పండుగ పేరులోనే దీవెన. తెలంగాణకు మాత్రమే చెందిన విశిష్టమైన పండుగ. ఇది ఆటల పండుగ.. పాటల పండుగ..పూల పండుగ.. జానపదుల పండుగ. కవిత్వ సంగీతాల మేళవింపు పాటగా.. ఆట నృత్యంగా.. పేర్పు శిల్పంగా..ఆటకొనసాగింపు చిత్రలేఖనంగా.. రూపుకట్టే లలితకళల సమాహార రూపమే బతుకమ్మ పండుగ. చెట్టు.. పుట్ట మట్టి.. చెరువు.. చేను.. పంట.. వంటలతో సంబంధం కలది. సహజ సౌందర్య ప్రతీక.. అడవి పూల పండుగ. పుట్టింటి అనుబంధాల కొనసాగింపు. ఆహార వినిమయాల అనుభూతి. సామాజిక సంబంధాలకు ఆలవాలం.అచ్చట్లు.. ముచ్చట్లు చప్పట్లతో రోజువారీ యాంత్రిక జీవనం నుంచి స్త్రీలకు విముక్తి కలిగించే ఆటవిడుపు.
ధరచోళ దేశ రాజ దంపతుల నూరుగురు కొడుకులు చనిపోయిన తర్వాత లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఆమెనే సత్యవతి గర్భంలో జన్మించింది. కొడుకుల్లా ఆమె చావకూడదని.. బతుకాలనే కాంక్షతో పెట్టిన పేరు బతుకమ్మ. అది మొదలు జరుపుకొనే పం డుగే బతుకమ్మ అని.. రాజు దురహంకారాన్ని నిరసిస్తూ ఆత్మాహుతి చేసుకున్న కన్యకా పరమేశ్వరి స్మరణలో.. రుద్రమదేవిని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన స్త్రీ స్మరణలో బతుకమ్మ పండుగ వచ్చిందని కొందరి అభిప్రాయం. వదినా మరదండ్లకు కాపు స్త్రీలకు జరిగిన చీరల తగాదాలో ఆడబిడ్డ మరదలును చంపిందని కొందరు… మరుదలే ఆడబిడ్డను చంపి పాతి పెట్టినచోట తంగేడు చెట్టు మొలిచిందని.. వాళ్ళ స్మరణలో తంగేడు పువ్వుతో పేర్చి ఆడుకునే పండుగే బతుకమ్మ పండుగ అని కొందరంటారు. మహిషాసురుని చంపి మూర్ఛపోయిన అమ్మవారిని బతుక మంటూ లేపుతున్న పండుగ అంటూ చాలా కథనాలు ఉన్నాయి. ఆలయ ప్రవేశానికి నోచుకోని బహుజనులు అడవి పూలతో జరుపుకొన్న పండుగనే ఈ బతుక మ్మ పండుగ అని మరో కథనం కూడా ప్రచారంలో ఉన్నది. బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాలు ఏమైనా ఇది తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ. పూలను దేవతగా పూజించే అరుదైన పండుగ.
పితృస్వామ్య సమాజంలో మహిళ హక్కులకు దూర మై బాధ్యతలకు తలవంచి జరుగుతున్న పరిణామాలకు నిస్సహాయురాలై భగవంతుడి ఆరాధనలో ముని గితేలింది. ఆ ఆరాధన… ఆధ్యాత్మికతకు జీవితంలో ప్రధాన భాగస్వామ్యాన్ని కల్పించుకున్నది. అందువల్లే బతుకమ్మ పాటలలో ఆధ్యాత్మిక సంబంధ గేయాలు అనేకం చోటుచేసుకున్నయి. ఒకసారి ఆ పాటల్లోకి తొంగిచూసి ఆ భావాలను గమనిద్దాం…
పెండ్లి ప్రాధాన్యం:
జనకుజనకునింట్లా కోల్ – సాజనకునింట్లా కోల్
పుట్టింది ఆ సీతా/ పురుడే కోరింది
చిన్న చిన్న మొంటెల్లా/ చెరుగా నేర్చిందీ
పైడీయ చాటల్లా/ మలువా నేర్చిందీ
వెండీయ జల్లెట్లా/పట్టా నేర్చిందీ
అంటూ పుట్టిన ఆడపిల్ల బాల్యంలో ఆడుతూ పాడుతూ ఇంటి పనులకు తర్ఫీదు పొందడం కనపడుతుంది. ఆమెకు మరో ప్రపంచం లేదు. ఇక పెళ్ళి కాగానే అప్పగింతల కార్యక్రమం. వాటిని శ్రద్ధగా ఆలకించవలసిందే.
అప్పగింతలు:
అత్తామామల పొట్ల (పట్ల) శానా ఒద్దిక కలిగీ ఉండు
పుట్టినింటికి కీర్తిని తెస్తే మళ్లీ నిన్ను తోలుకవస్త
అష్టాకంకణాల చేయి అదిలించి నడువాబోకు
పండుగ పదినాళ్ళున్నాదనగా తోలుకవస్తా.. ఈ పాటను గమనిస్తే అత్తవారింట్లో ఆడపిల్లలు ఎంత ఒద్దికగా ఉండాలో చెప్తూనే ఒకవేళ అట్లా ఉండకపోతే తమకు అపకీర్తి వస్తుందని మముగన్న మా తల్లి అంటూ బతిమిలాడుకుంటున్నారు.
పెట్టువోతలు:
అర్ధరాత్రి జామునా ఉయ్యాలో
ఆలికీ మగనికి ఉయ్యాలో
అర్జునుడు సుభద్రకూ/ అహలుక వేళాయే
తవ్వతో తవ్వెడూ / ఇచ్చిర్రా మీవాళ్ళు
మానతో మానెడు/ ఇచ్చిర్రా మీవాళ్ళు
అరణంపు ఆవులను/ ఇచ్చిర్రా మీవాళ్ళు
కుడువ కంచంగిన్నె/ ఇచ్చిర్రా మీవాళ్ళు
పెట్టువోతల విషయంలో పై విధమైన కొట్లాటలు మనకు తెలియనివి కావు.
పుట్టింటికి తోలుకపోవడానికి అన్న వచ్చినపుడు ఆ చెల్లెలు…
పచ్చీసులాడేటి/ ఓ అత్తగారు
మాయన్నలొచ్చారు/ మమ్మంపుతారా? అని అడిగినపుడా అత్త
వస్తె వచ్చిరిగాని/ ఏమి తెచ్చినారని ప్రశ్నించిందట. అప్పుడా కోడలు
పాపనికి పట్టంగి/ పాలుతాగే గిన్నె
కన్ననికి నిండంగి/ నీళ్ళు తాగే చెంబు అన్న సమాధానం ఇస్తది.
ఇద్దరక్కచెల్లెండ్ల పాటలో
నేతవారు చీర నేసిన తర్వాత
ఆ చీర కట్టుకొని ఉయ్యాలో
కొంగలా బాయికి ఉయ్యాలో
కొంగలాబాయికీ/ నీళ్ళకంటూ పోతె
కొంగలన్నీగూడి/ కొంగంతా చింపె
ఆ చీర కట్టుకొని/ హంసలా బాయికి
హంసలా బాయికి/ నీళ్ళకంటూపోతె
అని పాడుకుంటున్నారు.
రాజరంపాలుని కథ:
సహదేవుడి కొడుకైన రాజరంపాలునితో భస్మరాయడి కూతురైన రూపవతి వివాహం ఢిల్లీ (హస్తినాపురంలో) జరగడానికి నిశ్చయమైతుంది. కానీ, రంపాలునిపై మోజుతో రంభ నాగవెల్లి కాకుండానే వచ్చి
అచ్రాలకట్ట ఉయ్యాలో మీదికెల్లీ దింపి
అది బంగారు బల్లి/ చేసుకున్నాదమ్మ
కొప్పుల అది/ సవరించుకొని
మాయలోకమైతె/ మరి ఎల్లిపోయె
దాంతో అకస్మాత్తుగా పెళ్లికొడుకు కనపడకుండా పోవడం కొత్త కోడలు ఇంట్లో కాలుపెట్టిన సందర్భమనే నిర్ణయానికి వచ్చి అత్తింటి వారు రూపవతిని అడవిలో ఒంటిస్తంభం మేడ కట్టించి ఆమెను పంపియ్యటమే కాక వెంటబోయే దాసీలకు కడుపునిండా ఆమెకు అన్నం పెట్టొద్దని చెప్తుంది. ఈ కథలో రంపాలుడు కనపడకుండా పోవడానికి రూపవతి కారణమని ఆమెకు దట్టమైన అడవిలో నివాసం ఏర్పాటుచేస్తారు. రూపవతి కథ సుఖాంతం కావడం తర్వాత విషయం.
ఈ పాటలను గమనిస్తే పితృస్వామ్యంలో స్త్రీలు అడుగడునా అవమానాలకు లోనైనారు. కుటుంబ.. సమాజ కట్టుబాట్లను స్త్రీలు ప్రశ్నించడానికి అవకాశం లేకుండాపోయింది. ఆమెను ఇంటిచాకిరితోపాటు మగవారు ఏర్పర్చిన కుటుంబ, సమాజ కట్టుబాట్లకు పరిమితం చేసిన్రు. వాటిని అధిగమించలేని స్త్రీ ఆ సంస్కృతీ సంప్రదాయాల ఆధారంగా పాటల రూపంగ నలుగురితో తన కష్ట నష్టాలను పంచుకున్నది. ఇదంతా స్త్రీల జీవన సంఘర్షణే కదా! ఈ సంఘర్షణను మనకు అందించిన బతుకమ్మ పాటలు, ఆ పండుగ ఎంత గొప్పవో.
(అక్షరయాన్ సౌజన్యంతో..)
-డాక్టర్ తిరునగరి దేవకీదేవి ,99496 36515