‘బీటలు వారిన నా నేల తల్లి తెలంగాణ’.. ‘వలసల గడ్డ నా తెలంగాణ’ అంటూ ఉమ్మడి వలస పాలనలో ప్రజా కవులు పాటలు రాశారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఈ దుస్థితిని పారదోలేందుకు తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమ నాయకుడే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలకుడైతే రాష్ట్రం ఎంత సుభిక్షంగా వర్ధిల్లుతున్నదనే దానికి ప్రస్తుతం రాష్ట్రంలో రైతాంగం పొందుతున్న వసతులు, ఆర్థిక భరోసానే నిలువెత్తు నిదర్శనం.
ఇటీవల బీజేపీ అన్ని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నించింది. అందుకోసం విపక్షాల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రూ.12,515 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. 8 ఏండ్లలో 8 రాష్ర్టాల్లో దొడ్డిదారిన అధికారం చేపట్టిన బీజేపీ తెలంగాణలో కూడా దొంగ వ్యవహారం నడిపి అడ్డంగా దొరికిపోయింది. బీజేపీ దొంగ బుద్ధిని యావత్ దేశానికి చాటిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఉద్యమ రథసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ‘ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం’ బాగుపడదని తెలుసు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా పాలన చేపట్టిన తొలి దఫాలోనే కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా నిర్మించారు. రైతులకు ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అందుకే నాడు బీడుగా ఉన్న భూముల్లో.. బీటలు వారిన నేలల్లో నేడు పంటలు పెద్ద ఎత్తున పండుతున్నాయి. ఒక ప్రజాస్వామ్య దేశంలో 70 ఏండ్ల స్వాతంత్య్ర పాలనలో ఏ ప్రభుత్వమూ, ఏ పాలకుడూ చేయని కార్యక్రమాలు, ఏ నాయకుడూ ప్రవేశపెట్టని పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. కేవలం ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని యావత్ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు.
నేడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఒక సామాన్యుడిగా, ఒక ప్రజాస్వామిక వాదిగా స్పందించకుండా ఉండలేకపోతున్నాను. మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న బీజేపీ ఆగడాలను ఎత్తిచూపకుండా ఉండలేను. ఈ నేపథ్యంలో మా తెలంగాణ లోక్సత్తా పార్టీ టీఆర్ఎస్కు మద్దతునిస్తున్నట్లుగా ప్రకటిస్తున్నాం. మా పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులు కారు గుర్తుకు ఓటేయాలని నిర్ణయించాం. కమలం పార్టీని నిలువరించడం కేవలం మునుగోడుకు సంబంధించిన విషయమే కాదు, యావత్ తెలంగాణకు, దేశానికి సంబంధించిన అంశం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.
ప్రపంచంలోని ప్రతి అంశంపైనా ముఖ్యమంత్రి కేసీఆర్కు అసామాన్య అవగాహన ఉండటమే ప్రస్తుత రాష్ట్ర ప్రగతికి ప్రధాన కారణం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెడుతున్న ఆర్థిక దిగ్బంధనాలను తట్టుకొని రైతులకు సకాలంలో రైతుబంధును రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. రైతుబంధు పట్ల రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. పెట్టుబడి కోసం రైతులు ఎవరి దగ్గరా చేయి చాపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నది. ప్రజల కోసం చేయాల్సిన పనులపై విమర్శలు చేయడం ఎంత అనివార్యమో… చేసినవి చెప్పడమూ అంతే అనివార్యం. అందుకే రాష్ట్రంలోని రైతులు ఆనందంగా ఉన్నారని నా దగ్గరికి వచ్చిన విషయాన్ని ఈ వ్యాసం ద్వారా చెప్తున్నా. గత ప్రభుత్వాల పాలనలో రైతులు ఏనాడూ ఇంత సంతోషంగా లేరనేది వాస్తవం.
తెలంగాణ ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ద్వారా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. అనతికాలంలోనే తెలంగాణ ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ (ధాన్యాగార రాష్ట్రం)గా మారి ఇతర రాష్ర్టాలను పక్కకు నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. కానీ, భారత రాజ్యాంగ సూత్రాల ప్రకారం కొనాల్సిన ధాన్యాన్ని కూడా సేకరించని దుస్థితిలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అయినా వీటన్నింటిని ఎదుర్కొని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతకు దన్నుగా వరుసగా తొమ్మిదోసారి రైతుబంధు సాయాన్ని అందించడం అనన్య సామాన్యం. ఇలా రైతుల పెట్టుబడులకు ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వమే ఆర్థికసాయం అందిస్తూ సాగుకు భరోసా కల్పించడం ప్రపంచంలో ఎక్కడా లేదు.
అన్నదాతలకు లోటు రానివ్వొద్దనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పానికి యావత్ రైతు సమాజం జేజేలు పలుకుతున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కొన్నిరంగాల్లో కొద్దిమేర అభివృద్ధి జరిగింది. కానీ, సంక్షేమం మాత్రం పూర్తిగా చచ్చుబడిపోయింది. దేశంలో పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే నిజంగా తలచుకుంటేనే గుండె తరుక్కుపోతున్నది. ఏండ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు చేసిన ప్రగతి చాలా తక్కువ. దానికి ఆ పార్టీల పరిణతి లేని తీరే కారణం. ఇటీవల బీజేపీ అన్ని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నించింది. అందుకోసం విపక్షాల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కమలం పార్టీ రూ.12,515 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఎనిమిదేండ్లలో ఎనిమిది రాష్ర్టాల్లో దొడ్డిదారిన అధికారం చేపట్టిన బీజేపీ తెలంగాణలో కూడా అదేవిధంగా దొంగ వ్యవహారం నడిపి అడ్డంగా దొరికిపోయింది. బీజేపీ దొంగ బుద్ధిని యావత్ దేశానికి చాటిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడు పోకుండా ఉన్నట్టు దేశవ్యాప్తంగా బీజేపీకి అమ్ముడుపోయిన 71 మంది ఎమ్మెల్యేలు నిజాయితీగా ఉండి ఉంటే నిజంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేది. ప్రజలతో మమేకమై గెలువకుండా ఇలా దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. బీజేపీ మూల సిద్ధాంతానికి ప్రస్తుత నాయకులు చేపడుతున్న చర్యలు వ్యతిరేకమైనవి. ఇటువంటి పార్టీని మునుగోడులో కాదు, ఎక్కడ గెలిపించినా యావత్ దేశానికే అరిష్టం. అందుకే ప్రజాస్వామ్య, ప్రగతిశీలవాదులు జాగరూకతతో వ్యవహరించాలి. గత ఎనిమిదేండ్లుగా దేశంలో సాగుతున్న బీజేపీ ఆగడాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలి. అందుకు తెలంగాణ లోక్సత్తా పార్టీ ప్రత్యేక చేయూతనందిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా.
(వ్యాసకర్త: తెలంగాణ లోక్సత్తా పార్టీరాష్ట్ర అధ్యక్షులు)
-మన్నారం నాగరాజు
95508 44433