మరో వారంలో మునుగోడు ఉప ఎన్నిక జరగబోతుండగా ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్నే కూల్చేసే దురాగతానికి తెర లేపింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ఏకంగా పీఠాధిపతులను, మఠాధిపతులను పావులుగా ఉపయోగించుకుని కమలనాథులు ఆడిన అనైతిక రాజకీయ చదరంగం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాని కేసీఆర్ సమయస్ఫూర్తితో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిజాయితీతో తెలంగాణలో ప్రజాస్వామ్యం వర్థిల్లింది.
తెలంగాణ ఏర్పడి కేవలం 8 ఏండ్లు అయ్యింది. రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నది. ఆ రాష్ర్టానికి ఏలిక కేసీఆర్. తెలంగాణ జాతికి ఆత్మ గౌరవ ప్రతీకగా, జాతి పితగా మన్ననలందుకుంటున్న మహా నేత ఆయన. జనం గుండెల్లో కొలువైన దార్శనిక నాయకుడు. అరవై ఏండ్ల సమైక్య పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన వీరుడు. కన్నబిడ్డను ఎలా సాకుతామో అంత కన్నా మిన్నగా తెలంగాణను అబ్బురంగా, అపురూపంగా సాకుతూ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన నేత. అభివృద్ధి, సంక్షేమం అనే జోడు గుర్రాలను పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వ రథ సారథి. అలాంటి పాలకుడి సంరక్షణలో ఉన్న తెలంగాణ గడ్డ మీద బీజేపీ రాబందుల కన్ను పడింది. ఎలాగైనా తెలంగాణను కైవసం చేసుకోవాలని పథకాలు రచిస్తున్నది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాభిమానాన్ని సంపాదించి అధికారం చేపట్టవచ్చు. కాని అది ఎలా జరగాలి? రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ఎన్నికల్లో మెజార్టీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవాలి. అంతే తప్ప, అడ్డ దారుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడ గొట్టాలనే కుట్రలు హేయం, అప్రజాస్వామికం.
ఏనాడైతే కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో వస్తున్నానని ప్రకటించారో, ఆనాటి నుంచే బీజేపీ అగ్ర నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల గేట్లు ఎత్తి, విపక్షం(టీఆర్ఎస్) పాలిస్తున్న తెలంగాణకు నయా పైసా కూడా ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న బీజేపీ ఎలాగైనా కేసీఆర్‌ను గద్దె దించడానికి కుయుక్తులు పన్నడం మొదలు పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ఏవేవో కుంభకోణాలు జరుగుతున్నాయని నిందలు మోపింది. సీబీఐ, ఈడీ విరుచుకు పడతాయని బెదిరించింది. జైలుకు పంపుతామని హెచ్చరించింది. కాని ఆ పార్టీ బెదిరింపులకు కేసీఆర్ కాలి వెంట్రుక కూడా కదల్లేదు. లక్ష పిల్లులు గొంతులు చించుకుని అరిస్తే బెబ్బులి భయపడుతుందా?
మునుగోడు ఉప ఎన్నికలో విజయం పట్ల బీజేపీలో రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎన్ని సర్వేలు చేసినా కారు జోరును ఆపడం ఎవరి తరమూ కాదని తేలిపోయింది. ఇంటికి తులం బంగారం ఇస్తామని, ఓటుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని బీజేపీ చెబుతోందని, వాటిని ఓటర్లెవరూ నమ్మడం లేదని వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని తరిమేసి రక్షిత మంచి నీటిని అందిస్తున్న కేసీఆర్ లాంటి భగీరథుడిని వదులుకోబోమని మునుగోడు ఓటర్లు బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ముఖానే చెప్పేస్తున్నారు. దీంతో బీజేపీ నాయకత్వం గంగ వెర్రులెత్తిపోతున్నది. మునుగోడు ఎన్నిక లోపు కనీసం పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని కుట్ర పన్నింది. రామచంద్ర భారతి, సింహయాజి అనే స్వామీజీలను, నందకుమార్ అనే బ్రోకర్‌ను ఇందుకు ఉపయోగించింది.
స్వామీజీలకు సమాజంలో గౌరవం ఉంటుంది. లక్షల మంది వారికి భక్తులుగా ఉంటారు. అలాంటి వారిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు బీజేపీ ప్రయోగించింది. రాష్ర్టాన్ని ప్రాణంగా, కేసీఆర్‌ను దైవంగా భావించే ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమ అధినేత మీద తమకున్న మమకారాన్ని, విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఫార్మ్ హౌస్‌లో బేరసారాలు మాట్లాడుకుందామన్న రాజకీయ దళారుల గురించి పోలీసులకు ముందుగానే సమాచారమిచ్చారు. పోలీసులు గుట్టు రట్టు చేయడంతో ఆ దొంగ స్వాముల నరాలు చచ్చుబడిపోయాయి.
ఈ హఠాత్ పరిణామానికి కుదేలైన తెలంగాణ బీజేపీ నాయకులు ఆ రోజు అర్ధ రాత్రి వరకు ఆ ఘటనపై వివరణ ఇవ్వలేకపోయారు. ఒక్కో ఎమ్మెల్యేకు కోట్లాది రూపాయల తాయిలాలు ఇస్తామని బీజేపీ ఆశ చూపడాన్ని మేధావులు, సామాన్యులు సహించలేకపోయారు. బీజేపీ అరాచకాన్ని తీవ్రంగా నిరసించారు. ఇంత రచ్చ జరుగుతున్నా బీజేపీ నాయకులు బుకాయించడం ఆపలేదు. ఫార్మ్ హౌస్ ఘటనలో సాక్ష్యాలు లేవని రంకెలు వేశారు. ఇదే సమయంలో బ్రోకర్లు, పైలట్ రోహిత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ టేపులను పోలీసులు విడుదల చేశారు. అందులో అమిత్ షా, మోదీ, బీఎల్ సంతోష్ లాంటి బీజేపీ అగ్ర నాయకుల బండారాన్ని దొంగ స్వాములిద్దరూ పూస గుచ్చినట్లు చెప్పారు. ఆధ్యాత్మిక నీతులు చెపుతూ సమాజానికి దారి చూపాల్సిన స్వాములు దారితప్పి మిగతా స్వాములకు తలవంపులు తెచ్చారు. కేసీఆర్ చొరవ, సమయ స్ఫూర్తితో దేశంలోనే ఒక మహా ఘాతుకం సమర్థవంతంగా నివారించబడింది. ప్రజాస్వామ్య దేవతకు వస్ర్తాపహరణం జరగకుండా అపర శ్రీ కృష్ణుడిగా కేసీఆర్ కాపు కాశారు. ప్రలోభాలకు లొంగకుండా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నీతికి నిలబడ్డారు. తెలంగాణను మరో మహారాష్ట్ర కాకుండా అడ్డు పడ్డారు. బీజేపీ దుర్మార్గాలు తెలంగాణలో సాగవు గాక సాగవని సగర్వంగా చాటి చెప్పారు. ప్రజాస్వామ్యమా వర్థిల్లు!
(వ్యాసకర్త : సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
-ఇలపావులూరి మురళీ మోహన రావు