Instagram : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు, రీల్స్ క్రియేటర్లకు గుడ్ న్యూస్. కంటెంట్ ఏ భాషలో ఉన్నా ఇకపై మరో ఐదు భారతీయ భాషల్లో డబ్ చేసుకునే వీలుంటుంది. ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటా ఈ మేరకు ఒక ఏఐ టూల్ ను డెవలప్ చేసింది. ముంబైలో జరిగిన హౌజ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఈవెంట్లో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్ భారతీయ క్రియేటర్లకు, యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ ఫీచర్ గత ఏడాది నవంబర్లో ప్రకటించగా, ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇకపై కంటెంట్ ను ఏ భాష నుంచైనా తెలుగుతోపాటు తమిళం, బెంగాలీ, కన్నడ, మరాఠి భాషల్లోకి డబ్ చేసుకోవచ్చు. ఇప్పటికే హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మరికొద్ది రోజుల్లో ఇన్స్టాగ్రామ్ తోపాటు ఫేస్ బుక్ లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ డబ్బింగ్ లిప్ సింక్ కు అనుగుణంగా కూడా ఉండనుంది. డబ్బింగ్ భాషల్లో కూడా చాలా స్పష్టమైన ఉచ్ఛారణతో, కచ్చితత్వంతో రీల్స్ చూడొచ్చు. వాయిస్ డబ్బింగ్ మాత్రమే కాకుండా.. ఫాంట్స్ కూడా వేరే భాషలోకి మార్చుకోవచ్చు.
రీల్స్ పై వచ్చే ఫాంట్స్ ను హిందీ, మరాఠి, బెంగాలి, అస్సామీ భాషల్లోకి మార్చుకోవచ్చు. ఇందుకోసం ఎడిట్స్ లో అప్డేట్ చేసుకోవాలి. అయితే, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని మెటా తెలిపింది. ఇప్పటికే మెటా సంస్థ ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫొటో, వీడియోల రీ స్టైల్, బల్క్ క్యాప్షన్ ఎడిటింగ్, వీడియో రివర్సింగ్ టూల్స్, 400 న్యూ సౌండ్ ఎఫెక్ట్స్ ను తీసుకొచ్చింది.