యావత్ దేశం బీజేపీ కబంధ హస్తాల్లో బందీ అయింది. మతం మంటల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నది. ‘నేనే మోనార్క్ను, నేను చెప్పిందే వినాలి, నేను చేసిందే చూడాలి, నాకు ఎదురే లేదు’ అని ప్రధాని మోదీ విర్రవీగుతున్నారు. కానీ, తమను ఎదిరించే నాయకుడు ఒకరున్నారని, ఆయనే తెలంగాణ ఉద్యమ పోరాటయోధుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మోదీ తెలుసుకోలేకపోయారు. దేశంలో జరుగుతున్న బీజేపీ కుట్రలపై కేసీఆర్ రూపంలో ధర్మయుద్ధం మొదలైంది. ఆయన వెంట యావత్ దేశం నడవాల్సిన సమయం ఆసన్నమైంది.
కేసీఆర్ తెలంగాణ పోరాటయోధుడు, లక్ష్యసాధనలో చివరిదశ వరకు వెనకడుగు వేయని ధీరుడు. ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఢీకొట్టడం ఆయనకే సాధ్యం. ఆయన విడుదల చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వీడియో బీజేపీ గుండెల్లో గునపాలు గుచ్చుతున్నది.బీజేపీ నిజస్వరూపాన్ని దేశ ప్రజల ముందు కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు.
బీజేపీ పాలనలో సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలుగుతున్నది. రాష్ర్టాల్లోని ప్రజా ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసి మతాన్ని అందలమెక్కిస్తున్నది. ఆఖరికి శవ పేటికలపైనా జీఎస్టీ విధించి దేశ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నది. ఈ అన్యాయాలేమిటని ప్రశ్నిస్తే.. ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తున్నది. ఎందుకు ఈ వ్యవస్థల విధ్వంసం? భావితరాల వారికి బీజేపీ సందేశం ఏమిటి? మతం దేశం మంటల్లో బుగ్గిపాలు కావాల్సిందేనా?
అందుకే.. అన్యాయాలను ప్రశ్నించి దేశానికి సరికొత్త మార్గనిర్దేశనం చేసేందుకు తెలంగాణ బిడ్డ ముందుకు వచ్చారు. పోరాటానికి సిద్ధంగా ఉండండి! దేశంలో అవినీతి, అరాచకం ప్రబలుతున్నాయి. ధరలు పెరిగి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘దేశాన్ని కాపాడాలి’ అనే నినాదంతో ప్రజలంతా కలిసి ముందుకునడవాలి. దీనికి నాయకత్వం వహించగల నాయకుడు ఈ దేశంలో ఒకే ఒక్కరున్నారు. ఆయనే కేసీఆర్. నిన్న బీజేపీ అప్రజాస్వామిక విధానాల గురించి ఆయన వెలిబుచ్చిన ఆవేదన విని యావత్ జాతి తీవ్ర ఆవేదన చెందింది. ఆయన పిలుపునిచ్చినట్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే ఆ పార్టీ ముఠా నుంచి దేశాన్ని కాపాడాలి. దేశాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. సమాఖ్యస్ఫూర్తితో పరస్పరం సహకరించుకోవాలి. రాజ్యాంగస్ఫూర్తిని నిలుపుకోవాలి.
బీజేపీ అనైతిక రాజకీయ క్రీడల వల్ల భరతమాత శోకిస్తున్నది. న్యాయ దేవత ఘోషిస్తున్నది. ధర్మ దేవత తల్లడిల్లుతున్నది. ఈ పరిస్థితుల్లో జాతి మొత్తం ఒక్కటై దేశాన్ని రక్షించుకోవాలి. ఈ నేపథ్యంలో దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ చీకటి కోణాలను బట్టబయలు చేసి కేసీఆర్ దేశ ప్రజలను తట్టి లేపారు. ప్రజలంతా మేల్కోకపోతే బీజేపీ నాయకులు దేశాన్ని నడిబజారులో నిలబెడతారు. మతం ఉచ్చులో దేశాన్ని బంధిస్తారని హెచ్చరించారు. కేసీఆర్ సామాన్యుల కష్టాలు తెలిసిన నాయకుడు. దేశ ప్రజల బాగు కోసం తపిస్తున్నరు. ఆయనకు సహజవనరుల విలువ తెలుసు. దేశంలోని అణువణువూ తెలుసు. దేశం కోసం ఆయన పోరాడుతున్నారు. 29 రాష్ర్టాల హక్కుల కోసం పోరాడుతున్నారు. మేధావులు, జర్నలిస్టులు, అఖిల భారత సర్వీసుల సీనియర్ అధికారులతో చర్చించి దేశాభివృద్ధి కోసం ఆయన సరికొత్త ఎజెండా రూపొందించారు. దాన్ని అమలుచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కలలు గంటున్నారు. కేసీఆర్ ప్రశ్నిస్తున్నట్లు మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయింది. కానీ దేశాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నది. బీజేపీ, కా్రంగెస్లను నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే, తీరా అధికారంలోకి వచ్చాక వారు ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో గుక్కెడు నీళ్ల కోసం తండ్లాడే పరిస్థితులున్నాయి. ఇదేం భారతం? అయినా పాలకులకు సిగ్గు లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏవో ఒక జిమ్మిక్కులు చేసి అధికారంలోకి వస్తారు. ప్రజల ఆశలను అడియాసలు చేస్తారు. నేడు కుళ్లు రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో మన దేశం కుమిలిపోతున్నది. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం లేదా అని ప్రజలు ఆలోచించాలి. ఈ పరిస్థితికి కారణం ఎవరు, దీన్ని మార్చగలిగేవారు ఎవరని యోచించాలి. దేశంలో అణగారిన వర్గాలు, గిరిజనులు కూడా ధైర్యంగా బతికే పరిస్థితి రావాలని ఆశిద్దాం. దీనికోసం ధర్మయుద్ధం జరగాలి. ఇందులో మనమంతా కేసీఆర్ వెంట నడవాలి.
మోదీ నియంతృత్వ విధానాలను ఎండగడుతూ.. దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో కేసీఆర్ చెప్తున్నారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం ఆయన ధర్మయుద్ధం మొదలుపెట్టారు. ఈ యుద్ధానికి పిడికిలి బిగించి ఆయనకు మద్దతు తెలపడం మన కర్తవ్యం కావాలి. దక్షిణాదిన దరువేసిన కేసీఆర్ ఉత్తరాదిలో ఉత్తుంగ తరంగంలా వ్యాపిస్తారు. ఆయన ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది.
కేసీఆర్ అడుగేస్తే విజయం తథ్యం! కేసీఆర్ గర్జిస్తే ప్రత్యర్థుల కోటలు బద్దలవుతాయి. వ్యూహానికే నడక నేర్పిన వ్యూహకర్త కేసీఆర్. ఆయన మస్తిష్కంలో ఎన్నో యుద్ధవ్యూహాలు దాగి ఉంటాయి. ప్రత్యర్థులను నిద్రపోనివ్వరు. వాళ్లు ఎన్ని పద్మవ్యూహాలు రచించినా వాటిని ఛేదించే మేధో వ్యూహం ఆయన వద్ద ఉం టుంది. తెలంగాణ సంధించిన కేసీఆర్ అనే సిం హ బాణం దేశాన్ని పాలిస్తున్న దుర్మార్గ పాలనపై దండెత్తిన ఆయుధం. దేశానికి మంచి రోజులు తీసుకొచ్చేవరకు ఈ పోరు ఆగదు. బీఆర్ఎస్ అధినేత ముందుకు దూసుకువస్తున్నారు. ఆయనతో కలిసి ధర్మ యుద్ధం చేయడానికి భారతీయులంతా సిద్ధమవ్వాలి. జై తెలంగాణ.. జై భారత్!
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-చిటుకుల మైసారెడ్డి
94905 24724