కరోనా కారణంగా యావత్ ప్రపంచమే లాక్డౌన్ అయింది. అప్పటినుంచి పలు కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి Work From Home (ఇంటి నుంచి పని) అనే నూతన విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ కొత్త విధానం వల్ల సాంకేతికత పరిజ్ఞానం గల మానవ వనరులకు అసాధారణమైన డిమాండ్ పెరిగింది. ప్రపంచంలో దాదాపు ఐటీ కంపెనీలు అందుబాటులో ఉన్న మానవ వనరులను సాధ్యమైనంత మేర వినియోగించుకున్నాయి.
టెక్ దిగ్గజ కంపెనీలు మంచి సమయాల్లో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. ఈ అనిశ్చితి సమయంలో మూన్‌లైటింగ్‌ను ఉటంకిస్తూ ఉద్యోగులను తొలగిస్తూ, ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు ఇది దిద్దుబాటు సమయమని సంకేతాన్నిస్తున్నాయి.
ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు, ప్రతిభావంతులకు అవకాశాలు మెరుగయ్యాయి. ప్రత్యామ్నాయ సంపాదన అవకాశాలు ఎదురువచ్చాయి. దీంతో ఐటీ ఉద్యోగులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేందుకు అందివచ్చిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకున్నారు. షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారి సంఖ్య ఎన్నడూ లేనివిధంగా కరోనా కాలంలో రెట్టింపవడం, డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఊహించని విధంగా పెరగడమే దానికి ఉదాహరణలు.
ఐటీ ఉద్యోగులు తమ రోజువారీ ఉద్యోగ కార్యకలాపాలు కొనసాగిస్తూనే బహుళ ఉద్యోగాలు చేసే వాతావరణాన్ని కరోనా కల్పించింది. ఆ ఆదాయాన్ని ఉద్యోగులు తమ ఆర్థిక సవాళ్లను అధిగమించడం కోసం ఉపయోగించుకున్నారు. కరోనా కాలంలో సాంకేతిక పరిశ్రమలు మూన్‌లైటింగ్ (ఒక మనిషి పలు ఉద్యోగాలు చేయడం) విధానాన్ని ప్రోత్సహించాయి. ఉద్యోగులకు రెట్టింపు జీతభత్యాలను ఇచ్చి వ్యాపార కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేలా చూసుకున్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తమ వ్యాపార సంస్థలను సక్రమంగా నడిపేందుకు ‘మూన్‌లైటింగ్’ విధానాన్ని చూసీచూడనట్టుగా వ్యవహరించాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇద్దరు లేదా ముగ్గురు కలిసి చిన్న చిన్న స్టార్టప్‌లను కూడా ప్రారంభించారు.
కరోనా కాలంలో ఐటీ పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉద్యోగ నియామకాలను చేపట్టాయి. కొత్త ఉద్యోగులను నియామకం చేసుకుంటూ తక్కువ వేతనాలను అందించాయి. టైర్ టూ, టైర్ త్రీ నగరాల్లో కూడా నియామకాలు పెద్ద ఎత్తున జరగడం విశేషం. ఇంజినీరింగ్ విద్య చదువుతున్న రెండు, మూడో సంవత్సరం విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు ఈ తరహా నియామకాల మూలంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుకొని, తద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి.
గ్లోబల్ కంపెనీలు 2021వ సంవత్సరానికి ‘గ్రేట్ రెసిగ్నషన్’ అని నామకరణం చేశాయి. ఇంటి నుంచి పని మూలంగా ఉద్యోగుల ఒత్తిడి, పొడిగించిన పనిగంటలు, తక్కువ ప్రోత్సాహకాలు, వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా చాలామంది ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేశారు. కానీ డిజిటల్ ప్రపంచం ‘మూన్ లైటింగ్’ అవకాశాలు ఇస్తూనే తమ కంపెనీలు కొనసాగేలా చూశాయి. కరోనా విషయం ఇలా ఉంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీసింది. పర్యవసానంగా స్టార్టప్ సంస్థలకు డబ్బు సరఫరా ను ప్రభావితం చేసింది. ఈ యుద్ధం స్టార్టప్ ఫండింగ్‌నూ ప్రభావితం చేసి నేడు పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు దారి తీస్తున్నది. వేతన భత్యాలలో పెంపుదలను ఆశించకుండా తమ ఉత్పాదకతపై ఉద్యోగులు దృష్టిసారించాలని టెక్ దిగ్గజ కంపెనీలు స్పష్టమైన సందేశాన్ని ఈ-మెయిల్స్ ద్వారా అందజేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం కారణంగా కంపెనీలు త్వరలో పెద్దమొత్తంలో తమ సాంకేతిక బడ్జెట్లను తగ్గించే అవకాశం ఉన్నది. టెక్ దిగ్గజ కంపెనీలు మంచి సమయాల్లో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. ఈ అనిశ్చితి సమయంలో మూన్‌లైటింగ్‌ను ఉటంకిస్తూ ఉద్యోగులను తొలగిస్తూ, ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. ఆర్థికమాంద్యం నుంచి బయటపడేందుకు ఇది దిద్దుబాటు సమయమని సంకేతాన్నిస్తున్నాయి. ఈ తరహా దిద్దుబాటు చర్యలతో ‘మూన్‌లైటింగ్’ అనే సాకును ఉద్యోగులపై రుద్దుతుండటం విషాదం. కరోనా కారణంగా అనేకమంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పో యి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నారు. కరోనా కాలంలో ఐటీ కంపెనీలను కాపాడిన సాంకేతిక ఉద్యోగులు ఇప్పుడు ‘మూన్‌లైటింగ్’ కారణంగా ఉద్యోగాలు కోల్పోతుండటం బాధాకరం. ఇప్పటికైనా ఐటీ పరిశ్రమలు పునరాలోచించుకొని ఉద్యోగులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
-డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ గౌడ్
81870 56918