Fruits In The Morning | మనం ఉదయం పూట తీసుకునే అల్పాహారం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం రోజంతా తీసుకునే ఆహారంలో ఇదే ముఖ్యమైనది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవడానికి సరైన అల్పాహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి కావల్సిన శక్తిని అందించే ఆహారాలతో పాటు మనలో చాలా మంది అల్పాహారంలో పండ్లను కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే అల్పాహారంలో భాగంగా పండ్లను తీసుకోవడంపై మనలో చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి. ఉదయం పూట పండ్లను తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా మంది వీటిని ఉదయం పూట తీసుకోవడానికి సందేహిస్తూ ఉంటారు.
అసలు ఈ అపోహలన్నీ కూడా వాస్తవమేనా.. ఉదయం పూట పండ్లను తీసుకోవచ్చా.. దీనిపై వైద్యులు ఏవిధంగా సలహాలు ఇస్తున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పూట పండ్లను తీసుకోవడం మన శరీరానికి ప్రయోజనకరంగానే ఉంటుంది. ఉదయం పూట తీసుకునే పండ్లు రోజంతా పనిచేయడానికి కావల్సిన శక్తిని అందించడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే వీటిని మితంగా, జాగ్రత్తగా తీసుకున్నప్పుడే మనకు ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి ఉదయం పూట ఒక పండును కచ్చితంగా తీసుకోవచ్చని ఉదయం పూట వ్యాయామం చేసేవారికి ఇది ఎంతో శక్తిని ఇస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ ఒకేరకం పండు కాకుండా కాలానుగుణంగా మనకు లభించే పండ్లను తీసుకోవడం మంచిది.
ఉదయం పూట నారింజ, బత్తాయి పండ్లను తీసుకోవడం వల్ల ఒక రోజుకు కావల్సినంత విటమిన్ సి మనకు లభిస్తుంది. అలాగే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, దానిమ్మ వంటి పండ్లను తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. పుచ్చకాయ వంటి పండ్లను తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటాం. అరటి పండును తీసుకోవడం వల్ల శక్తి స్థాయిలు నిర్వహించబడతాయి. అంతేకాకుండా అరటిపండును తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా ఉంటుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట పండ్లను తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వారు చెబుతున్నారు.
ఎందుకంటే పండ్లల్లో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ హార్మోన్ నుండి స్వతంత్రంగా జీర్ణమవుతాయి. కనుక స్లో షుగర్ గా పని చేస్తాయి. ఇక ఉదయం పూట బాదంపప్పు, వాల్నట్స్ వంటి గింజలను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. ఉదయం పూట పండ్లను తీసుకునే విషయంలో అనేక అపోహలు ఉన్నప్పటికీ అవి అన్నీ కూడా అవాస్తవమని, తగిన మోతాదులో ఉదయం పూట పండ్లను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయినప్పటికీ బరువు తగ్గాలనుకునే, ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు వీటిని మితంగానే తీసుకోవాలి. పండ్లల్లో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కనుక ఉదయం పూట పండ్లను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.