చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ హైడ్రామా చోటుచేసుకున్నది. అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi) వాకౌట్ చేశారు. తాను నిరుత్సాహానికి గురయ్యానని, జాతీయ గీతానికి సరైన గౌరవం దక్కలేదని గవర్నర్ రవి పేర్కొన్నారు. అసెంబ్లీలో కేవలం ప్రసంగం చేసి వెళ్లాలని గవర్నర్‌ను స్పీకర్ ఎం అప్పవు కోరినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ నియమావళిని పాటించాలని గవర్నర్‌ను స్పీకర్ కోరారు. అయితే తన ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరమని గవర్నర్ రవి పేర్కొన్నారు. తన బాధ్యతలు తనకు తెలుసు అని ఆయన అన్నారు.
జాతీయ గీతానికి సరైన గౌరవం దక్కాలని గవర్నర్ రవి తెలిపారు. అయితే హౌజ్‌లో కేవలం ఎమ్మెల్యేలు మాత్రం తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని, మరెవరికీ ఆ అవకాశం లేదని స్పీకర్ అప్పవు పేర్కొన్నారు. నా మైక్‌ను స్విచాఫ్ చేశారని, నన్ను అవమానించారని గవర్నర్ రవి తెలిపారు. తనను మాట్లాడనివ్వలేదన్నారు. తన ప్రసంగాన్ని పూర్తిగా చదవలేకపోయానని, దాంట్లో అన్నీ తప్పులే ఉన్నట్లు గవర్నర్ చెప్పారు.
గవర్నర్ మైక్‌ను పదేపదే ఆఫ్ చేశారని, ఆయన్ను మాట్లాడనివ్వలేదని లోక్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగంలో చాలా తప్పులు ఉన్నాయని, సంబంధం లేదని స్టేట్మెంట్లు ఉన్నాయని లోక్‌భవన్ పేర్కొన్నది. 12 లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించినట్లు చెప్పిన విషయంలో వాస్తవం లేదని లోక్‌భవన్ తెలిపింది. దళితులపై ఆగడాలు పెరిగాయని, దళిత మహిళ పట్ల లైంగిక వేధింపు ఘటనలు పెరిగాయని, కానీ వాటిని ప్రస్తావించలేదని లోక్ భవన్ తెలిపింది. మరోసారి జాతీయ గీతాన్ని అవమానించారని, ప్రాథమిక రాజ్యాంగ విధులను విస్మరించారని లోక్‌భవన్ చెప్పింది.