నాడు హరిత విప్లవం సాధించిన భారతదేశం నేడు అప్పుల భారతంగా మారింది. నిమిషానికో రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. వాతావరణ మార్పులు, సాగు నష్టాలు, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతో రైతులు కాడి వదిలేస్తున్నారు. ఉపాధి వెతుక్కుంటూ నగరాలకు వలసలు పోతున్నారు. దేశం ఆహార సంక్షోభంలోకి కూరుకుపోకుండా ఉండాలంటే కేంద్రం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.
రైతులు ఆహారధాన్యాలు పండిస్తేనే దేశం నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్తాయి. మన దేశంలోని మొత్తం వ్యవసాయదారుల్లో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. వారు అభివృద్ధి చెందకుండా వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధి అసాధ్యం. భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి, జీడీపీ పెంచడానికి వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాల వల్ల మన దేశం ఎగుమతులను ఎక్కువగా చేయలేకపోతున్నది. కానీ దిగుమతులు మాత్రం ఎక్కువగా చేసుకుంటున్నది. ప్రపంచీకరణ వల్ల గ్రామీణ ఆర్థికవ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం పట్ల, వ్యవసాయరంగ అభివృద్ధి పట్ల శ్రద్ధ వహించడం లేదు. ఈ కారణాలన్నీ వ్యవసాయరంగ అభివృద్ధికి అవరోధాలుగా మారాయి. రైతులు ఆరు గాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్సీఓలు) నెలకొల్పాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సంస్థల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వాటికోసం ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. అయితే ఈ సంస్థల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో కేంద్రం విఫలమైంది. దేశీయంగా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూడా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా రైతు వ్యతిరేక చట్టాలను అమలుచేయాలని ప్రయత్నించి వెనకడుగు వేసింది.
రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కేంద్ర ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందించాలి. వయసు మీరిన రైతులకు పింఛను అందజేయాలి. రైతు నాయకులు ఎన్నికల్లో పోటీచేసి పాలకులుగా మారితే రైతుల సమస్యలపై వారే చట్టాలు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా రైతుల కష్టాలు తీరుతాయి. కేంద్రం అమలుచేస్తున్న కిసాన్ యోజన తప్ప మిగతా పథకాలేవీ రైతులకు పెద్దగా ఉపయోగ పడటం లేదు. రైతులకు వ్యవసాయ రుణాలే పెద్ద సమస్య కాబట్టి వాటిని రద్దు చేయడానికి బృహత్తర ప్రణాళికను అమలుచేయాలి. వ్యవసాయ పనిముట్ల కొనుగోలుపై రాయితీ ఇచ్చి జీఎస్టీ తొలగించాలి. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పంటలకు, ఒకే రకమైన మద్దతు ధర నిర్ణయించాలి. పంట సాగుకు అయిన పెట్టుబడి ఖర్చులు పోను రైతులకు లాభం కలిగేలా కనీస మద్దతు ధరలు నిర్ణయించాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట బీమాను వెంటనే అమలుచేయాలి. ఈ పథకం గత ఎనిమిదేండ్లుగా అమలుకాకపోవడం శోచనీయం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువగా ఉంది. దీనివల్ల పంట దిగుబడులు తగ్గుతున్నాయి. సాగుకు తెచ్చిన అప్పులు తీర్చలేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఒక సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో రైతులకు ప్రభుత్వమే విరివిగా రుణాలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం దేశంలోని వ్యవసాయ భూములన్నీ పరీక్షించాలి. తద్వారా అధిక దిగుబడులకు అనుకూలమైన సాగు విధానాన్ని ప్రోత్సహించాలి.
(వ్యాసకర్త: పౌర సంబంధాల అధికారి, కాకతీయ యూనివర్సిటీ)
-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి
98495 77610