని తెలిసినప్పటికీ ఆ కుంభకోణంపై వేసిన హైలెవల్ కమిటీని తప్పుదోవ పట్టించినట్టు ఇప్పటికీ యాదాద్రిలో చర్చించుకుంటారు. నిరుడు దేవుండ్ల వస్ర్తాలను సేకరించే టెండర్ పిలువగా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి చివరి నాటి వరకు గడువు విధిస్తూ కాంట్రాక్ట్ ఇచ్చారు. టెండర్ దక్కించుకున్న మూడు నెలలకే తనకు నష్టం వస్తుందంటూ ఆ వ్యాపారి దేవాదాయ శాఖకు విన్నవించుకోగా.. స్థానిక కాంగ్రెస్ నేత సిఫారసుతో ఆ టెండర్‌ను నిబంధనలకు విరుద్ధంగా మూడేండ్ల వరకు అంటే 2028 మార్చి వరకు వస్ర్తాలు సేకరించుకోవచ్చంటూ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి నివేదిక ఇవ్వాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను ఆదేశించగా, టెండర్ కొనసాగడంతోపాటు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. ఇందులోనూ అధికారుల ప్రమేయం ఉన్నదనే చర్చ జరుగుతున్నది.