అందుబాటులో ఉన్న వనరులను, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా తన ప్రతిభ కనబరుస్తూ ఎదగాల్సిన యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. ‘యువకుడి ఆత్మహత్య, యువతి ఆత్మహత్య’ అనే శీర్షికన తరచూ పత్రికల్లో వార్తలు కనపబడుతున్నాయి. కారణాలేవైనా ఇలాంటి విషాద వార్తలు చదువుతున్నప్పడల్లా గుండె తరుక్కుపోతున్నది.
ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయతీరాలకు చేరేవారు కొందరైతే.. పోటీ ప్రపంచాన్ని తట్టుకోలేక నిస్సహాయస్థితిలో మిగిలిపోయేవారు మరికొందరు. ‘బలమే జీవనం, బలహీనతే మరణం’ అన్నారు స్వామి వివేకానంద. కాలం విలువైంది, ఆ విలువను గుర్తించినప్పుడు నువ్వూ ఒక అబ్దుల్ కలాం, ఒక సుందర్ పిచాయ్ వలె ప్రపంచం గర్వించేస్థాయిలో నిలబడతావు. సచిన్ టెండూల్కర్, విశ్వనాథన్ ఆనంద్, విరాట్ కోహ్లీ, పీవీ సింధు ఇలాంటి చాలామంది ప్రతిభావంతులు ప్రపంచంలో తమకంటూ ఒక ఉన్నత స్థానాన్ని పొందినవారు ఒకప్పుడు మీ వలె అవకాశాల కోసం ఎదురుచూసినవారే. అవకాశాలు వచ్చాయి అందిపుచ్చుకున్నారు. ప్రపంచంలో తమకంటూ పేజీని సృష్టించుకున్నారు.
విద్య ఒక్కటే ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి మార్గం కాదు. ఉదాహరణకు తీసుకుంటే బెంజ్ కారులో తిరిగే ఒక వ్యక్తి విద్యార్హత గురించి సమాజం పట్టించుకోదు. అతను బెంజ్ కారులో తిరుగుతున్నాడా లేదా అన్నదే ఆలోచిస్తుంది. అందుకే రంగమేదైనా రాణించడమే యువత లక్ష్యంగా చేసుకోవాలి. విద్య అనేది జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఒక మార్గమే అని యువత గ్రహించాలి. దేశంలో ఏటా లక్షలాది మంది యువత పట్టభద్రులవుతున్నారు. కానీ ఎంతమంది తమ చదువుకు తగ్గ ఉద్యోగాలు చేస్తున్నారు? కేవలం ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. యువత ప్రైవేట్ ఉద్యోగం కోసమూ తపన పడవద్దు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పట్టు సాధిస్తే ప్రతి యువకుడు ఒక రతన్ టాటా వలె లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించినవాడవుతాడు.
ఈ మధ్యకాలంలో టీవీలలో, దిన పత్రికలలో తరచూ విద్యార్థుల ఆత్మహత్యల గురించి చూస్తున్నాం, చదువుతున్నాం. అసలు విద్యార్థులపై అంత ఒత్తిడి ఎందుకో తల్లిదండ్రులూ ఆలోచించుకోవాలి. తమ పిల్లల భవిష్యత్ కోసం లక్షలు పెట్టి అంతర్జాతీయ పాఠశాలల్లో, కళాశాల ల్లో చేర్పిస్తున్నారు. కానీ, అక్కడ ఉన్న విద్యాబోధన, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, నైతిక విలువలు ఏ విధంగా ఉంటున్నాయో తల్లిదండ్రులు గమనించటం లేదు. తమ విధుల్లో నిమగ్నమై పిల్లల దినసరి కార్యకలాపాల మీద కూడా దృష్టిసారించడం లేదు. ప్రతీరోజు పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే తద్వారా వారికి మానసిక ధైర్యాన్నిచ్చినవారవుతారు. విద్యాసంస్థలు కూడా పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. విద్యార్థుల నైపుణ్యాన్ని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలి.
తన జ్ఞానాన్ని ఇంకొకరి వృద్ధి కోసం కాకుం డా, తన కోసమే తన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మంచిది అనే విషయాన్ని యువత తెలుసుకోవాలి. అప్పుడే మరో బిల్గేట్స్, మార్క్ జుకెర్బర్గ్, టాటా, బిర్లా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దిగ్గజాల మధ్యలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నవారవుతారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ప్రయత్నించినట్లయితే సాధించలేనిదేమీ లేదనే విషయాన్ని తెలుసుకోవాలి. ‘శ్రమ నీ ఆయుధం అయితే విజ యం నీ బానిస అవుతుంది’ వివేకానందుడి సూక్తి నిరంతరం నీ ఆలోచనల రూపంలో మెదులుతూ ఉండాలి.
-శ్రీనివాస్ కాదాసు
91773 86586