పెద్దలు చెప్పినట్లు, అనుభవం తెలిపినట్లు మనిషి విషయంలో అతికష్టమైనది మనసును నియంత్రించడం. మనసు సహజంగానే చంచలమైనది. అది బహుముఖీనమైన చైతన్య ప్రసరణ. జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను గ్రహించడం, జ్ఞాపకాలు, ఆలోచించడం, తెలివితేటలు, ఉద్వేగాలు, సృజన వీటన్నిటికీ మనసే కేంద్రం. వీటిలో ఉద్వేగాలు మనిషి అనుభూతిని, ఆవేశాన్ని బలంగా ప్రభావితం చేస్తూ ప్రవర్తనను నియంత్రిస్తుంటాయి. అన్ని విషయాల్లోనూ మనిషిలో వైవిధ్యం ఉన్నవిధంగానే ఉద్వేగాల సమ్మేళనం కూడా వ్యక్తి వ్యక్తికీ ఒక్కోవిధంగా ఉంటుంది. ఉద్వేగాల గుణం, దిశ, తీవ్రత చాలావరకు పుట్టుకతోనూ సంప్రాప్తించవచ్చు. అయితే తగిన సంకల్పబలం, గురు శుశ్రూష, పదునైన వివేచన, విశుద్ధ ఆచరణతో ఉద్వేగాలను సంస్కరించుకోవచ్చు. జీవితంలో గుణాత్మక వికాసాన్ని సాధించవచ్చు.
ఏ సాధనలో అయినా రెండు ముఖ్యమైన అంశాలు ఉండాలి. మొదటిది అచంచలమైన లక్ష్యం. రెండోది నిరంతర ప్రయత్నం. ఈ నిరంతరత మళ్లీ రెండు విధాలు. ఒకటి శ్వాసలా ఎప్పుడూ సాగేది, రెండు నియమిత దేహకాల బద్ధంగా సాగేది. ఇటువంటి సాధనే మనకు నిర్ణీత లక్ష్యాన్ని ప్రాప్తింపజేస్తుంది. అయితే సాధనలో నిరంతరత అనుకున్నంత సులభంగా పట్టుబడదు. అందుకు కారణం మధ్యమధ్యలో అనేకమైన బాహ్య, ఆంతరంగిక విక్షేపణలు, అడ్డంకులు రావడమే. అయితే, ఈ అడ్డంకులను కొంత ముందుచూపు వల్ల, పట్టుదలతో తగురీతిలో అధిగమించి ప్రయత్నాన్ని ఫలవంతంగా కొనసాగించగలుగుతాం.
ఉద్వేగాలను నియంత్రించే సాధనలో రెండు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మొదటిది మనసును ఇబ్బందిపెట్టే విషయాల నుంచి సున్నితమైన నిరాకరణతో దూరంగా ఉండగలగాలి. రెండోది మనం ఎవరికి ఏ సాయం చేసినా… వారినుంచి లబ్ధిని, ప్రశంసను ఆశించకుండా ఉండగలగాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ, నియమిత ఆహార విహారాలతో, పూర్తి ధర్మ నిర్వహణతో, నిండు కృతజ్ఞతతో జీవించాలి. అలాగే సత్సంగం, సత్ గ్రంథ పఠనం, ఆరాధన, ధ్యానం, దానం చేస్తూ ముందుకుసాగితే ఉద్వేగాలు క్రమంగా మన వశంలోకి వస్తాయి. ఆలోచనలో స్పష్టత, స్పందించడంలో పరిణతి పెరుగుతుంది. ప్రేమ, శాంతం చోటుచేసుకుంటాయి. అప్పుడు మన జీవనవిధానమే పరమ విశిష్టమైన ఆధ్యాత్మిక సాధనగా వెలుగొందుతుంది.
– యముగంటి ప్రభాకర్, 94401 52258