PMC election : మహారాష్ట్ర (Maharastra) స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) లో కొన్ని స్థానాల ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. పుణె మున్సిపల్ కార్పొరేషన్లో స్థానిక గ్యాంగ్‌స్టర్ అయిన బందు అందేకర్ (Bandu Andhekar) బంధువులు అయిన సోనాలి (Sonali), లక్ష్మి (Laxmi) విజయం సాధించారు. వరుసకు అత్తాకోడళ్లు అయిన వీరిద్దరూ ప్రస్తుతం ఆ గ్యాంగ్‌స్టర్ మనవడి హత్య కేసులో జైల్లో ఉన్నారు.
పుణె మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ వర్గం ఆ ఇద్దరు అత్తాకోడళ్లకు రెండు డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీచేసేందుకు టికెట్లు ఇచ్చింది. నేరారోపణలు ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీకి నిలబెట్టడంతో అజిత్‌పై మిత్రపక్షం బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. అయితే శుక్రవారం వెలువడిన ఆ ఎన్నికల ఫలితాల్లో ఆ ఇద్దరూ భారీ మెజార్టీతో విజయం సాధించారు.
జైల్లో నుంచే వాళ్లు ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారు. కుటుంబసభ్యులు వారి తరఫున ప్రచారం చేశారు. ఆ ఇద్దరు అత్తాకోడళ్లలో సోనాలి.. గ్యాంగ్‌స్టర్ బందు అందేకర్కు కోడలు అవుతుంది. లక్ష్మి అతడికి మరదలు అవుతుంది. బందు అందేకర్ కుమారుడు, మాజీ కార్పొరేటర్ వనరాజ్ 2024 సెప్టెంబర్‌లో హత్యకు గురయ్యారు.
ఆస్తి తగాదాల కారణంగా బందు అందేకర్ అల్లుడు గణేశ్ కోమ్కర్ ఈ హత్యకు పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన తర్వాత సరిగ్గా ఏడాదికి గణేశ్ 19 ఏళ్ల కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సోనాలి, లక్ష్మి సహా 16 మందిని అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో జైల్లో ఉన్నారు.