వాళ్లేమైనా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా? ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీ, మంత్రులుగా పనిచేశారు. దశాబ్దాల నుంచి నల్లగొండ రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకొని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. తత్ఫలితంగా వేల కోట్లను కూడబెట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులతో చెలిమి చేసి చెట్టా పట్టాలేసుకొని తిరిగారు. అయినా, జిల్లాకు చెందిన సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? జిల్లాలో ప్రజలను పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను వాళ్లు ఎందుకు పరిష్కరించలేదు? ప్రజల పట్ల వీరికున్న ప్రేమ ఇదేనా? ఇంతేనా?
కేసీఆర్ పాలన కోసం దేశం ఎదురుచూస్తున్నది. కేసీఆర్ వస్తే దేశంలో లభ్యమవుతున్న 70 వేల టీఎంసీల నీళ్లకు ప్రాజెక్టులు వస్తాయి. దేశంలోని 44 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి పూర్తిగా ఆకుపచ్చగా మారుతుంది. 4 లక్షల మెగావాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. ప్రజావ్యతిరేక, విద్వేష ఫాసిస్ట్ బీజేపీ పాలన ఇకచాలు అని ‘బై బై మోదీ-వెల్కం కేసీఆర్’ అంటూ యావత్ దేశ ప్రజలు నినదిస్తున్నారు.
ఇప్పటివరకు మంత్రిగా ఉండి చేయలేని పనులు ఇప్పుడెలా చేస్తారు? బీజేపీ ఇక్కడ అధికారంలో లేదు కదా? భవిష్యత్తులో కూడా తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా? బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు ఇందులో ఒకరు కేంద్రమంత్రిగా ఉన్నా తెలంగాణకు తెచ్చింది, ఇచ్చిందేమున్నది? ఇప్పుడు గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? వాళ్లు చేయనిది, ఇప్పుడు రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తడు? రాజగోపాల్రెడ్డి గెలిస్తే ప్రజలకేమైనా లాభం కలుగుతుందా?
ప్రస్తుత ఉప ఎన్నిక ఎవరివల్ల వచ్చింది? ఎందువల్ల వచ్చింది? ఎందుకోసం వచ్చింది? ఎవరికోసం వచ్చింది? రాజగోపాల్రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలకు అదనంగా ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని 22 వేల కోట్ల కాంట్రాక్టుకు తాకట్టు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఒక వ్యాపారి. ఎప్పుడు తన లాభమే చూసుకుంటాడు. ప్రజలు ఏమైపోయినా సరే పట్టించుకోడు.
‘పార్లమెంటు తలుపులు మూసివేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, తల్లిని చంపి, పిల్లను బతికించారని’ ప్రధాన మోదీ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను, అమరవీరుల బలిదానాలను పార్లమెంటు సాక్షిగా చులకన చేశారు. అయినా బీజేపీలో చేరి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం సందేశాన్నిస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నిక తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, ఉత్తరాది అహంకారానికి మధ్య పోరాటంగా, దక్షిణాదిపై బీజేపీ చేస్తున్న దండయాత్రగానే పరిగణించాలి. చక్రవర్తులు రాజ్యాలపై దండెత్తి అక్రమించినట్లు, కేంద్రంలోని మోదీ బీజేపీ సర్కారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను, ఎమ్మెల్యేలను కొని రాజ్యాంగ సంస్థలైన ఈడీ, ఐటీ, సీబీఐలను గుప్పిట్లో పెట్టుకొని కూల్చివేయడం రాజ్యాంగవిరుద్ధం. సమాఖ్యస్ఫూర్తికి వ్యతిరేకం.
తెలంగాణపై అక్కసు ఎందుకు? ఢిల్లీలోని గుజరాతీ పాలకులకు దక్షిణాది అంటే ముఖ్యంగా తెలంగాణపై ఎందుకీ కళ్లమంటనో ఇక్కడ ప్రస్తావిద్దాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ముఖ్యంగా వ్యవసాయ, నీటిపారుదల రంగంలో ఎన్నో విజయాలు సాధించింది. దాదాపు తొంభై మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రధాని సొంత రాష్ట్రం కంటే మిన్నగా అభివృద్ధిపథంలో నడుస్తున్నది. కాళేశ్వరం లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టును అతితక్కువ సమయంలో నిర్మించి ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రుల పాలనకు సవాల్ విసిరింది. తెలంగాణకు ఎన్నో అవార్డులు, రివార్డులను కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. విద్యారంగంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను కొత్తగా ప్రారంభించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు చేయూతనిచ్చింది. ఇంతేకాకుండా అన్ని రాష్ర్టాలను మించి ఐటీరంగంలో రాకెట్లా హైదరాబాద్ నగరం దూసుకుపోతున్నది. విదేశీ మారక ద్రవ్యాన్ని కోట్లలో ఆర్జిస్తున్నది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటివరకు చెప్పిన ‘గుజరాత్ మాడల్’ తెలంగాణ ముందు వెలవెలపోయింది. గుజరాత్ మోడల్ బోగస్ అని తేలింది. కేసీఆర్ ‘తెలంగాణ మాడల్’ ఆదర్శనీయమైనదని రుజువైంది. అందుకే తెలంగాణ పాలన దేశానికి ‘రోల్ మాడల్’ అయింది.
రాజగోపాల్రెడ్డి గెలిస్తే మునుగోడుకు ఏమొస్తయి?: కులమతాల మధ్య కొట్లాటలు వస్తయి. దేవుళ్లు, విశ్వాసాల మధ్య విద్వేషాలు చెలరేగుతయి. ఇంకా మిగిలి ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు అమ్మబడుతాయి. నిత్యం డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతాయి. రూపాయి ఇంకా పతనమవుతుంది. తెలంగాణ ‘సిరుల సింగరేణి’ని అగ్గువకు అమ్ముకుంటారు. రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్తయి. రైతుల ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతయి.కానీ, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు ఓటువేసి గెలిపిస్తే ఉత్తరాది పెత్తనం ముందు దక్షిణాది తెలంగాణ ఆత్మగౌరవం తలెత్తుకొని ఢిల్లీకి సవాల్ విసురుతుంది. మోటార్లకు మీటర్లు బందైతయి. దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు అమలవుతయి. పండ్లిచ్చే చెట్టుకు నీళ్లు పోస్తే అది మరిన్ని పండ్లుకాసి మనకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. ముళ్ల చెట్టుకు నీళ్లు పోస్తే అది గుంపుగా పెరిగి, మన ప్రయాణానికి అవరోధం కలిగిస్తుంది. ఇపుడు మునుగోడు ప్రజలు తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసుకోవాలనుకుంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలు.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
గురుజాడ బీరయ్య యాదవ్
91777 57440